ఆ ఒరవడి దేశానికే ఆదర్శం

Ap CM YS Jagan administration inspires Central Govt - Sakshi

విశ్లేషణ
ఆరేళ్ళ క్రితం ఏర్పడ్డ కొత్త ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ‘ఫస్ట్‌ టర్మ్‌’ యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాదిగా రూపొందిస్తూ వస్తున్న ‘పబ్లిక్‌ పాలసీ’లను, భారత ప్రభుత్వం నేడు సరిహద్దు రాష్ట్రాలకు సరికొత్త మార్గదర్శకాలుగా ఇవ్వడం అనేది పరిశీలకులకు విస్మయం కలిగిస్తున్న అంశం! లక్షలాదిమంది చదువుకున్న యువతను గ్రామ సచివాలయ ఉద్యోగులుగా చేసి, పలు దొంతర్లమయమైన సాంప్రదాయ ‘పవర్‌ పాలిటిక్స్‌’ నుంచి ఈ బహుజన శ్రేణులను నేరుగా ‘ఫంక్షనల్‌ పాలిటిక్స్‌’ స్థాయికి తీసుకువెళ్ళడం అనేది, 1947 తర్వాత దేశంలో జరిగిన అరుదైన పరిపాలనా ప్రయోగం అని చెప్పాలి. నిస్సందేహంగా దేశంలోనే ‘ప్రభుత్వ పాలన’ విషయంలో మున్ముందు ఇదొక ‘లిట్మస్‌ టెస్ట్‌’ అవుతుంది.

‘న్యాయ’మే (జస్టిస్‌) ‘రాజకీయ భావజాలం’ అయినచోట ‘లెజిస్లేచర్‌’ కదలికలకు ఎన్నిరకాల నిర్బంధాలు ఉంటాయనే అంశంపై ఎవరికైనా ‘అకడమిక్‌’ ఆసక్తి కనుక ఉంటే, వారు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడాలి. చిత్రం ఏమంటే– ఇదంతా ఎటువంటి శషభిషలు, ముసుగులు లేకుండా అంతా బాహాటంగానే జరుగుతున్నది. ఇది కొత్త ఘర్షణ, గతంలో ఇది ఇలా లేదు. దాంతో పలు వ్యవస్థల్లో తటస్థ ఆలోచనపరులుగా చలామణిలో ఉన్నవారు ఊగిసలాట లేకుండా నిలదొక్కుకోవడం కష్టమవుతున్నది. అయితే వారిది స్వయంకృతం, ఇన్నాళ్ళుగా వారు తాము అల్లిన నమూనాలు అంతిమం అనుకున్న ఫలితమిది! కొత్త నాయకత్వం ఒకటి వచ్చి, అది తనదైన సొంత రహదారి వేసుకుని, నేరుగా సమాజ మూలాల్లోకి చొచ్చుకుని వెళుతుందని ఎవరనుకున్నారు? దాంతో ఒకటే అలజడి, అడుగు ముందుకేస్తే ఆందోళన. చివరికది ‘ఇంగ్లిష్‌ మీడి యం’కు కూడా ఉలిక్కిపడటం ఇందుకు పరాకాష్ట. రాష్ట్ర పునర్విభజన చట్టం స్ఫూర్తి సూక్ష్మ స్థాయిలో అమలుపర్చడం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ విధి. ఆ చట్టంలో వెనుకబడినవిగా చెబుతున్న రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో అమరావతితో పాటు మరో రెండు రాజధానులు, పాతిక కొత్త జిల్లాలు ఏర్పర్చాలనుకోవడం అంటే, ఏమిటి ఇవన్నీ? ఎవరు అడిగారు? ఇవీ వారి ప్రశ్నలు. వీటికి జవాబు–‘న్యాయమే’ (జస్టిస్‌) ‘పొలిటికల్‌ ఐడియాలజీ’ కావాల్సిన కాలమిది.
 
తెలుగువారి సరిహద్దు రాష్ట్రం ఒడిశాలోని మల్కన్‌గిరి వద్ద 2016 అక్టోబర్‌లో జరిగిన ఎన్‌ కౌంటర్లో 30 మంది మావోయిస్టులు చనిపోయారు. కేంద్ర హోం శాఖ రికార్డులు దీన్ని ఆంధ్ర – ఒడిశా బోర్డర్‌ (ఏఓబీ) అంటున్నప్పటికీ, దీని మంచిచెడులు ఏపీ, తెలంగాణలకు సమంగా వర్తిస్తాయి. అలాగే ఈ ‘ఎన్‌కౌంటర్‌’ మృతుల అంతిమ  సంస్కారాలు రెండు రాష్ట్రాల్లో జరిగాయి. నెల తర్వాత మాజీ జాతీయ భద్రతా సలహాదారుడు ఎం.కె. నారాయణన్‌ ‘ది ఫర్‌ గాటెన్‌ వార్‌’ శీర్షికతో 11 నవంబర్‌ 2016న ఆంగ్ల పత్రిక ‘ది హిందు’లో ఒక వ్యాసం రాశారు. దాన్లో ఆయన –‘పరిపాలనా రంగంలో వున్నవారే కాదు, చివరికి భద్రతా దళాల్లో వున్నవారు, కొన్ని మీడియా వర్గాలు కూడా దీనిని (మల్కన్‌గిరి ఎంకౌంటర్‌ను) ‘ముగింపుకు ఆరంభం’ అంటున్నారు. కానీ అది నిజం కాదు, తెలంగాణలో పాత నక్సలైట్ల జిల్లాలు అన్నింటిలో మళ్ళీ మావోయిస్టు ఉద్యమం పుంజుకోబోతున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయలో మళ్ళీ దాని కదలికలు మొదలయ్యాయి, కాలేజీల్లో, యూనివర్సిటీ క్యాంపస్‌లలో మళ్ళీ అది ‘ఫ్యాషనబుల్‌’గా మారుతున్నది’’ అని హెచ్చరించారు. వీటన్నిటి కంటే– తమిళనాడు, కేరళ, కర్ణాటక (ట్రెజెక్టరీ)లో ఇది ప్రాణం పోసుకుంటున్నదని నారాయణన్‌ చేసిన హెచ్చరిక; మారిన దేశం పటంలో ఈ మూడింటి సరిహద్దున వున్న నూతన తెలుగు రాజధాని అమరావతిని అప్పట్లో నేరుగా తాకిన అంశం!

ఇది జరిగిన రెండేళ్లకు అరకులో అధికార పార్టీ ఎమ్మెల్యే హత్య జరిగింది. అప్పటికి ‘టవర్ల రాజధాని’ నిర్మాణం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా ఉండేది. అయితే, ఇదంతా జరిగిన నాలుగేళ్ళ తర్వాత 2020 జూలై 11న దక్షిణాది రాష్ట్రాల డీజీపీల వీడియో కాన్ఫరెన్స్‌లో కేరళ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో విస్తరిస్తున్న మావోయిస్టు కార్యకలాపాల కట్టడిపై విస్తృతమైన చర్చ జరి గింది. ఇందులో ఉపాధి పేరుతో యువతులు, మహిళలను అనంతపురం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుండి పోర్టు నగరాలు చెన్నై, కోల్‌కతాకు అక్రమ రవాణా వంటి అంశాలు చూసినప్పుడు, 2016 నాటి నారాయణన్‌ చేసిన ముందు చూపు హెచ్చరిక అక్షర సత్యమయింది. ఇది ఇలా ఉంటే, 2020 నాటికి మన సముద్ర సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులు పెనం మీదినుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయింది. దాంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోని బోర్డర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఈ ఏడాది మార్చి 11న కొన్ని రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దేశ సరిహద్దుల్ని మన పక్కనున్న దేశాలతో పంచుకుంటున్న– అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం, బిహార్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్తాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్, లదాఖ్‌ ఆ జాబి తాలో ఉన్నాయి.

ఏప్రిల్‌ 2020 నుంచి అమలులోకి వచ్చేట్టుగా ‘బోర్డర్‌ ఏరియా డెవలప్మెంట్‌ ప్రోగ్రాం’ పేరుతో కేంద్ర హోం శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రశాంత్‌ రాజగోపాల్‌ సంతకంతో వెలువడిన ఆ 13 పేజీల ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇలా ఉంది – ‘‘ఈ దేశం మా మంచి చెడులు పట్టించుకుంటున్నది అనే నమ్మకం మనం ముందుగా అక్కడ జీవించే ప్రజల్లో  కలిగించాలి. అటువంటి ఒక భరోసాతో వాళ్ళు దేశ సరిహద్దుల్లో నివాసం ఉంటున్నప్పుడు, భద్రత, రక్షణ కలిగిన సరిహద్దులు దేశానికీ ఉంటాయి. అందుకోసం అంతర్జాతీయ సరిహద్దుల్లో మారుమూల, దుర్భేద్యమైన  ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కావాలి’’.

ఆ ఉత్తర్వులలోని 9వ పేజీలో అభివృద్ధి చేయవలసిన రంగాల జాబితా ఉంది. ఇదీ దాని వరస – 1. రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణం. 2. ఆరోగ్య రంగంలో మౌలికవసతుల కల్పనకు ఆసుపత్రుల స్థాయి పెంచడం, ఆధునీకరణ, డాక్టర్లు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణం, మొబైల్‌ ఆస్పత్రులు, అంబులెన్స్‌ల అందుబాటు, ఆధునిక వైద్యపరికరాల కొనుగోలు. 3. విద్యా రంగంలో మౌలికవసతుల కల్పనకు స్కూలు భవనాల నిర్మాణం, మరమ్మతులు, అదనపు క్లాసు గదులు, కంప్యూటర్‌ ల్యాబ్స్, లాంగ్వేజ్‌ ల్యాబ్స్, టీచర్లు సిబ్బంది క్వార్టర్లు, హాస్టళ్ళు, డార్మేట్రీల నిర్మాణం. 4. వ్యవసాయ రంగ మౌలికవసతుల కల్పనకు మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మా ణం, జల సంరక్షణ. 5. సామాజిక రంగ మౌలిక వసతుల కల్పన కొరకు అంగన్‌వాడీ భవన నిర్మాణం, కమ్యూనిటీ సెంటర్ల నిర్మాణం. 6. పట్టణాలు, పంచాయతీల్లో స్కూళ్ళలో రక్షిత మంచినీటి వసతి. 7. చిన్న తరహా పరిశ్రమల స్థాపన ప్రోత్సాహానికి మౌలికవసతుల కల్పన. ఏప్రిల్‌ 2020 నుంచి అమలయ్యే ఈ కార్యక్రమం కోసం కేంద్రం ఇచ్చే నిధుల వ్యయం నివేదికను రాష్ట్రాలు ఈ నమూనాలో ఢిల్లీకి పంపాలి అని హోంశాఖ కోరింది.

ఇదే ఎజెండాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాదిపైగా అమలు చేస్తున్న పథకాలు, బాలికలు, స్త్రీలు ప్రయోజనం కేంద్రితంగా వాటిని రూపొందిస్తున్న తీరు, ఇన్నాళ్లుగా నిర్లక్ష్యానికి గురైన వర్గాల సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి నేడు ఆంధ్రప్రదేశ్‌లో సుస్పష్టంగా కనిపిస్తున్నది. ఆరేళ్ళ క్రితం ఏర్పడ్డ ఒక కొత్త ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ‘ఫస్ట్‌ టర్మ్‌’ యువ ముఖ్యమంత్రి ఏడాదిగా రూపొందిస్తూ వస్తున్న ‘పబ్లిక్‌ పాలసీ’లను, భారత ప్రభుత్వం సరిహద్దు రాష్ట్రాలకు సరికొత్త మార్గదర్శకాలుగా ఇవ్వడం, పరిశీలకులకు విస్మయం కలిగిస్తున్న అంశం! లక్షలాది మంది చదువుకున్న యువతను గ్రామ సచివాలయ ఉద్యోగులుగా చేసి, పలు దొంతర్లమయమైన సాంప్రదాయ ‘పవర్‌ పాలిటిక్స్‌’ నుంచి ఈ బహుజన శ్రేణులను నేరుగా ‘ఫంక్షనల్‌ పాలిటిక్స్‌’ స్థాయికి తీసుకువెళ్ళడం, 1947 తర్వాత దేశంలో జరిగిన అరుదైన  పరిపాలనా ప్రయోగం. నిస్సందేహంగా దేశంలోనే ‘పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌’లో మున్ముందు ఇదొక ‘లిట్మస్‌ టెస్ట్‌’ అవుతుంది! ఈ పూర్వరంగంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పని శైలిపై రాజకీయ పక్షాలు, విశ్లేషకులు, మీడియా హౌస్‌లు ఇప్పటి నుంచే ఆయన్ని అంచనా వేయడానికి అంత తొందరపడాల్సిన అవసరం లేదేమో! ఎందుకంటే, 21వ శతాబ్దిలో వివక్ష అంటే సత్యం చుట్టూ దట్టమైన పొరలు అల్లడమే! 


వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విశ్రాంత అధికారి

జాన్‌సన్‌ చోరగుడి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top