కవితల పండుగ: ఫేమస్‌ కవితలు చూసేద్దామా!

World Poetry Day: Famous Poetry In Telugu - Sakshi

ఫన్‌డే కవర్‌ స్టోరీ

మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవం

‘ప్రపంచమొక పద్మవ్యూహం/ కవిత్వమొక తీరని దాహం’ అన్నాడు శ్రీశ్రీ. కవిత్వం గురించి ఎంత చెప్పుకున్నా కవితాభిమానులకు తీరే దాహం కాదది. కవిత్వం ఒక వాక్కళ. బహుశ వాక్కు పుట్టినప్పుడే కవిత్వమూ పుట్టి ఉంటుంది. కవిత్వం ఒక చిత్కళ.  కవిత్వంలేని భాష లేదు, కవిత్వానికి అందని భావమూ లేదు. కవిత్వం గురించి సవివరంగా చెప్పుకోవాలంటే ఎన్ని ఉద్గ్రంథాలైనా చాలవు. కవిత్వాన్ని సంక్షిప్తంగా చవిచూపడానికి ఒక్క పదునైన వాక్యమైనా సరిపోతుంది. కవిత్వం గురించి ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటే, నేడు (మార్చి 21న) ప్రపంచ కవితా దినోత్సవం. కవిత్వానికి గల సమస్త పార్శవాలనూ స్పృశించడం సాధ్యమయ్యే పనికాదు గాని, ఈ సందర్భంగా ఆధునిక తెలుగు కవుల చమత్కారాల గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం.

ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆద్యులలో ఒకరు కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కర్త అయిన కందుకూరి తన కాలంలోని సాంఘిక దురాచారాలను ఖండించడానికి తన కలానికి పదునుపెట్టారు. సమాజంలోని పెద్దమనుషుల దుర్మార్గాలపై వ్యంగ్యాస్త్రాలను ఎక్కుపెట్టారు. కందుకూరి రాసిన ప్రహసనాలు ఆయన చమత్కార ధోరణికి అద్దం పడతాయి. కందుకూరి ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’ అనే ప్రహసనప్రాయమైన నవల రాశారు. అందులో ఆడుమళయాళాన్ని గురించి వర్ణనలో ఆయన హాస్యం గిలిగింతలు పెట్టిస్తుంది. ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’లోని ‘ఆడుమళయాళం’ పూర్తిగా మహిళల రాజ్యం. అక్కడివారు ‘పత్నీవ్రత ధర్మబోధిని’ అనే ధర్మశాస్త్ర గ్రంథంలోని నియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ఉంటారు. వాటిలో మచ్చుకొకటి...

‘పురుషుండు గార్దభమునున్‌
స్థిరమగు దండనము లేక చెడిపోదురిలన్‌
గరుణ దలంపక నెలకొక
పరిౖయెనం గొట్టవలయు పత్ని పురుషునన్‌’
ఇదంతా ఇప్పటితరం పాఠకులకు  ‘జంబలకిడి పంబ’ సినిమాను తలపిస్తుంది.

కందుకూరి ప్రహసనాల్లో ‘కలిపురుష శనైశ్చరవిలాసం’ ఒకటి. అందులో మద్యానికి ఎంగిలి లేదంటూ వ్యంగ్యంగా చెప్పిన పద్యం...
‘పొగచుట్టకు సతిమోవికి
అగణితముగ మద్యమునకు అమృతమునకున్‌
తగ నుచ్చిష్టము లేదని
ఖగవాహను తోడ కాలకంఠుడు బలికెన్‌’

గురజాడ అప్పారావు తన ‘కన్యాశుల్కం’ నాటకంలో ఇదే పద్యాన్ని వెంకటేశం నోట పలికిస్తారు. అంతేకాదు, ఇదే పద్యాన్ని అనుకరిస్తూ, గిరీశం పాత్రతో ఇలా చెప్పిస్తారు:
‘‘ఖగపతి యమృతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్‌
పొగచుటై్ట జన్మించెను
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్‌’’
‘కన్యాశుల్కం’ నాటకం ఆద్యంతం హాస్యభరితంగానే సాగుతూ, ఆనాటి సమాజంలోని దురాగతాలను కళ్లకు కడుతుంది. 

హాస్యానికి మారుపేరైన కవులలో చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రహసనాలు కూడా రాశారు. ఆయన రాసిన ‘అద్భుత కవిత్వ ప్రహసనం’లో ప్రాచీన కవిత్వం పాషాణమని, నవీన కవిత్వం గొప్పదని గురువుతో చెబుతారు శిష్యులు. వారు వెలగబెట్టిన నవీన కవిత్వానికి ఒక మచ్చుతునక...
‘తోటకూర తెచ్చి దొడ్డిలోన తరిగి
కుండలోన బెట్టి కుదమగాను
కింద మంటబెట్ట ఉడకకేం జేస్తుంది
దాని కడుపు కాల ధరణిలోన’
ఇక చిలకమర్తివారు రాసిన పకోడి పద్యాలు సుప్రసిద్ధాలు. అయితే, తిరుపతి వేంకట కవులు కూడా పకోడిపై ఒక చమత్కార పద్యం చెప్పారు. కరకరలాడే ఆ పద్యం ఇదీ:
‘కరకరలాడు కొంచెమగు కారము గల్గు బలాండు వాసనా
హరమగు గొత్తిమీరయును నల్లము గన్పడు నచ్చటచ్చట
ధరను బకోడిబోలెడు పదార్థము లేదని తద్రసజ్ఞు లా
దరమున బల్కుచుందు రదితాదృశమే యగునంచు దోచెడిన్‌’
ఇలాంటివన్నీ ఆధునిక సాహిత్యం తొలినాళ్లలోని చమత్కారాలకు ఉదాహరణలు.

‘మహాప్రస్థానం’తో శ్రీశ్రీ కవనరంగంలో కదం తొక్కడం ప్రారంభించాక కొత్త ఊపు వచ్చింది. విప్లవకవిగా ముద్రపడిన శ్రీశ్రీ ‘సిప్రాలి’లో చమత్కార కవిత్వంతో పాటు పేరడీ గారడీలూ చేశాడు. ‘సిరిసిరిమువ్వ’ మకుటంతో కంద పద్యాలు, ‘ప్రాసక్రీడలు’, ‘లిమరిక్కుల’తో కలిపి ‘సిప్రాలి’గా తీసుకొచ్చిన పుస్తకంలో శ్రీశ్రీ కవితా చమత్కారం పూర్తిస్థాయిలో కనిపిస్తుంది. ‘పంచపదుల్లో’ శ్రీశ్రీ కవితా హాస్యం చూడండి... ఇవి నిజంగా ‘పంచ్‌’పదులు.
‘అరవ్వాడి దోసై
మీద తోచించి వ్రాశై
ఏవో విట్లు వేశై
ఏవో ఫీట్లు చేశై
తర్వాత చూసుకుందాం ప్రాసై...’
‘పెరిగితే వ్యాపార దృష్టి
మరిగితే లాభాల సృష్టి
దొరికితే అమెరికా ముష్టి
మిగిలేది విగ్రహపుష్టి
నైవేద్య నష్టి!’

ఆరుద్ర ‘కూనలమ్మ పదాలు’, ‘ఇంటింటి పజ్యాలు’లో చమత్కారమే ప్రధానంగా కనిపిస్తుంది. ఆరుద్ర చమత్కారానికి ఓ రెండు మచ్చు తునకలు 
‘కోర్టుకెక్కిన వాడు
కొండనెక్కిన వాడు
వడివడిగ దిగిరాడు
ఓ కూనలమ్మా!’
‘బ్రూటుకేసిన ఓటు
బురదలో గిరవాటు
కడకు తెచ్చును చేటు
ఓ కూనలమ్మా!’
పేరడీ గారడీలు

‘మహాప్రస్థానం’లో శ్రీశ్రీ ‘నవకవిత’ శీర్షికన...
‘‘సిందూరం, రక్తచందనం
బందూకం, సంధ్యారాగం
పులిచంపిన లేడినెత్తురూ 
ఎగరేసిన ఎర్రనిజెండా
రుద్రాలిక నయన జ్వాలిక
కలకత్తా కాళిక నాలిక
కావాలోయ్‌ నవకవనానికి...’’ అంటూ ఉద్వేగభరితంగా రాసిన కవితకు ‘జరుక్‌ శాస్త్రి’గా ప్రసిద్ధుడైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఇలా పేరడీ రాశారు.
‘‘మాగాయీ కందిపచ్చడీ
ఆవకాయ, పెసరప్పడమూ
తెగిపోయిన పాతచెప్పులూ
పిచ్చాడి ప్రలాపం, కోపం
వైజాగులో కారా కిల్లీ
సామానోయ్‌ సరదాపాటకు...’’ 
శ్రీశ్రీ ఒరిజినల్‌ కవిత ఎంత ఉద్వేగం కలిగిస్తుందో, జరుక్‌ శాస్త్రి పేరడీ కవిత అంతకు మించి నవ్వులు పూయిస్తుంది. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కవితలకు జరుక్‌ శాస్త్రితో పాటు మాచిరాజు దేవీప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వంటి వారెందరో పేరడీలు రాశారు.
మహాప్రస్థానంలో శ్రీశ్రీ 
‘పొలాలనన్నీ 
హలాల దున్నీ
ఇలాతలంలో హేమం పండగ
జగానికంతా సౌఖ్యం నిండగ...’ అంటూ రాసిన కవితకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఇలా పేరడీ రాశారు:
‘అవాకులన్నీ
చవాకులన్నీ
మహారచనలై మహిలో నిండగ
ఎగబడి చదివే పాఠకులుండగ
విరామమెరుగక పరిశ్రమిస్తూ
అహోరాత్రులూ అవే రచిస్తూ
ప్రసిద్ధికెక్కే కవి పుంగవులకు
వారికి జరిపే సమ్‌మానాలకు
బిరుదుల మాలకు
దుశ్శాలువలకు
కరతాళాలకు ఖరీదు లేదోయ్‌...’
పేరడీ కవులు కొందరు ప్రాచీన పద్యాలకు సైతం పేరడీలు రాశారు. పోతన భాగవతంలో రాసిన ‘వారిజాక్షులందు వైవాహికములందు’ అనే శుక్రనీతి పద్యానికి డాక్టర్‌ వెలుదండి నిత్యానందరావు పేరడీ పద్యం చూడండి...
‘పదవి వచ్చు వేళ పదవి పోయెడు వేళ
ప్రాణమైన పదవి భంగమందు

కూడబెట్టినట్టి కోట్ల రక్షణమందు
బొంగకవచ్చు నఘము పొందడధిప’

పోతన భాగవత పద్యాలకు పేరడీలు రాసిన వారిలో పులికొండ సుబ్బాచారి ఒకరు. ‘కలడు కలండనువాడు కలడో లేడో..’ అనే పద్యానికి ఆయన రాసిన పేరడీ ఇది:
‘కలదందురు మంజీరలొ
కలదందురు గండిపేట కాలువలందున్‌
కలదందురు పంపులలో
కలదు కలందనెడు నీరు కలదో లేదో!’

శ్రీశ్రీకి గురుతుల్యుడైన అబ్బూరి రామకృష్ణారావు కూడా పోతనను పేరడీ చేశారు. భాగవతంలో పోతన రాసిన ‘అరయన్‌ శంతనుపుత్రునిపై విదురుపై నక్రూరుపై కుబ్జపై...’ అనే పద్యానికి అబ్బూరి వారి పేరడీ ఇదీ...
‘వడపై, నావడపై, పకోడిపయి, హల్వాతుంటిపై, బూందియాం
పొడిపై, నుప్పిడిపై, రవిడ్డిలిపయిన్, బోండాపయిన్, సేమియా
సుడిపై చారు భవత్కృపారసము నిచ్చో కొంతరానిమ్ము నే
నుడుకుం గాఫిని ఒక్కచుక్క గొనవే! ఓ కుంభదంభోదరా!’

శ్రీశ్రీ కవితలకు పేరడీలు రావడం ఒక ఎత్తయితే, శ్రీశ్రీ తానే స్వయంగా పేరడీ గారడీలు చేయడం విశేషం. శ్రీశ్రీ తన ‘సిప్రాలి’లో సుమతీ శతకంలోని ‘ఏరకుమీ కసుగాయలు...’ పద్యానికి చేసిన పేరడీ... 
‘కోయకుమీ సొరకాయలు
వ్రాయకుమీ నవలలని అవాకులు చెవాకుల్‌
డాయకుమీ అరవ ఫిలిం
చేయకుమీ చేబదుళ్లు సిరిసిరిమువ్వా!’

వేమన పద్యాలకైతే పేరడీలు కొల్లలుగా వచ్చాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి ప్రసిద్ధులే కాకుండా, కొందరు అజ్ఞాత కవులు కూడా వేమన పద్యాలకు చమత్కారభరితమైన పేరడీలు రాశారు. వేమన పద్యాలకు కొన్ని ఆధునిక పేరడీలు చూడండి...

‘కల్లు సారా బ్రాండి కడుపార త్రాగరా
జంకు గొంకు లేక పొంకముగను
ఏది దొరకనపుడు ఎండ్రిను ద్రాగరా
విశ్వదాభిరామ! వినుర వేమ!

‘గంగిగోవు పాలు గంటెడే చాలునా
కడివెడేడ దొరుకు ఖరముపాలు
భక్తి కలుగు కూడు పట్టెడే చాలునా
విశ్వదాభిరామ! వినుర వేమ!’
ఈ రెండూ వేమన పద్యాలకు అజ్ఞాత కవుల పేరడీలు. వేమనకు దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరడీ మచ్చుకొకటి...
‘వేదవిద్య నాటి వెలుగెల్ల నశియించె
గారె బూరె పప్పుచారె మిగిలె
బుర్ర కరిగి బొర్రగా మారెరా
విశ్వదాభిరామ వినురవేమ’

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక అజ్ఞాతకవి నీచుల రాజ్యం వచ్చినందుకు బాధపడుతూ వ్యంగ్యంగా చెప్పిన ఈ పద్యాలు నవ్వులు పూయించక మానదు... దాదాపు ఉర్దూలోనే రాసిన ఈ పద్య సంభాషణనుు చూడండి...
‘లుచ్ఛా జమాన ఆయా
అచ్ఛోంకో హాథ్‌ దేన హర్‌ ఏక్‌ సీకా
అచ్ఛా జమాన ఫిర్‌ కబ్‌
వచ్చేనా చెప్పవయ్య వల్లీసాబూ!’ 

(నీచుల రాజ్యం వచ్చింది. మంచివాళ్లకు చెయ్యిచ్చే పద్ధతిని ప్రతివాడూ నేర్చాడు. మళ్లీ మంచికాలం ఎప్పుడొస్తుందోయ్‌ వలీ సాహెబు) అని అడిగితే, 
‘బందేనవాజ్‌ బుజురుగ్‌
జిందాహై ఆజ్‌తో న జీతే హం ఖుదా
బందాహి జానె వహసబ్‌ 
గందరగోళం జమాన ఖాజాసాబూ!
(చేసిన మంచి పనుల వల్ల దేశసేవకులు, పుణ్యపురుషులు అలా ఉన్నారు. మనం అలా జీవించలేం. ఇప్పటికీ భగవద్భక్తుడు సేవకుడే ఈ విషయాలను తెలుసుకోవాలి. అయినా ఖాజా సాహెబూ! ఇప్పుడంతా గందరగోళం కాలం వచ్చింది కదా) అని బదులిచ్చాడు. 

తెలుగు కవిత్వంలో ఇలాంటి చమత్కారాలు కోకొల్లలు. ఆధునిక కవులలో వికటకవులుగా, హాస్యకవులుగా పేరుపొందిన వారు మాత్రమే కాదు, సంప్రదాయకవులుగా, భావకవులుగా, విప్లవకవులుగా ముద్రపడినవారు సైతం తమ కవిత్వంలో చమత్కారాలూ మిరియాలూ తగుపాళ్లలో నూరారు. స్థలాభావం కారణంగా ఇక్కడ ప్రస్తావించలేకపోయిన కవులలో కూడా ఎందరో మరెందరో పాఠకులకు చవులూరించే కవితలు చెప్పి భళాభళి అనిపించారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా అందుకోండి ఈ కవనవ్వుల నజరానాలు.
 
ఆధునిక చాటువులు
స్వతంత్ర కావ్యాలు రచించి ప్రసిద్ధులైన ఆధునిక కవులు కొన్ని సందర్భాలలో హాస్యరసభరితమైన చమత్కార చాటువులు చెప్పారు. వాటిలో కొన్ని...
‘శివతాండవం’తో ప్రసిద్ధులైన పుట్టపర్తి నారాయణాచార్యులు శ్రీనాథుడికి తీసిపోని రీతిలో చెప్పిన చిలిపి చాటువుల్లో మచ్చుకొకటి...

‘గజగమన గాదు ఇయ్యది
గజసదృశ శరీర సీటు కంతయు తానై
అజగరమై కూర్చున్నది
గజిబిజిౖయె పోయె మనసు కన్నులు గూడన్‌’

‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి స్వతంత్ర కావ్యాల్లో హాస్యం తక్కువగానే ఉన్నా, ఆయన సందర్భోచితంగా సంధించిన చమత్కార చాటువులు లేకపోలేదు. ఆయన చెప్పిన ఒక చమత్కార పద్యం...

‘చదువురాని వేళ ‘చంకరుండ’న్నాడు
చదువుకొనెడి వేళ ‘సంకరుండ’నె
చదువు ముదిరిపోయి షంకరుండనెనయా
స్నిగ్ధ మధురహాస! శ్రీనివాస!
మిశ్రభాషా కవనవినోదం
ఆధునిక కవుల్లో ఇంగ్లిషు, ఉర్దూ భాషలను తెలుగుతో కలగలిపి మిశ్రభాషా కవిత్వం చెప్పి నవ్వులు పూయించిన వారు ఉన్నారు. బ్రిటిష్‌ పాలనలోని ఆంధ్ర ప్రాంతంలోని కవులు తెలుగు పద్యాల్లో యథేచ్ఛగా ఇంగ్లిషును వాడుకుంటే, నిజాం పాలనలోని తెలంగాణ ప్రాంత కవులు తమ ఉర్దూ పాటవాన్ని ప్రదర్శించారు. మిశ్రభాషా కవనవినోదానికి కొన్ని ఉదాహరణలు...
సామాజిక దురాచారాలను నిరసిస్తూ్త నాటకాలు రాసిన ప్రముఖులలో కాళ్లకూరి నారాయణరావు ఒకరు. మధుపానాసక్తత మితిమీరిన ఆధునిక జీవనశైలిని వెటకరిస్తూ ‘మధుసేవ’ నాటకంలో ఆయన హాస్యస్ఫూర్తికి ఉదాహరణగా నిలిచే పద్యం...
‘మార్నింగు కాగానె మంచము లీవింగు
మొఖము వాషింగు చక్కగ సిటింగు
కార్కు రిమూవింగు గ్లాసులు ఫిల్లింగు
గడగడ డ్రింకింగు గ్లాసులు గ్రంబులింగు
భార్యతో ఫైటింగు బయటకు మార్చింగు
క్లబ్బును రీచింగు గాంబులింగు
విత్తము లూసింగు చిత్తము రేవింగు
వెంటనే డ్రింకింగు వేవరింగు 
మరల మరల రిపీటింగు మట్టరింగు
బసకు స్టార్టింగు జేబులు ప్లండరింగు
దారిపొడుగున డాన్సింగు థండరింగు
సారె సారెకు రోలింగు స్రంబలింగు’

నవ్వులను విశ్లేషించి వివరించిన హాస్యరచయిత భమిడిపాటి కామేశ్వరరావు కూడా తెలుగులో ఇంగ్లిషును రంగరించి...
‘ది స్కై ఈజ్‌ మబ్బీ...
ది రోడ్‌ ఈజ్‌ దుమ్మీ
మై హెడ్‌ ఈజ్‌ దిమ్మీ...’ 
అంటూ కవిత చెప్పారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top