తుది నిర్ణయం ప్రజా ప్రభుత్వానిదే

Making Of Acts Final Decision To Governments - Sakshi

సందర్భం

‘కొత్తగా రూపొందించిన వ్యవ సాయ చట్టాలను ఉపసంహరించు కోవాలి’ అని అత్యున్నత న్యాయ స్థానం కేంద్రప్రభుత్వాన్ని కోరినట్లు, అది సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి తెలియ జేసినట్లు పత్రికల్లో వార్తలు చదివాం. అలా అయితే ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలైనా జరప మని సుప్రీంకోర్టు కోరిందట. ఈ అంశాన్ని పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏమిటి? చట్టాలు చెయ్యడం శాసన వ్యవస్థల రాజ్యాంగ హక్కు. అవి రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే కోర్టులు కలుగజేసుకుని విచారించ వచ్చు, కొట్టేయవచ్చు. ప్రస్తుతం దేశంలో రైతులను రోడ్లమీద పడేసిన వ్యవ సాయ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకం అయినవి కావనీ, కాక పోతే ఒక వర్గం ప్రజల ప్రయోజనాలకు అవి వ్యతిరేకంగా ఉన్నాయనీ కోర్టు భావించినట్లుగా అర్థం అవుతుంది. అందు వల్లనే వ్యవసాయ చట్టాల విషయంలో సుప్రీంకోర్టు ఎక్కు వగా కలగజేసుకోలేదు. తమ సూచనలను కేంద్రం పాటిం చలేదు కాబట్టి ‘దేశంలో రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిపోయిం దనీ, దాన్ని మేము తేలుస్తామనీ ప్రకటించలేదు.  దీన్నిబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, చట్టాలు రాజ్యాంగ వ్యతి రేకం కానంతవరకూ ప్రజాప్రభుత్వానిదే తుది నిర్ణయం. అవి ప్రజావ్యతిరేకం అయితే అందుకు తగిన ఫలితం సదరు ప్రభుత్వం అనుభవిస్తుంది.
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకూ, ప్రభుత్వానికీ మధ్య నిత్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. కొందరు న్యాయ మూర్తులు కొన్ని కేసులను వ్యక్తిగత ప్రతిష్టగా భావిస్తున్నారు. ప్రభుత్వ శాసనాలు రాజ్యాంగ వ్యతిరేకం కానప్పటికీ, వాటిని కొట్టేస్తున్నారు. చట్టసభలను, మంత్రుల్ని, సీఎంని, ఉన్నతాధికారులను బహిరంగంగా చులకన చేస్తున్నారు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక, ఆ ప్రభుత్వం తాను ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే ప్రతిపక్షంగా ఉన్న పార్టీ అడ్డుపడుతుంటుంది. అధికారంలో ఉన్నవారు ఇచ్చే జీవోలు, చేసే చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకం అని భావించి ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వాటిని విచారించి తగు నిర్ణయం చెయ్యాల్సిన కర్తవ్యం న్యాయస్థానా లది. ప్రభుత్వ చట్టాలలోని ప్రజాహితం న్యాయమూర్తులకు నచ్చనంతమాత్రాన వాటిని కొట్టేయడం, ప్రభుత్వంపై నిందలు మోపడం ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేసేదే.

గత ఏడాది కాలంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన సుమారు వంద జీవోలను గౌరవ హైకోర్టు వారు కొట్టేశారు. వీటిలో తొంభై తొమ్మిది శాతం ప్రజా ప్రయోజనాలకు పట్టం కట్టేవే. రాజ్యాంగ వ్యతిరేకం అనిపించేవి ఏమీ లేవు. అయినప్పటికీ ప్రతిపక్ష తెలుగుదేశం పిటిషన్‌ వెయ్యడమే ఆలస్యం అన్నట్లుగా వాటిని కొట్టేస్తు న్నది న్యాయస్థానం. మరొక విడ్డూరం ఏమిటంటే తాను నిర్వహిస్తున్న ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి పదిమంది రోగులు ప్రాణాలు పోగొట్టుకుంటే... సదరు ఆసుపత్రి యాజమాన్యం మీద పోలీసులు చర్యలు తీసుకోరాదని ఆదే శించడం ఏ న్యాయసూత్రాల ప్రకారం ఆమోదయోగ్యం? అమరావతి పేరుతో జరిగిన భూకుంభకోణాల మీద అవి నీతి నిరోధకశాఖ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే ఆ వివరాలు బహిరంగపరచకూడదు అని హైకోర్టు గాగ్‌ ఆర్డర్‌ ఇవ్వడం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఎఫ్‌ఐఆర్‌లో కొందరు న్యాయమూర్తులు, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబ సభ్యుల పేర్లు ఉండటమే అందుకు కారణం. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగా పనిచేసినవారిమీద సైతం కేసులు పెట్టి బోను ఎక్కిస్తున్న మన దేశంలో న్యాయ మూర్తులు అవినీతికి అతీతులని ఎలా భావించాలి? న్యాయ మూర్తుల మీద ఆరోపణలు వచ్చినపుడు నిజం నిగ్గు తేల్చ మని న్యాయస్థానం ఆదేశించివుంటే కోర్టుల పట్ల గౌరవం అంబరాన్ని అంటేది. నేరారోపణలను దాచిపెట్టమని ఆదే శించడం ఏమి న్యాయం?

ఇప్పుడు ప్రభుత్వం, న్యాయస్థానం మధ్య కలతలు సృష్టించిన మరొక అంశం ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’. రాజ్యాంగ విచ్ఛిన్నం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ శాసన వ్యవస్థ, అధికార వ్యవస్థ కుప్పకూలలేదు. రాష్ట్రంలో శాంతి భద్రత లకు విఘాతం ఏర్పడలేదు. ప్రజా తిరుగుబాట్లు లేవు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలగడం లేదు. వ్యవస్థలపై భౌతికదాడులు జరగడం లేదు. తిండి దొరక్క ప్రజలు మలమల మాడిపోవడం లేదు. పరిస్థితులు ఇంత ప్రశాంతంగా ఉన్నప్పుడు రాజ్యాంగ విచ్ఛిన్నం అనే అపభ్రం శపు పదాన్ని ఎందుకు వెలికి తీశారు? రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని, దాన్ని అడ్డుకోవాలని ఎవరైనా కోర్టును ఆశ్ర యించారా? న్యాయమూర్తి తనకు తానే రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని ఎలా భావిస్తారు? తనకు తానే సుమోటోగా ఎలా స్వీకరించి విచారణ జరుపుతారు? అలా విచారణ జరపడానికి వారికి అధికారం ఉన్నదని అనుకుందాం. విచా రణ సందర్భంగా ప్రభుత్వ వాదనలు కూడా ధర్మాసనం ఆలకించాలి కదా! న్యాయస్థానం కోరిన వివరాలు సమర్పిం చడానికి తగిన సమయం ఇవ్వాలి కదా? అసలు ప్రభుత్వ న్యాయవాదుల వాదననే వినడానికి నిరాకరిస్తే ఎలా?  

ఇక జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ధర్మాసనం మీద తమకు నమ్మకం లేదని, ఆయన ధర్మాసనం నుంచి గౌరవప్రదంగా తప్పుకోవాలని అఫిడవిట్‌ దాఖలు చెయ్యడం రాష్ట్ర న్యాయ వ్యవస్థ చరిత్రలోనే సంచలనం అని చెప్పుకోవచ్చు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పు ద్వారా ప్రజలకు ఆ హక్కు సంక్రమించిందట. ఒకరకంగా ఇది ‘నాట్‌ బిఫోర్‌ మీ’ వంటిదే. ఒక జడ్జీగారు విచారిస్తున్న కేసులో పిటిషనర్లు, నిందితుల తరపు వాదిస్తున్న న్యాయవాదులు ఎవరైనా జడ్జీ గారి కుటుంబ సభ్యులో, బంధువులో ఎవరైనా ఉన్నారని అభ్యంతరాలు వస్తే, జడ్జీగారు ఆ విచారణ నుంచి తప్పుకొని మరొక ధర్మాసనానికి కేసును పంపించడం జరుగుతుం టుంది.  ఇక్కడ ప్రభుత్వం వేసిన ఆ పిటిషన్‌ కూడా దాదాపు అలాంటిదే. కేసును విచారిస్తున్న న్యాయమూర్తి మీద తమకు విశ్వాసం లేదని సాక్షాత్తూ ప్రభుత్వమే కోర్టుకు తెలియజేసిన తరువాత ఆ న్యాయమూర్తి ధర్మాసనం నుంచి తప్పుకోవడం ఉత్తమ సంప్రదాయం అవుతుంది. ఇక్కడ జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ అలాంటి సంప్రదాయాన్ని పాటించాలనుకుంటు న్నారో లేదో తెలియదు. న్యాయం చేస్తున్నామని చెప్పుకుంటే చాలదు. చేస్తు న్నట్లు కనిపించాలి. తీర్పులు ఏకపక్షంగా ఉన్నట్లు అనిపించ కూడదు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థల మధ్య ఘర్షణలు తలెత్తినా, అంతిమంగా ప్రజాప్రభుత్వం మాటే చెల్లాలి. అది రాజ్యాంగ వ్యతిరేకం అయినపక్షంలో న్యాయస్థానాలు నిష్కర్షగా అడ్డుకోవచ్చు. రాజ్యాంగ వ్యతిరేకం కానప్పుడు ప్రభుత్వ నిర్ణయాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం ముమ్మాటికీ ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకం. శాసన వ్యవస్థ నిర్ణయమే తుది నిర్ణయం. మొదటి పేరాలో సుప్రీం కోర్టు చెప్పింది అదే.
 
వ్యాసకర్త సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు 
ఇలపావులూరి మురళీ మోహనరావు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top