మా బడిని... మాకిచ్చేయండి!

Dr Belli Yadaiah Article On Education system - Sakshi

సందర్భం

కరోనా వైరస్‌ అత్యంత దారుణంగా మానవాళిని బలిగొంటున్న దరిమిలా గత పద హారు నెలలుగా విద్యా సంస్థలన్నీ మూతబడ్డ విషయం తెలిసిందే. శాస్త్ర సాంకేతిక విప్లవం అందించిన మాధ్య మాల సహకారంతో విద్యా కార్యక్రమాలన్నీ ఆన్‌లైన్‌లోకి మారాయి. జూమ్, గూగూల్‌ మీట్, ఫేస్‌బుక్, యుడెమీ, స్కిల్‌ షేర్, కోర్సియా, ఎడెక్స్, ఎడ్‌ యాప్‌ వంటి వర్చువల్, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌కు గిరాకీ పెరిగింది. కోవిడ్‌ నిబంధనల్ని కొంత సడలించి గత జనవరి, ఫిబ్రవరి మాసాల్లో స్కూళ్లు, కాలేజీలు తెరచినప్పటికీ, సెకండ్‌ వేవ్‌ ఉధృతితో విద్యా సంస్థలకు మళ్లీ తాళాలు పడ్డాయి.

కరోనా కారణంగా విద్యార్థుల మేధోభివృద్ధి చెప్ప లేనంతగా కుంటుబడింది. విద్యాలయంతో తమ రోజువారీ భూభౌతిక సంబంధం, ప్రాకృతిక అను భవం స్తంభించిపోవడం మూలాన ఇటు విద్యార్థు ల్లోనూ, అటు ఉపాధ్యాయుల్లోనూ నిరాశ నిస్తేజాలు అలుముకున్నాయి. ఇవాళ దేశంలోని ముప్పై మూడు కోట్లమంది విద్యార్థులు తమ చదువుల్ని తమకివ్వ మని ముక్తకంఠంతో పెద్దల సమాజానికి, ప్రభుత్వా లకు నివేదించుకుంటున్నారు. ఇంట్లో నాలుగ్గోడలకే పరిమితమై పోవటాన పిల్లల సామాజిక ఎదుగుద లకు పెను ఆటంకం ఏర్పడింది. ఈ మొత్తం ఎపి సోడ్‌లో ఆన్‌లైన్‌ టీచింగ్‌ ఉత్త బోన్సాయ్‌ పెంపకం అని రూఢి అయ్యింది. కరోనా కష్టకాలంలో ఆన్‌లైన్‌ తరగ తులు, ఇ–లెర్నింగ్‌ మేలిమి ప్రత్యామ్నాయాలుగా కని పిస్తున్నప్పటికీ, వాటి వ్యవస్థీకృత లోపాల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

ఏ రంగం దెబ్బతిన్నా తిరిగి దానికి ఉద్దీపన ఇవ్వవచ్చు, కానీ విద్యావ్యవస్థలో అట్లా కుదరదు. ఇది కాల సంబంధి, వయో సంబంధి. బాలలు పెరుగు తున్న క్రమంలో విద్య అందకపోతే జ్ఞానశూన్యులుగా మిగిలిపోయి ‘ఖాళీ మెదళ్ల తరం’ ఏర్పడుతుంది. ఇది ఆ సమాజానికి ఎంతో నష్టదాయకం. ప్రస్తుత నయా ఉదారవాద పెట్టుబడిస్వామ్యంలో విద్య ఇంతకు ముందరికంటే ఒక అనివార్యమైన అవసరమైంది. ఇప్పటికీ మనలో కొద్దిమందికి మాత్రమే చదువులు ఉత్తమంగా అందడం, మిగతా వారికి అంతంత మాత్రంగా కూడా అందుబాటులో లేకపోవడం ఒక సాంఘిక విషాదం. ఈ విషాదాన్ని ఆన్‌లైన్‌ విద్యా కార్యక్రమం సైతం అధిగమించలేకపోగా మరింత రాజేసింది. నగరాల్లో, పట్టణాల్లోలాగా ఇంటర్నెట్‌ సౌకర్యం గ్రామాలకు, మారుమూల ఆవాసాలకు విస్త రించకపోవడం, తగినంత సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుశక్తి పేదలకు లేకపోవడంతో పాటు గృహ వాతావరణంలోని అనేక అస్తవ్యస్తతలు పిల్లల చదు వుల మీద ఎనలేని ప్రభావాన్ని చూపుతున్నాయి.

మనది విద్యార్థి కేంద్రక విధానం అని గొప్పలు చెప్పుకుంటున్న సందర్భంలో విద్యార్థి కేంద్రక విధాన లక్ష్యాలైన నమ్రత, సుగమతలకు దరిదాపుల్లో కూడా ఆన్‌లైన్‌ టీచింగ్,  లెర్నింగ్‌ లేకపోవడం దాని ప్రధాన లోపం. ముఖ్యంగా పాఠశాల నుండి విద్యార్థులకు అబ్బే అభివ్యక్తీరణ, నాయకత్వ సామర్థ్యం, జట్టుగా పనిచేయడం లాంటివాటిని ఆన్‌లైన్‌ తరగతులు దెబ్బ తీశాయి. సోషల్‌ ఇంటలిజెన్స్, ఎమోషనల్‌ ఇంటలి జెన్స్, ఎథికల్‌ ఇంటలిజెన్స్‌ వాళ్లకు అందకుండా పోయింది. విద్యార్థులు వాళ్లుగా రూపొందించుకునే వ్యక్తిత్వ నిర్మాణానికి క్యాంటీన్, కారిడార్, ప్లేగ్రౌండ్‌ జ్ఞాపకాలు ఎంతగానో దోహదం పడతాయి. వీటన్ని టినీ కోవిడ్‌ హరించింది. విద్యార్థికి తన అభ్యసన జీవితంలో తన సహపాఠులతో ఏర్పడే స్నేహ సంబంధం చాలా ఉదాత్తమైంది.  ‘ఇతరుల నుండి ప్రత్యక్షంగా నేర్చుకునేదే విద్యార్జనలో ఎక్కువ’ అంటాడు సుప్రసిద్ధ విద్యా తత్త్వవేత్త జాన్‌ డ్యూయీ. ఇందుకు ఏ రకమైన టెక్నికల్‌ కాన్ఫరెన్సింగ్‌ ప్రోగ్రాం లోనూ అవకాశం ఉండదు. అందుకే కంప్యూటర్లకు, మొబైళ్లకు పిల్లలు టాటా చెప్తూ తోట లాంటి, పాట లాంటి, మంచి మాట లాంటి ‘మా బడిని మాకు ఇవ్వండి’ అని ప్రాధేయపడుతున్నారు. సమయానికి   అందాల్సిన పోషకాహారం లాంటి చదువు సంధ్యలు అందినపుడే వాళ్లు ప్రపుల్లం కాగలరు.


డా. బెల్లి యాదయ్య 
వ్యాసకర్త ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా ‘ మొబైల్‌ : 98483 92690

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top