వ్యూ పాయింట్:
పాడ్‌కాస్ట్: ది ఇండియా స్టోరీ
అతిథి: శశి థరూర్, తిరువనంతపురం ఎంపీ
హోస్ట్: విక్రమ్ చంద్ర, ఎన్డీటీవీ మాజీ సీఈవో
ప్రముఖ రాజకీయవేత్త శశి థరూర్, ‘ది ఇండియా స్టోరీ’ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... ఆధునిక ప్రపంచంలోని అస్థిరతను ‘న్యూ వరల్డ్ డిజార్డర్’గా అభివర్ణించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం గురించి మాట్లాడుతూ, ఘర్షణ పడుతున్న దేశాల మధ్య సయోధ్యకు భారత్ చొరవ చూపాలని అన్నారు. ముఖ్యాంశాలు:
ఆటవికత రాజ్యం ఏలుతోంది!
‘‘ప్రపంచం అస్తవ్యస్తం అయిపోతోంది. దీనిని నేను ‘న్యూ వరల్డ్ డిజార్డర్’ అంటాను. ‘మేము చెప్పిందే శాసనం’ అనే పూర్వపు ధోరణి మళ్లీ వచ్చేస్తోంది! దశాబ్దాలుగా కష్టపడి నిర్మించుకున్న ‘నిబంధనలతో కూడిన వ్యవస్థ’ను ఇప్పుడు పెద్ద దేశాలు తమకు నచ్చితే గుర్తిస్తున్నాయి తప్ప, కచ్చితంగా పాటించాల్సిన బాధ్యతగా భావించడం లేదు. ఈ పరిస్థితుల్లో, చట్టం అధికారాన్ని నియంత్రించే బదులు, అధికారమే చట్టాన్ని తన అదుపులోకి తీసుకుంటోంది. దీనివల్ల ఆటవికత రాజ్యమేలుతోంది. అంటే, బలవంతులు తమకు నచ్చింది చేసుకుంటూ పోతుంటే, బలహీనులు కష్టాలను అనుభవిస్తుంటారు.
రంగస్థల వేదికలా ఐరాస!
‘‘నేడు ఐక్యరాజ్యసమితి పరిస్థితి ఎలా ఉందంటే – ఒక రోగి చుట్టూ అనేక మంది వైద్యులు మూగి ఉన్నట్లు! ఆ వైద్యులందరికీ రోగికి ఉన్న ‘జబ్బు’ ఏంటో తెలుసు, కానీ దానికి ఏ ‘మందు’ ఇవ్వాలనే విషయంలో ఏకాభి ప్రాయం లేదు. ఐక్యరాజ్యసమితిలో అతి ముఖ్యమైన విభాగం అయిన ‘భద్రతా మండలి’ చేష్టలుడిగి ఉంది. అది 2026 నాటి ఆధునిక ప్రపంచాన్ని కాకుండా, ఇంకా 1945 నాటి పాత ప్రపంచాన్నే ప్రతిబింబిస్తోంది. మారు తున్న కాలానికి అనుగుణంగా ఐక్యరాజ్యసమితి తనను తాను మార్చుకోకపోతే, అది కేవలం ఒక ‘నాటక వేదిక’లా మిగిలిపోతుంది. చివరికి గతంలో విఫలమైన ‘లీగ్ ఆఫ్ నేషన్స్’ (నానాజాతి సమితి) లాగే ఇది కూడా తన ప్రాముఖ్యతను కోల్పోయి కనుమరుగవుతుంది.
ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం
‘‘పశ్చిమాసియాలో (గల్ఫ్ దేశాలలో) జరుగుతున్న యుద్ధాలు, భారతదేశానికి సంబంధం లేనివైతే కాదు. అవి మన దేశ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపు తాయి. ముడి చమురు ధర బ్యారెల్ 65 డాలర్ల నుండి 100 డాలర్లు దాటినప్పుడు, వంట గ్యాస్ సరఫరాలో అడ్డంకులు ఏర్పడినప్పుడు, ఆ భారం నేరుగా సామా న్యుల మీద పడుతుంది. దాదాపు 90 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ, పనిచేస్తున్నారు. వారి రక్షణ, వారు పంపించే డబ్బు మన దేశానికి చాలా ముఖ్యం. అందుకే, తటస్థంగా ఉన్న దేశాలన్నింటినీ ఏకం చేసి, ఘర్షణ పడుతున్న దేశాలు తమ పంతాలను వీడి శాంతి వైపు అడుగులు వేసేలా భారత్ నాయకత్వం వహించాలి.
‘స్ట్రాటజిక్ అటానమీ’ అవసరం
‘‘నేను తరచూ చెబుతుంటాను, ఇండియా ఈ ప్రపంచంలో ‘వరల్డ్ వైడ్ వెబ్’ (ఇంటర్నెట్) లాగా ఉండాలి. ఇంటర్నెట్‌లో మనం వేర్వేరు అవసరాల కోసం వేర్వేరు వెబ్‌సైట్‌లకు ఎలా కనెక్ట్ అవుతామో, ప్రపంచ దేశాలతో కూడా అలాగే సంబంధాలు కలిగి ఉండాలి. దీనినే ‘మల్టీ–అలైన్‌మెంట్’ అంటారు. పాత కాలపు ‘కోల్డ్ వార్’ రోజుల్లో ఉన్నట్లు ఏదో ఒక గ్రూపులో (అమెరికా లేదా రష్యా) కచ్చితంగా చేరాల్సిన అవసరం ఇప్పుడు లేదు. మన అవసరాలకు తగ్గట్టుగా మసలుకోవాలి. ఉదాహరణకు: సాంకేతికత, రక్షణ కోసం అమెరికాతో చేతులు కలపాలి. ఇంధనం కోసం రష్యాతో మంచి సంబంధాలు కొనసాగించాలి. అదే సమయంలో, మన సరిహద్దుల్లో చైనా ఆగడాలను అడ్డుకోవాలి. దీనినే ‘స్ట్రాటజిక్ అటానమీ’ అంటారు.
సంకుచితత్వం పనికి రాదు!
‘‘ఐక్యరాజ్యసమితిలో నా అనుభవం నాకు ఒక ముఖ్య మైన సత్యాన్ని నేర్పింది. మీరు కేరళలో ఒక రైతు అయినా, బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయినా, మీ భవిష్యత్తు ఇతర దేశాలతో మనం కలిసుండే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ‘నా ఊరు, నా దేశం’ అనే సంకుచిత స్వభావం ఇప్పుడు పనికి రాదు. ప్రపంచం మొత్తం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్న ఈ కాలంలో, అందరినీ కలుపుకొని పోయే శక్తిగా భారత్ అవతరించాలి.
- ఎడిటోరియల్ టీమ్
The #IndiaStory podcast with @ShashiTharoor on the New World Disorder.
Has the international system broken down completely?
Is multilateralism the best way forward?
How should India react to the Iran war?
Do watch and share your opinion!
https://t.co/zLi5g2eCuP— Vikram Chandra (@vikramchandra) March 20, 2026


