ఆందోళన కలిగిస్తున్న ‘ముతక’ దాడులు

 New Terror Challenges For India,a Drone Was Used To Attack The Air Force Station In Jammu   - Sakshi

జమ్మూలోని భారత వైమానిక దళ స్థావరం మీద ముతక డ్రోన్లను ఉపయోగించి చేసినట్టుగా చెబుతున్న దాడి కొత్త సవాళ్లను ఎత్తిచూపుతోంది. కల్లోలిత ప్రాంత మైన జమ్మూకశ్మీర్‌లోకి విషమ యుద్ధం ప్రవేశించడం చెడుకు సంకేతం. 2018లో అధికంగా రష్యా కార్య నిర్వహణలో ఉన్న సిరియాలోని హుమాయ్‌మిమ్‌ వైమానిక స్థావరం ఈ డ్రోన్ల దాడికి గురైంది. ఇందులో స్థావరంలో ఉంచిన రష్యా విమానాలు, ఇతర పరికరా లకు తీవ్ర నష్టం జరిగింది. స్వల్ప శ్రేణి ప్రతి–వైమానిక క్షిపణులు, రేడియో జామర్ల సాయంతో కొన్ని డ్రోన్లను కూల్చినట్టుగా రష్యా ప్రకటించింది. జమ్మూలో జరిగిన దాడి హుమాయ్‌మిమ్‌ దాడిని దాదాపుగా పోలివుంది. ఏమైనా వ్యర్థాలు, డక్ట్‌ టేపు ఉపయోగిస్తూ ‘ఐఈడీ’ (మెరుగుపరిచిన పేలుడు పదార్థాలు)లను మోసుకు పోయేలా తయారుచేసిన డ్రోన్లు కోట్లాది రూపాయల విలువైన నేలమీది సంప్రదాయ విమానాలకు నష్టం కలిగించగలవు. వైమానిక విధాన నిర్ణేతలకు ఇది కొత్త సవాళ్లను విసురుతోంది.

తీవ్రవాద గ్రూపుల చేతుల్లోకి డ్రోన్లు రావడం 2013–15 మధ్యకాలంలో సిరియా గ్రామాల్లో మొద లైంది. కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఇస్లామిక్‌ స్టేట్‌ లోకి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువత యూరప్, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి చేరడం, తమకూ ఒక వైమానిక శాఖ ఉండాలన్న ఆలోచన రావడంతో ఏమీ లేనిచోట సిరియా, ఇరాక్‌ యుద్ధ క్షేత్రాల్లోని తుక్కును ఉపయోగించి డ్రోన్లు తయారు చేశారు. క్రమంగా వాణిజ్యంగా అందుబాటులో ఉన్న క్వాడ్‌కాప్టర్లను నవీ కరిస్తూ ఐఈడీలు, ఇతర పేలుడు పదార్థాలు మోయ డానికి ఉపయోగించారు.

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉధృతి కొనసాగుతున్న కాలంలో, రోజువారీ ఎలక్ట్రానిక్స్‌ దుకాణాల్లో కొనుగోలుకు అందుబాటులో ఉండి సినిమాలు, క్రీడలను షూట్‌ చేయడానికి ఉపయోగించే క్వాడ్‌కాప్టర్లు స్మగ్లర్ల ద్వారా సిరియా, ఇరాక్‌లోకి ప్రవేశించాయి. కాన్‌ఫ్లిక్ట్‌ ఆర్మ మెంట్‌ రీసెర్చ్‌ ప్రకారం, 2016 ఆగస్ట్‌లో ఇండియాలో కొనుగోలు చేసిన ఒక డ్రోన్‌ అదే సంవత్సరం అక్టో బర్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో యాక్టివేట్‌ అయింది. అనంతరం అది ఉత్తర ఇరాక్‌లోని తాల్‌ అఫార్‌ చేరింది. తమ డ్రోన్ల దళం ఒకే వారంలో 39 మంది ఇరాకీ సైనికులను చంపడమో, గాయపరచడమో చేశా యని అదే ఏడాది కొద్ది రోజుల తర్వాత ఇస్లామిక్‌ స్టేట్‌ చెప్పుకుంది. ఈ ప్రతి దాడినీ అందులో ఉంచిన కెమె రాల సాయంతో రికార్డ్‌ చేశారు. దీనివల్ల వారి ప్రచార వ్యాప్తికి ప్రచండమైన మేత దొరికినట్టయింది.

అయితే, ఈ తరహా దాడుల నుంచి ఎదురయ్యే భయాలను అవగతం చేసుకోవడంలో ఆటంకాలు న్నాయి. టర్కీ తయారీ బేరక్తార్‌ టీబీ2 డ్రోన్లను అర్మేని యాకు వ్యతిరేకంగా నగోర్నో–కరబాఖ్‌ యుద్ధంలో అజర్‌బైజాన్‌ విజయవంతంగా ఉపయోగించింది. ఇది ఈ తరహా డ్రోన్ల నాణ్యత విశేషంగా పెరగడానికి కార ణమైంది. అంతమాత్రాన ఆ డ్రోన్ల వాడకాన్ని జమ్మూ ఘటనతో పోల్చరాదు. అజర్‌బైజాన్‌– అర్మేనియా యుద్ధం సంప్రదాయబద్ధమైనది, రెండు దేశాల మధ్య జరిగినది, పైగా బేరక్తార్‌ డ్రోన్లు పూర్తిగా సైనికావస రాల కోసం ఉద్దేశించినవి. ఇవి ముతక డ్రోన్లు కావు. ఎందుకు నొక్కిచెప్పాలంటే, దేశంలో జరుగుతున్న చర్చల్లో ఈ సామ్యాన్ని తేవడంలో సవరణ అవసరం కాబట్టి.

గత కొన్నేళ్లుగా ముతక డ్రోన్ల వాడకం పెరిగింది. కొన్ని నివేదికలు సూచిస్తున్నట్టుగా 2019లో మావోయి స్టులు కూడా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఒక పారామిలి టరీ క్యాంపు మీద నిఘా వేయడానికి డ్రోన్‌ ఉపయో గించారు. సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి క్షేత్రాల మీద దాడుల నుంచి, 2018లో వెనిజులా నాయకుడు నికోలస్‌ మదురో మీద హత్యాయత్నం దాకా, ఈ సాంకేతిక పరిజ్ఞాన వాడకం పెరిగింది. ఈ డ్రోన్ల లాంటి విషమ యుద్ధవాతావరణం భారతీయ కోణం నుంచి చూస్తే కొత్తేమీ కాదు. ఈ మోసపు డ్రోన్లను ఒక ప్రమాదంగా 2020 డిసెంబర్‌లోనే ఎయిర్‌ఫోర్స్‌ ప్రధానాధికారి నొక్కి చెప్పారు. కాబట్టి ఈ అంశం ఇప్పటికే స్థావరాల సంరక్షణ, ప్రతిక్రియలోకి వచ్చి చేరవలసింది. మొత్తంగా సాంకేతిక పరిజ్ఞానం గురించే ఒక ప్రతిక్రియ అవసరం ఉండగా, జమ్మూ సంఘటన ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం కేవలం సైన్యానికో, దేశానికో పరిమితం కాదని ఎత్తిచూపింది.
కబీర్‌ తనేజా, ఫెలో, అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌
(హిందుస్తాన్‌ టైమ్స్‌ సౌజన్యంతో) 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top