వంట కాదు బాబోయ్‌... భగ భగ మంట... ఇవిగో టిప్స్‌ | While Cooking best tip to beat Summer Heat in the Kitchen | Sakshi
Sakshi News home page

వంట కాదు బాబోయ్‌... భగ భగ మంట... ఇవిగో టిప్స్‌

Apr 29 2026 1:07 PM | Updated on Apr 29 2026 1:50 PM

While Cooking best tip to beat Summer Heat in the Kitchen

ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటితే చాలు... వంటింట్లో అడుగుపెడితే నరకం. స్టవ్‌ సెగ ఒకవైపు, బయట ఎండ ఒకవైపు. చూస్తే 45 డిగ్రీలు... చేయాల్సింది మూడు పూటలా వంట! ఆడవాళ్లకి చికాకు రాకుండా ఎలా? చల్లగా, కూల్‌గా వంట చేసుకోవడం ఎలా? ఇంటి మగాళ్లూ... మీరూ చేయాల్సింది ఉంది. 

వంట... నూరేళ్ల తంట. అది ఒక రోజుతో అయ్యేది కాదు... ఒక పూటతో ముగిసేది కాదు. స్త్రీలను కట్టెల పొయ్యి నుంచి కిరోసిన్‌ స్టవ్‌కు ఆ తర్వాత గ్యాస్‌ స్టవ్‌కు మార్చారుగానీ వంట నుంచి మార్చలేదు. సీజన్‌ ఏదైనా తుఫాన్లు వచ్చినా వడగాడ్పులు వీచినా వంట చేయాల్సిందే. అయితే వారూ మనుషులే. వారికీ ఓపిక ఉండాలి. ఇప్పుడు సీజన్‌ ఎలా ఉంది? ఎండకు ఉడుకెత్తి పోతోంది. ఇలాంటి వేళ స్టవ్‌ దగ్గర నిలబడి వంట చేయడం ఎంత కష్టం? అయినా ఇది ఎవరితో చెప్పుకున్నా ఆర్చేది కాదు... తీర్చేది కాదు... అందుకే మనమే కొన్ని చిట్కాలు  పాటించాలి.

టైమింగ్‌ మార్చండి
వంట చేసే సమయాన్ని మార్చాలి.  పొద్దున 6 నుంచి 8 లోపు, సాయంత్రం 7 తర్వాత వంట కానివ్వండి. మిట్ట మధ్యాహ్నం స్టవ్‌ వెలిగిస్తే చికాకు పెరగడం ఖాయం. ‘నేను కూరలు ఉదయాన్నే తరిగి పెట్టుకుంటా. మధ్యాహ్నానికి ముందే వేడి తగలకుండా 10 నిమిషాల్లో వండేస్తా’ అని అంటున్న గృహిణులు కొంత నయంగా ఈ వేడిని ఎదుర్కొంటున్నారు.

ఒక గిన్నె వంట
ఈ ఎండల్లో  రెండు బర్నర్‌లు, నాలుగు గిన్నెలు అనే హైరానా అక్కర్లేదు. అన్నం, పప్పు, కూర వేర్వేరుగా చేసే వంటలు తగ్గించాలి. ఒక గిన్నెలో వండ గలిగే  ఖిచిడీ, బిసిబేళబాత్, వెజ్‌ పులావ్, సాంబార్‌ రైస్‌ వీటి మీద దృష్టి పెట్టాలి.  ఇరవై నిమిషాల్లో వంట ముగుస్తుంది. అంతే కాదు ఈ వంటలన్నీ కడుపుకి చలువ, వంట గ్యాస్‌ ఆదా.

కిచెన్‌ని చల్లబరచండి
వంట సెగ కంటే ఎండ వల్ల కిచెన్‌ వేడిగా ఉంటే చాలా ఇబ్బంది. అందుకే ముందు కిచెన్‌ చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ తప్పనిసరిగా అమర్చుకోవాలి. కిచెన్‌ డోర్‌ దగ్గర తడి టవల్‌ వేలాడదీయడం వల్ల ఫలితం ఉంటుంది. ఒక బకెట్‌ చల్లటి నీళ్లు మూలన పెడితే వేడి తగ్గుతుంది. మరో సంగతి... ఇంట్లో స్టాండ్‌ ఫ్యాన్‌ ఉంటే వెనక్కి తిప్పి కిచెన్‌ డోర్‌ దగ్గర పెడితే వేడి సెగ బయటికి పోతుంది.

ఫ్రైలకు సెలవు
ఎండలు కాచే వేళ ఎక్కువ సేపు చేయాల్సిన డీప్‌ ఫ్రైలు,  తాలింపులు బంద్‌ చేయాలి. ఆవిరి కూరలు, మజ్జిగ పులుసు, పెరుగు చట్నీ, సలాడ్‌లు చేస్తే కడుపుకి హాయి. అదీగాక డాక్టర్లు  ‘వేయించినవి తింటే డీహైడ్రేషన్‌ వస్తుంది’ అని హెచ్చరిస్తున్నారు.

నో కుకింగ్‌ డే
వారంలో ఒకరోజు ఉద్యోగానికి సెలవు ఉన్నట్టే వంటకు కూడా సెలవు ఉండాలి. ఈ ఎండల్లో అది ఇంకా ముఖ్యం. వారంలో ఒక రోజు స్త్రీలు నో కుకింగ్‌ డే  పాటించాలి. అంటే? పులిహోర, దద్దోజనం ముందురోజే చేసి ఫ్రిజ్‌లో పెట్టుకోండి. లేదా ఆ రోజుకి ఏదైనా ఆహారం ఆన్‌లైన్‌లో తెప్పించుకోండి. మొహమాటం వద్దు. మీరు కూల్‌గా ఉంటేనే ఇల్లు కూల్‌గా ఉంటుంది.మగమహారాజులూ... 

కిచెన్‌లోకి రండి
వంట చేస్తూ శ్రీమతి విసుక్కుంటుంటే మీరు టీవీ రిమోట్‌ నొక్కుతూ కూర్చోవద్దు. చిన్న సాయం చేస్తే ఆమె చికాకు తగ్గుతుంది.

మీరు చేయగలిగే పనులు
కూరగాయల కట్టింగ్‌ మాస్టర్‌ అవ్వండి. సాయంత్రం ఆఫీస్‌ నుంచి వచ్చాక కొంచెం విరామం తీసుకుని మర్నాటి వంట కోసం ఉల్లి, టమాటా, క్యారెట్‌ తరిగి ఫ్రిజ్‌లో పెట్టండి. దీనివల్ల  పొద్దున్న ఆమెకి 20 నిమిషాల సెగ తప్పుతుంది. ‘నో కుకింగ్‌ డే’ నాడు ఆమె వంట విరామం తీసుకుంటే మీరు పులావో, కిచిడీయో కాకపోయినా మ్యాగీ, ఆమ్లెట్‌ పెట్టినా ఆమెకి పండగే. ఎండలో కూరగాయలకి,  పాలకి ఆమెను వెళ్లనివ్వకండి. లిస్ట్‌ తీసుకుని ఉదయం 7 లోపు తెచ్చేయండి. ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ చెడిపోయిందా? ఫ్రిజ్‌లో వాటర్‌ బాటిల్స్‌ నింపారా? మజ్జిగ చేయడానికి పెరుగు ఉందా? ఈ పనులు మీవి. అలాగే ‘ఈ ఎండలో కూడా టేస్టీగా చేశావే’ అని ఒక్క మాట చెప్పండి. ఖరీదైన ఏ.సి. కన్నా ఆ మాటే ఎక్కువ చల్లదనం ఇస్తుంది. వంకలు పెడితే వంటింటి హీట్‌ డబుల్‌ అవుతుంది. ఇల్లాలు చల్లగా ఉంటే, ఇంట్లో అందరూ చల్లగా ఉంటారు. 

గృహిణి కడుపు చల్లగా
ఎండల్లో వంట చేస్తూ కష్టపడే సమయంలో బాడీ కూల్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోద్దు. సబ్జా నిమ్మకాయ రసం, బార్లీ నీళ్లు, పుదీనా మజ్జిగ, రాగి అంబలి... ఇవన్నీ కిచెన్‌లోనే సులువుగా తయార వుతాయి. గంటకోసారి తాగండి. చికాకు మాయం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement