వెరైటీల్లో ఘనాపా టీ | tea trunk founder snigdha manchanda success story | Sakshi
Sakshi News home page

వెరైటీల్లో ఘనాపా టీ

May 21 2026 6:15 AM | Updated on May 21 2026 6:15 AM

tea trunk founder snigdha manchanda success story

నేడు ఇంటర్నేషనల్‌ టీ డే

‘టీ’ అంటే ‘టీ’ మాత్రమే కాదు. మన ఫ్రెండు. మన ఫ్యామిలీ మెంబర్‌. స్నిగ్ధ మంచందకు ‘టీ’పై ఉన్న ప్రేమ ‘టీ ట్రంక్‌’ స్టార్టప్‌తో సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ను చేసింది... 

భారతదేశపు మొట్ట మొదటి సర్టిఫైడ్‌ టీ సోమెలియర్‌గా గుర్తింపు సాధించారు స్నిగ్ధ మంచంద. చాలామందిలాగే ఆమెకు ‘టీ’ అంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టంతో టీ గురించి అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఎక్కడా, ఎలాంటి సంస్థలూ కనిపించలేదు. దీంతో తానే ఒక ‘టీ స్కూల్‌’ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు! అక్కడితో ఆగిపోలేదు. ‘టీ ట్రంక్‌’ పేరుతో కంపెనీ ప్రారంభించి ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేశారు స్నిగ్ధ.

ఆ పేరు అందుకే...
‘చిన్నప్పటి నుండి రకరకాల టీ ΄÷డులను సేకరించి, వాటిని నాన్నగారి పాతకాలపు ట్రంకు పెట్టేలో భద్రపరిచేదాన్ని. టీపై అప్పటి నుంచే ప్రేమ మొదలైంది కాబట్టి నా కంపెనీకి టీ ట్రంక్‌ అని పేరు పెట్టాను’ అంటారు స్నిగ్ధ. కంపెనీ ప్రారంభించిన తరువాత పెద్ద బ్రాండ్‌లతో పోటీ పడాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఆఫ్‌లైన్‌ పంపిణీ రూట్‌ను నిర్మించడం ఎంత కష్టమో ఆమెకు తెలిసింది.
‘మొదట్లో లిస్టింగ్‌ ఫీజులు, పంపిణీదారుల వైఖరితో మాకు ఇబ్బందిగా ఉండేది. దీంతో మా దృష్టిని ఈ– కామర్స్‌ వైపు మళ్లించాం. అక్కడ కూడా ఎన్నో సవాళ్లు ఎదురైనా, వాటిని త్వరలోనే అధిగమించి నేరుగా టీ ప్రియుల దగ్గరికి చేరుకున్నాం’ అంటారు స్నిగ్ధ.

కోవిడ్‌ కల్లోలంలో....
కంపెనీకి అసలుసిసలు సవాలు కోవిడ్‌ కల్లోల కాలంలో ఎదురైంది. ‘ఎంత కష్టమైనప్పటికీ కోవిడ్‌ సమయంలో మా ఉద్యోగులందరినీ కొనసాగించాలని, అందరికీ జీతాలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాను. మా ఉద్యోగులలో దాదాపు ప్రతి ఒక్కరూ వారి కుటుంబానికి పోషకులే. ఆ సమయంలో ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నప్పటికీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఇ–కామర్స్‌పై మరింత దృష్టి పెట్టాము. గత కొన్ని సంవత్సరాలుగా మేము డిజిటల్‌–ఫస్ట్‌ బ్రాండ్‌ను నిర్మిస్తున్నాం కాబట్టి మాకు అప్పటికే కస్టమర్‌ బేస్‌ ఉంది. గోవాలో ఉండడం వల్ల మేము గ్రీన్‌ బేస్‌లో ఉన్నాం. లాక్‌డౌన్‌ సమయంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే మా ఈ–కామర్స్‌ ఆదాయాన్ని ఎనిమిది రెట్లు పెంచుకోవడానికి మేమందరం చాలా కష్టపడి పనిచేశాం’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు స్నిగ్ధ.

ఆ ప్రశ్న అడగాల్సిందే!
టీ ప్రియుల నుంచి ఒక ప్రశ్న కోరుకుంటున్నారు స్నిగ్ధ, ‘నేను తాగే టీ ఎక్కడి నుంచి వచ్చింది? అని టీ తాగే వాళ్లు అడిగితే బాగుంటుందని నేను అనుకుంటాను. వైన్‌లాగే టీ రుచికి సంబంధించి అది ఏ ప్రాంతానికి చెందిందో, దాని ప్రత్యేకత ఏమిటో అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు ఏదైనా కొన్న ప్రతిసారీ మీ డబ్బు ఒక రైతు జేబులోకి వెళ్తుందా లేదా ఒక పెద్ద బహుళజాతి సంస్థ జేబులోకి వెళ్తుందా అని నిర్ణయించే శక్తి మీకు ఉంటుంది’ అంటారు స్నిగ్ధ. ‘తొలిరోజుల్లోనే పెద్ద స్టార్టప్‌ల గురించి పగటి కలలు కనడం మానేసి, వాస్తవాలను అవగాహన చేసుకుంటూ చిన్న చిన్న అడుగులు వేస్తూ ప్రయాణం ప్రారంభించాలి’ అని ఔత్సాహికులకు సలహా ఇస్తున్నారు స్నిగ్ధ.

ప్రతి సీజన్‌లో వెరై‘టీ’...
వ్యాపారం సంగతి సరే, స్నిగ్థాకు ఇష్టమైన టీ ఏమిటి? ‘టీ ప్రియులు ప్రతి ఒక్కరూ సీజన్‌ ప్రకారం టీ మార్చుకోవాలి. ఉదాహరణకు... వేసవి ప్రారంభంలో నాకు ఇష్టమైనది మందార గ్రీన్‌ టీ. ఇందులో సోంపు గింజలు ఉంటాయి. ఇవి శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. మా బోటానికల్‌ కలెక్షన్స్‌లో మందార పువ్వులు కూడా ఉన్నాయి. ఇవి స్వచ్ఛమైన పువ్వులు కాబట్టి వీటిలో కెఫిన్‌ ఉండదు. వీటిని రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు’ అంటున్నారు స్నిగ్థ.
 
ఇప్పుడు సీన్‌ మారింది!
టీ వ్యాపారం అనేది తరతరాలుగా పురుషులే నడుపుతున్న వారసత్వ వ్యాపారం. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా మేము  నిర్మించిన బ్రాండ్‌తో  పరిస్థితులు మారాయి. ఇప్పుడు నాకు అతి పెద్ద మద్దతుదారులు, ప్రోత్సాహకులు టీ పరిశ్రమకు చెందిన పురుషులే. టీ ట్రంక్‌ మన భారతీయ టీల గురించి అవగాహన కలిగిస్తున్న తీరును టీ ఎస్టేట్‌ యజమానులు అభినందిస్తున్నారు.
– స్నిగ్థ మంచంద 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement