
విఘ్నేశ్వరుని కళ్యాణం
వినాయకుని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ. ప్రళయవేళ శ్రీ మహావిష్ణువు నాభినుండి వచ్చిన తామరపువ్వుపై బ్రహ్మ అవతరించాడు. ప్రళయానంతరం విష్ణువు మేల్కొని జీవనసృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ సృష్టి ఆరంభిచాడు. కానీ అంతా వక్రంగా వుంది. అప్పటికి ఎన్నో కల్పాలలో సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారదుడు కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లే ఈ వైకల్పికము వచ్చిందని గణేశ అర్చనం చేయమని బ్రహ్మకు బోధించాడు.
బ్రహ్మ వినాయకునికై కఠోర తపస్సు చేశాడు. ప్రత్యేక్షమైన వినాయకుడు బ్రహ్మ ఆంతర్యాన్ని గ్రహించి జ్ఞానం, క్రియలనే శక్తులను ఉపాసించమని బోధించాడు. బ్రహ్మ ఆ ఉపాసన చేశాడు. అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి, బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమయ్యాయి. బ్రహ్మ కోరిక మేరకు వారిరువురూ ఆయన కుమార్తెలుగా జన్మించారు. ఆ తరువాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమముగా కొనసాగింది.
సిద్ధిబుద్ధులు యౌవనవతులయ్యారు. వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు. ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధిబుద్ధులు గణేశుని కోరుతున్నారని ఆయనకు చెప్పాడు. వినాయకుడు అంగీకరించాడు. తరువాత గణేశుడు మిమ్మల్ని కోరుతున్నాడని వారిద్దరికీ చెప్పాడు. బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్ళి జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించి నారదుడు వినాయకునివైపు ఆశ్చర్యంగా చూశాడు.
నారదుడి ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు.. ‘‘నారదా! మా మధ్య కలహం వస్తుదని నీవు భావించావు. ఈ సిద్ధిబుద్ధి ఎవరోకాదు, నా ఆంతరంగిక శక్తులైన జ్ఞానం, క్రియ. అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం. నీ కలహ చింతన లోకోపకారమైంది. భవిష్యత్ మానవుడు సిద్ధిబుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి’’ అని చెప్పాడు. ఇది వినాయకుడి పరిణయ గాథ ఆంతర్యం.
శ్రీలక్ష్మీ గణపతి వైభవం..
మన భారతీయ సంప్రదాయం ముఖ్యంగా మూడు నవరాత్రుల పండుగలను చెప్పింది.
1)వసంత నవరాత్రులు,
2) గణపతి నవరాత్రులు,
3) దేవీ నవరాత్రులు.
వినాయక నవరాత్రులనకుండా గణపతి నవరాత్రులనటంలోనే గణపతి వైభవం మనకు స్పష్టంగా అర్థమౌతున్నది. వేదం కూడా వినాయకుణ్ణి గణపతిగానే కీర్తించింది.
ఏ శుభకార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ‘‘ఓం గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే‘‘ అనే వేదమంత్రంతోనే వినాయక పూజ ప్రారంభిస్తారు,
గణపతులు మహాగణపతి, వాతాపిగణపతి, విద్యాగణపతి, విజయగణపతి, నృత్యగణపతి, సంగీత గణపతి, ఉచ్ఛిష్ట గణపతి ఇలా చాలా రకాలుగా ఉన్నారు. అందరికీ అవసరమైన వాటినందిస్తూ అందరిచేత పూజలందుకొనే వాడు లక్ష్మీగణపతి.
ఈరోజుల్లో.. చదువులు, వ్యాపారాలు, ఆరోగ్యాలు, ఆరాధనలు, అన్నదానాలు అన్నీ ధనంతోనే ముడిపడి ఉన్నాయి. అందువల్ల లక్ష్మీగణపతిని ఆరాధిస్తే విద్యా, విజయం, ధనం అన్నీ కైవసం అవుతాయి. ఈ లక్ష్మీగణపతి వృత్తాంతం గణేశ జననం అనే పేరుతో బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండంలో పూర్వాపరాలతో చాలా వివరంగా ఉంది.
పార్వతీ పరమేశ్వరులు ఏర్పాటు చేసిన ఒక ఉత్సవంలో దేవతలందరితో పాటుగా హాజరైన లక్ష్మీదేవి ఆ సందర్భంలో గణేశుని ఉద్దేశించి మమ స్థితిశ్చ, దేహే తే గేహే భవతు శాశ్వతీ! (నీ శరీరంలో, నీవు ఉన్న ఇంటిలో శాశ్వతంగా నా స్థితి ఉంటుంది. అంటే నేను నివసిస్తాను) అని లక్ష్మీదేవి ప్రత్యేకంగా చెప్పినందువల్ల ఈ స్వామి లక్ష్మీగణపతి అయినాడు. వైభవం అంటే విశేషమైన పుట్టుక. ఆ పుట్టుక ఈ లక్ష్మీ గణపతిది.
"శ్రీకృష్ణాంశేన సంభూతం సర్వ విఘ్ననివారకమ్ ‘
పార్వతీశ్వరయోః పుత్రం లక్ష్మీగణపతిం భజే ‘‘
అనే ఈ శ్లోకాన్ని జపిస్తూ లక్ష్మీగణపతి స్వామిని ఆరాధిస్తే అఖండంగా ఆయుర్లక్ష్మి, ఆరోగ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి కలుగుతాయి. ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది.