
స్టూడెంట్ అవార్డ్స్ సెమీఫైనల్లో ఏపీ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థి
ఆస్కార్ ప్రదానం చేసే అకాడెమీ సంస్థ ఆధ్వర్యంలో పోటీలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో కమ్యునికేషన్ డిజైన్ ఫైనల్ ఇయర్ చదువుతున్న లావణ్య లోధి
‘వీన్స్ ఆఫ్ గ్రేస్’ షార్ట్ ఫిల్మ్ కి ప్రశంసల జల్లు
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,127 చిత్రాల్లో సెమీస్ కి చేరిన లావణ్య షార్ట్ ఫిల్మ్
అక్టోబర్ 6న అవార్డుల ప్రదానోత్సవం
విజయం సాధిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్న లావణ్య లోధి
వందకి పైగా దేశాలు... 3,127 షార్ట్‌ఫిల్మ్‌లు... 80 మందికిపైగా న్యాయ నిర్ణేతలు... 30 రోజుల పాటు వడపోతలు.. చివరికి మిగిలింది... 60 షార్ట్ ఫిల్మ్‌లు... అందులో ఒకటి భారత్‌కు చెందిన... అదీ... ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌ఐడీ కి చెందిన విద్యార్థి లావణ్య లోధది కావడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాత అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 52వ స్టూడెంట్ అకాడెమీ అవార్డుల్లో లావణ్య తన సత్తా చాటింది. తాను తీసిన ‘వీన్స్ ఆఫ్ గ్రేస్’ చిత్రం టాప్–15లో చోటు దక్కించుకుంది.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే...
కాన్పూర్‌కి చెందిన లావణ్య లోధి తండ్రి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కావడంతో ప్రతి మూడేళ్లకోసారి బదిలీలతో దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతూ విద్యనభ్యసించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలతో కలగలసి లావణ్య జీవితం సాగింది. తల్లి కథక్ నాట్య గురువు. ఆమె నుంచే లావణ్యకు నాట్యం, కథలపై ఆసక్తి పెరిగింది. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంలో రాణించడంతో పాటు.. సృజనాత్మకంగా బొమ్మలు గీస్తుండటంతో.. తల్లిదండ్రులు ప్రోత్సహించి.. లావణ్యని డిజైన్ రంగం వైపు అడుగులు వేయించారు.
2020లో ప్లస్–2 చదువుతున్న సమయంలో పరీక్ష పే చర్చా కార్యక్రమంలో లావణ్య కళాకృతుల గురించి ప్రధాని మోదీ ఆమెని ప్రశంసలతో ముంచెత్తారు. అనంతరం.. ఆమె విజయవాడ సమీపంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ)విద్యా సంస్థలో కమ్యునికేషన్ డిజైన్‌లో చేరింది. యానిమేషన్, మూవింగ్ ఇమేజెస్‌పై నిరంతరం తన డిజైన్లతో పరిశోధనలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఎన్‌ఐడీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. లావణ్య చదువులోనే కాకుండా.. యానిమేషన్, ఫిల్మ్ లాంగ్వేజ్, విజువల్ స్టోరీ టెల్లింగ్, సౌండ్, కల్చరల్ స్టడీస్‌లోనూ డ్యాన్సర్‌గా, స్టోరీటెల్లర్‌గా రాణిస్తూ.. యూనివర్శిటీల్లో అనేక బహుమతులు గెలుచుకుంది.
విన్సీ ఆఫ్ గ్రేస్ కథేంటీ..?
లావణ్య తీసిన ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఎలాంటి సంభాషణలూ లేవు. కేవలం సంగీతం, నృత్యం, అభినయమే కథకు బలం. ఇది ఒక చిన్న యానిమేటెడ్ చిత్రం. ఒక యువతి తాను జీవితాన్ని కోల్పోయి సంస్కృతికి దూరమైపోతుంది. ఈ సమయంలో ఆమె తల్లి తనకు నేర్పినట్లుగా నాట్యం నేర్చుకోవడం మొదలు పెడుతుంది. ఆమెకు గుర్తుకొచ్చే పాత జ్ఞాపకాలన్నీ.. ఒక్కొక్కటిగా కనుమరుగవుతూ.. ఆ అమ్మాయి.. నృత్యంతో పాటుగా.. కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. సూర్యాస్తమయ సమయంలో ఓ ప్రశాంతమైన టెర్రస్‌పై కనిపించేలా ఈ చిత్రాన్ని లావణ్య ఆవిష్కరించింది. మనం ఎవరం.. ఎక్కడి నుంచి వచ్చాం.. మన సంస్కృతి సంప్రదాయాల్ని గుర్తు చేసుకునేందుకు నడక, నడత, నాట్యం ఎలా సహాయపడతాయన్నదే విన్సీ ఆఫ్ గ్రేస్.
అన్నీ ఆమే!
ఈ చిత్రానికి ఫిల్మ్ మేకర్, యానిమేషన్ ఫిల్మ్ డిజైనర్, మొత్తం సినిమా స్క్రిప్ట్, సౌండ్ డిజైన్, క్యారెక్టర్ డిజైన్, యానిమేషన్.. ఇలా అన్నీ.. లావణ్యే కావడం విశేషం. లావణ్యకు మెంటార్‌గా ఎన్‌ఐడీ కమ్యునికేషన్ డిజైన్ హెడ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూర్మనాథం వ్యవహరించగా.. ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు డా.అభిషేక్, గౌతమ్ చక్రవర్తి, జనాంతిక్ శుక్లా, బినితా దేశాయ్, శేఖర్ ముఖర్జీ సహకారం అందించారు.
ఈ అవార్డులు ఎవరిస్తారంటే.?
ఆస్కార్ అవార్డులు అందించే.. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలో స్టూడెంట్ అకాడమీ అవార్డులు (ఎస్‌ఏఏ) అందిస్తారు. ఈ ఏడాది 52వ అవార్డుల్ని రోలెక్స్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. మే 18 వరకూ ఎంట్రీలు తీసుకున్నారు. ప్రపంచంలోని వివిధ డిజైన్ ఇనిస్టిట్యూట్స్, యానిమేషన్, ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్‌లలో విద్యనభ్యసిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్ విద్యార్థుల్ని చిత్ర రంగంలో ప్రోత్సహించేందుకు ఏటా ఈ అవార్డుల్ని అందిస్తుంటారు.
ఏయే విభాగాలంటే..
యానిమేషన్, డాక్యుమెంటరీ, లైవ్ యాక్షన్ కథనం, ప్రయోగాత్మక షార్ట్‌ఫిల్ములని ఆస్కార్.ఆర్గ్ కు ఆన్‌లైన్‌లో పంపగా.... మే 18 వరకూ అందిన షార్ట్‌ఫిలింలని తీసుకున్నారు. ఆ తర్వాత వడపోత నిర్వహించారు. మొత్తం 3,127 చిత్రాల్లో వివిధ దశల్లో వడపోతలు నిర్వహించి.. సెమీఫైనల్‌కు 60 చిత్రాల్ని ఎంపిక చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 6న న్యూయార్క్‌లోని జీగ్‌ఫెల్డ్ బాల్ రూమ్‌లో జరిగే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా.. ఈ 60 చిత్రాల్లో టాప్ చిత్రాల్ని ప్రకటించి.. అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. స్టూడెంట్ అకాడమీ అవార్డు గెలుచుకున్న చిత్రాలు యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ లేదా డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 98వ ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడేందుకు అర్హత సాధిస్తాయి.
అమ్మకే అంకితం!
నా నాట్య గురువు అమ్మకు ఈ విన్సీ ఆఫ్ గ్రేస్‌ని అంకితం చేస్తున్నాను. ఎన్‌ఐడీ సహకారంతో.. ఈ షార్ట్‌ఫిల్మ్‌ని పూర్తి నమ్మకంతో తీసి.. ఎస్‌ఏఏ అవార్డులకు పంపించాను. సెమీఫైనల్‌కు చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. అక్టోబర్ 6న ఒక్క అవార్డు అయినా.. విన్సీ ఆఫ్ గ్రేస్‌కు వస్తుందని కచ్చితంగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరి జీవిత వారసత్వ కథే నా చిత్రం. ఆస్కార్ వేదికపై విన్సీ ఆఫ్ గ్రేస్ ప్రదర్శితమయ్యేలా భారతీయులందరి ఆశీస్సులు నాకు కావాలి.
– కరుకోల గోపీకిశోర్ రాజా,
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం