సంగీతమే నా ప్రయారిటీ.. లెజెండరీ ఎస్పీ బాలు అడుగుజాడల్లో

Special Story Young Singer Jahnavi Says Late SP Balasubrahmanyam My Guru - Sakshi

యువ గాయని జాహ్నవి... టీవీ చూస్తూ పాట నేర్చుకుంది.  టీవీలో పాడుతూ పెరిగి పెద్దదైంది. టీవీ తెర మీద మురిపించిన పాట... ఇప్పుడు సినిమా తెర వెనుక వినిపిస్తోంది. ఎస్పీ బాలు నేర్పించిన మెళకువలే పాదముద్రలు. 

ఇంట్లో టీవీ ఉంటే పిల్లలు మాటలు త్వరగా నేర్చుకుంటారు. ఆ ఇంటి వాతావరణంలో నేర్పని మాటలు కూడా పిల్లల నాలుక మీద అవలీలగా దొర్లిపోతుంటాయి. ఈ అమ్మాయి టీవీ చూస్తూ మాటలతోపాటు పాటలు కూడా నేర్చుకుంది. ఆటల్లో ఆటగా సీరియల్‌ టైటిల్‌ సాంగ్స్‌ పాడేది. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. కానీ సంగీతం దేవుడిచ్చిన వరంలా ఒంటపట్టింది. పాటల పట్ల పాపాయికి ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను సంగీతం టీచర్‌ దగ్గరకు తీసుకెళ్లారు. ఎవరూ పెద్దగా ప్రయాస పడింది లేదు. త్వరగానే గ్రహిస్తోందని సంగీతం టీచరు కామాక్షిగారు నోటిమాటతోనే ప్రశంసాపూర్వకమైన సర్టిఫికేట్‌ ఇచ్చేశారు.

ఆ తర్వాత స్వరసుధ అనే మ్యూజిక్‌ అకాడమీలో చేరి సంగీత సాధన చేసింది. ఇదంతా జాహ్నవి వరంగల్‌లోనే. టెన్త్‌క్లాస్‌ తర్వాత ఇంటర్‌ కి జాహ్నవి హైదరాబాద్‌కు మారింది. ఆమె సంగీత ప్రపంచం మరింత విస్తృతమైంది. శ్రీనిధి, రామాచారి వంటి ప్రముఖ గురువుల దగ్గర సంగీతం నేర్చుకునే అవకాశం వచ్చింది. టీవీ రియాలిటీ షోల తో మొదలైన ఆమె సరిగమల ప్రయాణం ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్‌పీ బాల సుబ్రహ్మణ్యంతో కలిసి పాడే అవకాశాన్నిచ్చింది. ఎస్‌పీబీ దగ్గర పాడడానికి ముందు జాహ్నవి పాటకు, ఆ తర్వాత జాహ్నవి పాటకు మధ్య స్పష్టమైన తేడా వచ్చిందని చెబుతోందీ యువగాయని.  

నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత..
‘‘రియాలిటీ షోలో నేను పద్యాన్ని పాడుతున్నాను. ఫైనల్‌ రౌండ్‌కు వెళ్లాలంటే ఆ రౌండ్‌ దాటాలి. అప్పుడు పద్యం పాడడంలో అనుసరించాల్సిన మెళకువ చెప్పారాయన’’ అంటూ ఎస్‌పీ బాల సుబ్రహ్మణ్యం తనకు తొలిసారిగా నేర్పించిన సంగీతపాఠాన్ని గుర్తు చేసుకున్నది జాహ్నవి. ‘‘బాలు సర్‌తో 30కి పైగా ఎపిసోడ్‌లు చేశాను. పాట పాడేటప్పుడు ఆయన ఎంత కచ్చితంగా ఉంటారో ఆయన నొటేషన్‌ రాసుకోవడం చూసి తెలుసుకున్నాను. వేలాది పాటలు పాడిన అనుభవం ఉన్నప్పటికీ ప్రతి పాటనూ అదే ప్రారంభం అన్నంత శ్రద్ధగా ప్రిపేరవుతారు. ఒక అక్షరం పైన ‘నవ్వు’ అని రాసుకున్నారు. అలా రాసుకోవడం చూసిన తర్వాత ఆయన ఆ పాట పాడడాన్ని కూడా నిశితంగా గమనించాను.

కచ్చితంగా ఆ అక్షరం రాగానే గొంతులో నవ్వును పలికించారు. ఆయన టీమ్‌లో కోరస్‌ పాడడం అనేది చిన్న అవకాశం కాదు. నేర్చుకునే వాళ్లకు నేర్చుకున్నంత జ్ఞానం అబ్బుతుంది. స్వరాలను పలకడంలో పాటించాల్సిన నిబంధనలను, పాట అవసరాన్ని బట్టి గొంతులో పలకాల్సిన రసాలను చెప్పేవారు. మొదట కుతూహలం కొద్దీ ఆయనను గమనించడం మొదలుపెట్టాను. అలా ఆయన చెప్పినవి కొన్ని, చూసి నేర్చుకున్నవి కొన్ని. ఒక్కొక్కటి నేర్చుకుంటున్న కొద్దీ... ఆశ్చర్యంగా నా పాటలో మార్పు నాకే స్పష్టంగా తెలియసాగింది. గాయనిగా గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యానికి స్ఫూర్తి ఎస్పీబీ సారే.  

పాటల పాఠాలు
బీటెక్‌ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. కానీ సంగీతమే నా తొలి ప్రయారిటీ. గాయనిగా అన్ని రకాల పాటలూ పాడగలననే గుర్తింపు తెచ్చుకోవాలి. మ్యూజిక్‌లో సర్టిఫికేట్‌ కోర్సు చేశాను. ఇప్పుడు డిప్లమో కోర్సు చేస్తున్నాను. క్లాసికల్, మెలోడీ, జానపదం, ఫాస్ట్‌బీట్‌... అన్నింటినీ పాడగలిగినప్పుడే సమగ్రత వస్తుంది. ఇక గాయనిగా నాకు సంతోషాన్నిచ్చిన సందర్భాలంటే... పాడుతా తీయగా సీజన్‌ 16లో రన్నర్‌ అప్‌గా నిలవడం. అదే ప్రోగ్రామ్‌లో విన్నర్‌ మా చెల్లి అక్షయసాయి.

అలాగే ఎస్‌వీబీసీలో అన్నమాచార్య కీర్తనలు పాడే అవకాశం వచ్చింది. అది కూడా అత్యంత సంతోషం కలిగించింది. ఎన్టీఆర్‌ బయోపిక్, అఖండ, బీమ్లానాయక్, రాధేశ్యామ్‌ సినిమాల్లో గొప్ప సంగీత దర్శకుల ఆధ్వర్యంలో పాడాను. స్టేజ్‌ ప్రోగ్రామ్‌లలో పాడాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఎక్కువ కార్యక్రమాలు చేయలేకపోతున్నాను. బాలు గారి జయంతి సందర్భంగా నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రవీంద్రభారతిలో సంస్మరణ కార్యక్రమం జరుగుతోంది. సినీ మ్యూజిక్‌ యూనియన్‌ నిర్వహించే ఈ కార్యక్రమంలో వందమంది గాయనీగాయకులు, సంగీతకారులు పాల్గొంటున్నారు. అందులో పాట పాడడం నాకు మరువలేని జ్ఞాపకం అవుతుంది. ఆయన పాదముద్రల్లో నడిచి వచ్చిన గాయనిని. అది ఆ మహోన్నత గురువుకి నేను అందించే స్వర నివాళి’’ అని చెబుతున్నప్పుడు జాహ్నవి గొంతులో బాలుగారి పట్ల గౌరవపూర్వకమైన అభిమానం తొణికిసలాడింది. 
– వాకా మంజులారెడ్డి  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top