ABVP Foundation Day: దేశ పునర్నిర్మాణం కోసం... | Sakshi
Sakshi News home page

ABVP Foundation Day: దేశ పునర్నిర్మాణం కోసం...

Published Sat, Jul 9 2022 1:05 PM

ABVP Foundation Day 2022: Date, Ambala Kiran Article - Sakshi

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో... దేశంలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం, సమాజ సేవ వంటి భావాలతో విశ్వవిద్యాలయాలు, కళాశాలలను కేంద్రాలుగా చేసుకుని కొందరు యువకులు తాము చదువుతున్న ప్రాంతం నుంచే పని మొదలుపెట్టారు. వీరి లక్ష్యాలలో దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటం, జాతీయ భావన కల్పనకై కృషిచేయడం అత్యున్నతమైనవి. ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు అధికారికంగా 1949 జూలై 9న ‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌’ (ఏబీవీపీ) స్థాపితమైంది. 

అప్పటి నుండి నేటి వరకూ ‘విద్యా రంగం’ అంటే ఒకే కుటుంబం అనే భావనతో పనిచేసింది. కళాశాలల్లో మౌలిక వసతుల లేమి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సహా అనేక ఫీజులకు సంబంధించిన సమస్యలపై పోరాడింది. ఉపకార వేతనాల పెంపుదల, మెరుగైన హాస్టల్‌ వసతులు, గ్రామీణ ప్రాంతాలకు బస్‌ సౌకర్యం వంటి వాటి కోసం ఉద్యమాలు నిర్వహించింది. అంతేకాదు, ‘జాతీయత మా ఊపిరి – దేశభక్తి మా ప్రాణం’ అంటూ దేశంలో ఎక్కడ విచ్ఛిన్నకర సంఘటన జరిగినా అనుక్షణం స్పందిస్తూ దేశ రక్షణలో ఒక వాచ్‌ డాగ్‌ లాగా నిమగ్నమై ఉంది. కశ్మీర్‌లో వేర్పాటువాదుల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ దేశభక్తిని రగిలించడంలో ఈ సంస్థది మరపురాని పాత్ర.

మొదట్లో కొద్దిమందితో ప్రారంభమైన ఏబీవీపీ యాత్ర ఎక్కడా ఆగలేదు. విద్యారంగ సమస్యలతో పాటు జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఏబీవీపీ పని చేస్తూ ఉంది. జాతీయ పునర్నిర్మాణం వ్యక్తి నిర్మాణం ద్వారానే సాధ్యమనేది ఏబీవీపీ నమ్మకం. జాతీయ పునర్నిర్మాణం అంటే చిట్టచివరి వ్యక్తికి కూడా గూడు, గుడ్డ, విద్య, వైద్యం వంటి ప్రాథమిక వసతులు అందించాలి. వ్యక్తిగత జీవన ప్రమాణాలు, సంస్కృతిని కాపాడుకుంటూనే ‘వసుధైక కుటుంబం’ అనే భావనతో పనిచేయడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. ఈ ఏడు దశాబ్దాల ప్రయాణంలో విభిన్న వ్యవస్థలలో ఏబీవీపీ కార్యకర్తలు మంచి మార్పుల కోసం, సానుకూల దృక్పథంతో కృషిచేస్తూ వస్తున్నారు.

– అంబాల కిరణ్, ఏబీవీపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, వరంగల్‌
(జూలై 9న ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం) 

Advertisement
Advertisement