భయభ్రాంత భారతమా? భయమే ఆయుధమా?

NC Asthana Article On National Crime Situation - Sakshi

సందర్భం

దేశం ఎన్నో విషయాలకు ఉలిక్కిపడు తోంది. అవి 140 పదాల ట్వీట్లు కావొచ్చు, వాట్సాప్‌ సందేశాలు కావొచ్చు, ఫేస్‌బుక్‌ పోస్టులు, ఈ-మెయిల్స్, ఆర్టికల్స్, పుస్తకాలు, పాటలు, నాటకాలు, సినిమాలు... అసలు దేశాన్ని అస్థిరపరచనిది అంటూ ఏదీ లేదు. దేశద్రోహం, మతపరమైన లేదా వర్గపరమైన సెంటిమెంట్లను దెబ్బకొట్టడం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులను గనక సంకేతంగా భావిస్తే దేశం వినా శనానికి దగ్గరగా ఉన్నట్టు. ప్రపంచంలోని ఇంకే దేశమూ రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలు చేశారని ఆరోపిస్తూ తన సొంత పౌరుల మీద ఇన్ని కేసులు పెట్టదు.

ఒకవేళ ఈ కేసులన్నీ వాస్తవమైనవే అయితే, స్పష్టంగా ఈ దేశంలో ఏదో లోపం ఉందని అర్థం. నిర్మాణం లోపభూయిష్టం అయివుండాలి, లేదా ఇక్కడి ప్రజలకు దేశం పట్ల ప్రేమ లేద నుకోవాలి. అలా కానట్టయితే, ‘ఇతరులు’ అనుకునే వాళ్లందరి తోనూ రాజకీయ లెక్కలు సరిచూసుకుంటున్నట్టు. సాధారణంగా ఈ ఇతరులు అనేవాళ్లు ముస్లింలు, వామపక్షీయులు, అర్బన్‌ నక్సలైట్లు, విద్యార్థులు, ఇంకా ఇతర విస్మృత వర్గాలకు చెందిన కార్యకర్తలు. ఇంకోలా చెప్పాలంటే, ఎవరి అభిప్రాయం అత్యధిక ప్రజలను రెచ్చగొట్టేట్టుగా ఉందో వాళ్లు దేశ వ్యతిరే కులు అవుతారు, వాళ్లను రాజ్యపు సర్వశక్తులతో వేటాడుతారు.

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం, 2017–19 మధ్య రాజ్యానికి వ్యతిరేకంగా నమోదైన కేసులు 25,118. సగటున ఏడాదికి 8,533. ఈ రాజ్య వ్యతిరేక నేరాల్లో 93 కేసులు దేశ ద్రోహం(సెక్షన్‌ 124ఎ); 73 కేసులు దేశం మీద యుద్ధం తల పెట్టినవి(సెక్షన్‌ 121 లాంటివి); 58 కేసులు దేశ సమగ్రతకు సంబంధించినవి(సెక్షన్‌ 153బి); 1,226 కేసులు ‘ఉపా’. నిజ మైన తీవ్రవాద దాడి ఒక్కటి కూడా దేశంలో జరగని కాలంలో ‘ఉపా’, ‘దేశద్రోహం’ కేసుల్లో వందల మంది అరెస్టయ్యారు.

దేశంలో ఇంతమంది తీవ్రవాదులు ఉన్నారా? ఎవరైనా కేంద్ర ప్రభుత్వాన్ని హింసామార్గంలో కూలదోయాలని మాట్లా డటం విన్నామా? కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాదులు దేశం నుంచి విడిపోవాలని కోరుకున్నారు. కానీ వాళ్లెప్పుడూ ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోయాలని మాట్లాడలేదు. 2004లో సీపీఐ (మావోయిస్ట్‌) సభ్యులు విప్లవం అన్నారు. వాళ్ల ప్రయత్నంలోని నిరర్థకత అర్థమై వాళ్లు కూడా దాని గురించి మాట్లా డటం మానేశారు. దేశంలో ఇంతమంది తీవ్రవాదులు ఉన్నారంటే, ప్రభుత్వంలో తీవ్ర లోపం ఉందని అర్థం. సుదీర్ఘ కాలంగా ఈ పరిపాలన నడుస్తున్న తీరు ఎంతోమంది యువ కులు, పరిశోధక విద్యార్థులను తీవ్రవాదులుగా మార్చేస్తోందని అర్థం. లేదా ఈ మొత్తం విషయమే ఒక ప్రహసనం.

ప్రపంచంలో బహుశా మన ఒక్కదేశంలోనే 73 ఏళ్ల స్వాతంత్య్రానంతరం కూడా అన్ని రాజకీయ పక్షాల నాయకులు  దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాలని పిలుపునివ్వడంలో ఎంత మాత్రమూ అలసిపోరు. ఇక్కడ పాఠశాలల్లో ప్రారంభం నుంచే దేశభక్తిని ప్రబోధిస్తాం, అయినా చాలామంది దేశానికి అశుభం కోరుకుంటారని తలుస్తాం. నిరంకుశత్వం అనే భావన భారత రాజ్యాన్ని పట్టిపీడిస్తోంది. ఏమాత్రం భిన్నాభిప్రాయం పొడ సూపినా  మన రాజకీయ నాయకులు తీవ్రమైన అభద్రతకు లోనవుతున్నారు. నిర్మాణాత్మకంగా ఏమీచేయనప్పుడు, వాళ్లు చూపగలిగేది రాజకీయ వ్యూహమే. ‘ఒక్కరిని చంపు, పదివేల మందిని భయపెట్టు’ అంటాడు గొప్ప చైనా వ్యూహకర్త సన్‌ ట్జూ. ‘ఒక్కరిని తప్పుడు కేసులో ఇరికించు, పదివేలమందిని భయపెట్టు’ అని భారతదేశం దీన్ని నవీకరించింది.

2017–19 మధ్య 6,250 కేసులు భిన్న వర్గాల మధ్య వైరాన్ని పెంచడం అన్న కారణంతో నమోదైనవి. ఇవన్నీ కూడా సెంటిమెంట్లను దెబ్బతీశారని పెట్టినవి. విశ్వగురువుగా చెప్పు కునే దేశంలోని ప్రజలు ఇంత అతిసున్నిత మనస్కులు అయ్యారా? దైవదూషణ చట్టం మన దగ్గర లేదుగానీ 153ఎ, 295ఎ సెక్షన్లను మితిమీరి వాడటం పరిస్థితిని దానికంటే దిగ జారుస్తోంది. అనుద్దేశపూర్వకంగా ఏదైనా మతాన్ని అవమా నిస్తే అదేమీ నేరం కాదని 1957 నాటి రామ్‌జీ లాల్‌ మోదీ వర్సెస్‌ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా, ద్వేషంతో చేసేదే నేరం. వీళ్లు చాలడం లేదని ఈమధ్య మనకు ‘అంతర్జాతీయ కుట్రదారులు’ కూడా తయారయ్యారు.

1976లో ఒక కేసులో తీర్పిస్తూ వి.ఆర్‌.కృష్ణ అయ్యర్‌ తన మద్దతుదారులకంటే విమర్శకుల నుంచే ఎక్కువగా ప్రభుత్వం నేర్చుకోగలదని వ్యాఖ్యానించారు. అలాంటిది తేలికపాటి హాస్యానికి కూడా పోలీసు కేసులు పెట్టే రోజులొచ్చాయి. అంటే దేశం ‘భయభ్రాంత భారత్‌’ అవుతోందని అర్థం. లేదంటే, తన ప్రజలను పాలించడానికి భయం అనే ఆయుధాన్ని వాడుతోం దని అనుకోవాలి.


ఎన్‌.సి. ఆస్థానా
వ్యాసకర్త విశ్రాంత ఐపీఎస్‌ అధికారి, కేరళ మాజీ డీజీపీ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top