21 దేశాలకు ‘రక్షణ’ మహిళలు

Women Defence Minister Special Story In Family - Sakshi

మహిళల రక్షణకు దేశాలు. దేశాల రక్షణకు మహిళలు.ప్రపంచం సురక్షితం అవుతోంది. రఫేల్‌ స్ట్రాంగ్‌ వెపన్‌. రఫేల్‌ని మించిన శక్తి.. ఉమన్‌. డిఫెన్స్‌లోకి వెపన్‌. డిఫెన్స్‌ మినిస్టర్‌గా ఉమన్‌. మహిళకు సాధికారమే..దేశానికి సార్వభౌమాధికారం. 

ఏ తల్లయినా బిడ్డని గాల్లోకి ఎగరేసి పట్టుకోవడం చూశామా? సాధారణంగా అలా తండ్రి చేస్తాడు! ఆడిస్తాడే కానీ.. ఫ్యాన్‌ తగులుతుందా, తల వెళ్లి పైకప్పుకు తాకుతుందా అని చూసుకోడు. మహిళల చేతుల్లో దేశాలు ఎందుకని అంత సురక్షితంగా ఉంటాయీ అంటే.. ఇదిగో.. వాళ్ల లాలన, పాలన పురుషులు పిల్లల్ని కాపుకాసే తీరుకు భిన్నంగా.. భద్రతతో కూడి ఉంటాయి. ఆ మహిళలు ప్రధానులే అయినా, రక్షణమంత్రులే అయినా. అందుకే కావచ్చు, దేశ చరిత్రలోనే తొలి పూర్తిస్థాయి మహిళా రక్షణ మంత్రిగా మూడేళ్ల క్రితం నిర్మలా సీతారామన్‌ కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినప్పుడు నెలకొన్న ఉత్తేజమే గురువారం హర్యానాలోని అంబాలాలో భారత వైమానిక దళంలోకి ఫ్రాన్స్‌ నుంచి తెప్పించిన రఫేల్‌ యుద్ధ విమానాలను ప్రవేశ పెడుతున్నప్పుడు ఆ దేశ మహిళా రక్షణ శాఖ మంత్రి ఫ్లారెన్స్‌ పార్లీ కూడా ఉండటం పునరుత్తేజం అయింది.

నిర్మలా సీతారామన్‌ నేటికీ రక్షణ మంత్రిగా ఉండి ఉంటే.. రెండు దేశాల మహిళా రక్షణ శాఖల మంత్రుల సమక్షంలో రఫేల్‌ను లాంఛనంగా ఎక్కుపెట్టడం అన్నది స్త్రీ శక్తికి సంకేతంగా నిలిచిన ఒక అపూర్వ సందర్భం కూడా అయి ఉండేది. సీతారామన్‌ 2017 సెప్టెంబరులో రక్షణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త మంత్రివర్గంలో ఆర్థికశాఖ మంత్రి అయ్యారు. ఫ్లారెన్స్‌ పార్లీ 2017 జూన్‌ నుంచీ ఫ్రాన్స్‌ రక్షణశాఖ మంత్రిగా ఉన్నారు. 

ఫ్రాన్స్‌తోపాటు ప్రస్తుతం 21 దేశాలకు మహిళలు రక్షణ మంత్రులుగా ఉన్నారు! పూర్వపు మంత్రులను కూడా తీసుకుంటే ఈ జాబితా వందకు పైగానే ఉంటుంది. ప్రత్యేకంగా రక్షణ శాఖను చేపట్టిన మహిళలతో పాటు, రక్షణ శాఖను కూడా తామే నిర్వహిస్తున్న ప్రధానులూ ఇందులో ఉన్నారు. భారతదేశ తొలి మహిళా రక్షణ శాఖ మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీనే అయినప్పటికీ ప్రధానిమంత్రిగా ఉంటూ ఆమె ఆ శాఖను చేపట్టారు తప్ప, ప్రత్యేకంగా కాదు. తొలిసారి 1975 నవంబర్‌ 30 నుంచి 1975 డిసెంబర్‌ 20 వరకు ఇరవై ఒక్క రోజులు, రెండోసారి 1980 జనవరి 14 నుంచి, 1982 జనవరి 15 వరకు రెండేళ్లు ఆమె రక్షణశాఖ బాధ్యతలను నిర్వహించారు. రక్షణ శాఖకు పూర్తిస్థాయి తొలి మహిళా మంత్రి మాత్రం నిర్మలా సీతారామనే. 

రఫేల్‌ యుద్ధ విమానాలు సరిగ్గా సమయానికి (చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య) మన సైనిక బలగాల్లో చేరాయి. ఈ ప్రత్యేక తరుణంలో ఫ్లారెన్స్‌ పార్లీ మాట్లాడిన రెండు మాటలు కూడా ఒక మహిళా మంత్రి మాత్రమే మాట్లాడగలరు అన్నంత స్నేహశీలంగా ఉన్నాయి. ఆమె ప్రసంగం లో ఎక్కడా కూడా రఫేల్‌ని వాళ్లు అమ్మినట్లు, మనం కొనినట్లు లేదు. ‘‘ఇది రెండు దేశాల విజయం’’ అన్నారు. 57 ఏళ్ల ఫ్లారెన్స్‌ పార్లే రక్షణ శాఖ మంత్రి అయే ముందు వరకు ఫ్రెంచ్‌ నేషనల్‌ రైల్వే కంపెనీ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. అంతకన్నా పూర్వం ‘ఎయిర్‌ ఫ్రాన్స్‌’కు డిప్యూటీ జనరల్‌ డైరెక్టర్‌. రాజకీయాల్లోకి రాక ముందు పౌర సేవల అధికారిగా, వ్యాపార నిపుణురాలిగా సేవలు అందించారు. పారిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పొలిటికల్‌ స్టడీస్‌ అండ్‌ ది నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ లో డిగ్రీ చేశారు ఫ్లారెన్స్‌.
                     

21 దేశాలకు ‘రక్షణ’ మహిళలు
బంగ్లాదేశ్‌ (షేక్‌ హసీనా), దక్షిణాఫ్రికా (నొసివివె మపిసా న్క్వాకులా), నికారగువా (మార్తా ఎలినీ రూయిజ్‌ సెవిల్లా), కెన్యా (రేచల్‌ ఓమామో), ఉత్తర మాసిడోనియా (రాడ్మిల్లా సేకెరిన్‌స్కా), అల్బేనియా (ఆల్టా క్షాకా), సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ (మ్యారీ నోల్‌ కొయారా), నెదర్లాండ్స్‌ (ఆంక్‌ బిజ్లెవెల్డ్‌), స్పెయిన్‌ (మార్గరీటా నోబెల్స్‌), జింబాబ్వే (ఓప్పా ముచింగురి), మాల్దీవులు (మారియా అహమ్మద్‌ దీదీ), స్విట్జర్లాండ్‌ (వయోలా ఆమ్హెర్డ్‌), గాబన్‌ (రోస్‌ క్రిస్టీన్‌ రపోండా), సాలమన్‌ దీవులు (లనెల్‌ తనంగడ), ఆస్ట్రేలియా (లిండా రేనాల్డ్స్‌), డెన్మార్క్‌ (ట్రైన్‌ బ్రామ్సెన్‌), జర్మనీ (అన్నెగ్రెట్‌ క్రాంప్‌ క్యారెన్‌బేయర్‌), ఆస్ట్రియా (క్లాడలియా టేనర్‌), లెబనాన్‌ (జైనా అకార్‌), దక్షిణ సూడాన్‌ (ఏంజెలీనా టెనీ), ఫ్రాన్స్‌ (ఫ్లారెన్స్‌ పార్లీ).

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top