చిట్టితల్లుల సాధికారతకు ‘స్వేచ్ఛ’

Andhra Pradesh Swecha Scheme Gives Empowerment to Adolescent Girls - Sakshi

మహిళల నిజమైన సాధికారత గురించి ఆలోచిస్తూ, ఈ దిశగా దేశంలోనే ఏ రాష్ట్రం చేయని సాహసోపేతమైన, ఆదర్శవంతమైన నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా కిశోరబాలి కల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారు ఒక్కరోజు కూడా పాఠశాలకు దూరంకారాదనే సమున్నత ఆశయంతో ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది.

యుక్తవయసు వచ్చిన బాలికలకు రుతుక్రమం సమయంలో కొన్ని సమస్యలు రావడం, వీటి కారణంగా వీరు పాఠశాలకు వెళ్లలేకపోవడం దశాబ్ధాలుగా జరుగుతోంది. దీని కారణంగా వీరు తరగతులకు సరిగా హాజరు కాలేకపోవడం, విద్యలో కొంత వెనకబడటం సర్వసాధారణంగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో కిశోరబాలికల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని రూ. 32 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించి, అమలు చేస్తున్నారు. రుతుక్రమం ఇబ్బందులతో ఏ ఒక్కరూ పాఠశాలకు దూరం కారాదనే సదుద్దేశంతో ప్రతి నెల 10 నాణ్యమైన శానిటరీ నాప్‌కిన్స్‌ను అందించే ప్రక్రియను చేపట్టారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగాన్ని ఖర్చుగా చూడకుండా భవిష్యత్‌ తరాలపై పెట్టుబడిగా భావిస్తూ ప్రోత్సహిస్తున్నారు. జగనన్న విద్యా కానుకగా 9 వస్తువులు, పుస్తకాలు అందిస్తూ చిన్నారుల పాఠశాల విద్య బాధ్యతను ప్రభుత్వం తన భుజాలపై వేసుకుంది. దీనిలో భాగంగా అమలు చేసిన ‘నాడు–నేడు’లో జరిగిన అభివృద్ది ప్రశంసనీయం. దీనిలో భాగంగా ప్రతీ పాఠశాలలో ఏర్పాటు చేసిన నిరంతర నీటి సరఫరా కలిగిన టాయిలెట్లు బాలికల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో దోహదకారిగా నిలుస్తున్నాయి. 

నేడు ప్రారంభించిన స్వేచ్ఛ పథకం బాలికా విద్యను మరో మెట్టు ఎక్కిస్తుంది. పథకం అమలుకు ప్రత్యేక అధికారిగా అధ్యాపకురాలిని ఏర్పాటు చేయడం వలన బాలికలకు తమ భావాలను, ఇబ్బందులను చెప్పుకునే అవకాశం, వాటికి పరిష్కారాలు పొందడం సాధ్యపడుతుంది. పథకంలో భాగంగా రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థినులకు ఉచితంగా నెలకు10 చొప్పున ఏడాదికి 120 బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్స్‌ను ప్రభుత్వమే అందించనుంది. వేసవి సెలవుల్లో సైతం వీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి ముందుగానే విద్యార్థినులకు వీటిని అందించాలనే నిర్ణయం వారిపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి నిబద్ధతకు ఉదాహరణగా నిలుస్తాయి. గ్రామీణ మహిళలపై సైతం దీనిపై అవగాహన కల్పిస్తూ, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా వైఎస్సార్‌ చేయూత దుకాణాల ద్వారా తక్కువ ధరకే నాప్‌కిన్స్‌ అందించడం మరొక మంచి నిర్ణయం. పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం పడకుండా వారి చిన్నారులకు అవసరమైన నాప్‌కిన్స్‌ సైతం రాష్ట్ర ప్రభుత్వం అందించాలనే నిర్ణయం భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలుస్తుంది.

కిశోర బాలికల్లో అవగాహన కల్పించే విధంగా పాఠశాల అధ్యాపకులు, ఏఎన్‌ఎంలతో కార్యక్రమాలు చేపట్టడం, నాప్‌కిన్స్‌ ఉపయోగించే విధంగా ప్రోత్సహించడం, వినియోగించిన నాప్‌కిన్స్‌ సురక్షితంగా డిస్పోజ్‌ చేయడానికి సైతం 6417 ఇన్సినరేటర్లను ఏర్పాటు చేయడం, మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా డస్ట్‌ బిన్‌లు ఉంచడం పర్యావరణానికి మేలు చేసే ప్రయత్నాలుగా మనం భావించవచ్చును. దేశంలో 23 శాతం మంది చిన్నారులు రుతుసంబంధ సమస్యలతో పాఠశాలకు దూరం అవుతున్నారని యుఎన్‌ నివేదికలో పేర్కొన్న పరిస్థితులను మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వేచ్ఛ పథకం నిలుస్తుంది. రాష్ట్రంలో నూరుశాతం కిశోర బాలికలు ‘స్వేచ్ఛ’గా తమ పాఠశాల విద్యను పొందే అవకాశాన్ని ఈ పథకం అందిస్తూ వారి కలలను సంపూర్ణంగా సాకారం చేస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషి యోను పెంపుదల చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయా నికి, లక్ష్యానికి ఇటువంటి పథకాలు పునాదిరాళ్లుగా మారతాయి.


- డాక్టర్‌ దిగుమర్తి సాయి బాల పల్లవి 

అసిస్టెంట్‌ ప్రొఫెసర్, గాయత్రీ విద్యాపరిషత్‌ పీజీ కళాశాల, విశాఖపట్నం

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top