
అందమే ఆనందం... ఆనందమే ఆత్మవిశ్వాసం!
ఆత్మవిశ్వాసం శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రతిబింబం!
అందుకే నార్మల్ గర్ల్ నుంచి సారా టెండూల్కర్ దాకా
ఎవరికైనా ఫిట్‌నెసే జీవనసాఫల్య మంత్రం!
దీనికి సెలబ్రిటీల అనుభవాలే ఉదాహరణలు!
ముఖం మీద ఓ మొటిమ రాగానే అమ్మాయి ఇబ్బంది పడుతుంది. దాన్ని దాచడానికి ఎన్నోరకాలుగా ప్రయత్నిస్తుంది. చివరకు బయటకు వెళ్లడానికి.. కనీసం ఫ్రెండ్స్‌ని కలవడానిక్కూడా ఇష్టపడదు. ఈ క్రీమ్ వాడండి.. తెల్లారికల్లా మొటిమ మాయమంటూ స్క్రీన్ మీద ఓ క్రీమ్‌ను చూపిస్తూ ఓ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఇలాంటి ప్రకటనలతో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు, రిజిస్టర్డ్ న్యూట్రిషనిస్ట్ సారా టెండూల్కర్ కూడా ప్రభావితమైంది.
ఒక్క కాస్మెటిక్ క్రీమ్స్‌కే కాదు హెయిర్ ఆయిల్ యాడ్స్‌కూ ఇన్‌ఫ్లుయెన్స్ అయింది.. ఆమె స్కూల్ రోజుల్లో. ఆ టీనేజ్‌లో ఆమెకు ముఖం నిండా మొటిమలు, జుట్టు సమస్యలుండేవి. అవి ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. దాంతో ఫ్రెండ్స్‌ని కలవాలన్నా మేకప్ వేసుకునే వెళ్లేదట. టీవీ కమర్షియల్స్‌లో కనిపించిన క్రీములు, ఆయిల్స్ అన్నిటినీ వాడిందట. అసలామె సమస్యలకు కారణం .. పీసీఓఎస్. దేశంలో రీప్రొడక్టివ్ ఏజ్‌లోని ప్రతి అయిదుగురు అమ్మాయిల్లో ఒకరు దీనితో బాధపడుతున్నారు.
సారా ఏం చేసింది?
మొటిమలు, జుట్టు సమస్యల్లాంటి సైడ్‌ఎఫెక్ట్స్ మీద శ్రద్ధ పెట్టి సత్వర ఫలితాల కోసం ఆరాటపడిన సారా.. అసలు సమస్య అయిన పీసీఓఎస్‌ను పట్టించుకోలేదు. దాన్ని కంట్రోల్ చేసే శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించలేదు. కాస్మెటిక్స్‌తో రిజల్ట్స్ రాక΄ోయేసరికి ఒత్తిడికిలోనై డాక్టర్ కూడా అయిన అమ్మ అంజలి టెండూల్కర్ దగ్గర వా΄ోయింది. అప్పుడు అంజలి తన కూతురిని వైద్యనిపుణుల దగ్గరకు తీసుకెళ్లింది. ‘వాళ్లు నా దినచర్య, డైట్ హాబిట్స్ గురించి అడిగారు. పౌష్టికాహారం తీసుకొమ్మన్నారు. ఫిజికల్ ఎక్సర్‌సైజ్ తప్పనిసరని చె΄్పారు.
ఆ సలహాలు, సూచనలు పాటించసాగాను. మైండ్‌ఫుల్‌నెస్ మీదా కాన్‌సన్‌ట్రేట్ చేశాను. వెంటనే రిజల్ట్స్ రాలేదు. కొంచెం టైమ్ పట్టింది.. ఆలస్యమైనా ఆరోగ్యం చేకూరింది. పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి. ముఖం మీది మొటిమలు పోయాయి. జుట్టూ పెరగసాగింది. అప్పటి నుంచి అదే జీవనశైలిని అనుసరిస్తున్నాను. పీసీఓఎస్‌తో లైఫ్ సవాలే. అది శారీరకంగానే కాదు మానసికంగానూ కుంగదీస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. దాని వల్ల నేను స్ట్రెస్ ఫీలయ్యి, ఫ్రస్ట్రేట్ అయిన సందర్భాలు కోకొల్లలు. అయితే సరిచేసుకోలేనంత మొండి సమస్య కాదు. ఇన్‌స్టంట్ రిజల్ట్స్ పర్మినెంట్ సొల్యుషన్స్ కావు. కాబట్టి షార్ట్ టర్మ్ రిజల్ట్స్ మీద టైమ్ వేస్ట్ చేసే బదులు మన జీవనశైలిని మెరుగుపరచుకునే ప్రయత్నం చేయాలి.
పర్‌ఫెక్షన్ మీద కన్నా స్థిరత్వం మీద శ్రద్ధ పెట్టాలి. బ్యాలెన్స్‌డ్ డైట్, ఎక్సర్‌సైజ్‌లను జీవితంలో భాగం చేసుకుని కొనసాగించాలి! శారీరక, మానసిక ఆరోగ్యానికవే దివ్యౌషధాలు. అయితే నిపుణుల సలహా, హెల్ప్ కంపల్సరీ. ఈ విషయంలో అమ్మకు థాంక్స్ చెప్పుకోవాలి. సరైన సమయంలో నన్ను నిపుణుల దగ్గరకు తీసుకెళ్లింది. నిజానికి మా ఇంట్లో నాన్న గానీ, అమ్మ గానీ ఫిజికల్ యాక్టివిటీ, మిత ఆహారం, మైండ్‌ఫుల్‌నెస్‌కి చాలా విలువిస్తారు.
ఫిట్‌నెస్ అండ్ వెల్‌నెస్ మా డిన్నర్ టేబుల్ కన్వర్జేషన్స్‌లో భాగం. అలాంటి వాతావరణంలో పెరిగిన నేను.. స్కూల్ డేస్‌లో కాస్త నిర్లక్ష్యం చేశాను. కానీ అమ్మ గైడెన్స్ వల్ల త్వరగానే మళ్లీ సరైన దారిలో పడ్డాను. ఇప్పుడు బ్లాక్ కాఫీతో నా డే స్టార్ట్ అవుతుంది. ఎక్సర్‌సైజ్, నట్స్, మాచా టీ, బ్యాలెన్స్‌డ్ డైట్.. ఎట్‌సెట్రాతో కంటిన్యూ అవుతుంది’ అని చెబుతుంది సారా టెండూల్కర్.
పీసీఓఎస్ అండ్ పీసీఓడీ అంటే...
పీసీఓఎస్ ( పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) అనేది హార్మోన్ల సమస్య. అండాశయాలు అధిక స్థాయిలో మేల్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల నెలసరి క్రమం తప్పడం, అధిక రక్తస్రావం లేదంటే రక్తస్రావం సరిగాకాక΄ోవడం, అండాశయాల్లో సిస్ట్‌లు, అవాంఛిత రోమాలు, జుట్టు పలచబడటం, మొటిమలు, అలసట, మూడ్ స్వింగ్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, స్థూలకాయం, టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బుల రిస్క్ పెరగడం, కొలెస్ట్రాల్ అధికమవడం, సంతానోత్పత్తి సమస్యలు వంటివి తలెత్తుతాయి.
పీసీఓడీ ( పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్)లో అండాశయాలు అపరిపక్వ లేదా పాక్షికంగా పరిపక్వత చెందిన అండాలను ఉత్పత్తి చేస్తాయి. తర్వాత ఇవి సిస్ట్స్‌గా మారే చాన్స్ ఉంటుంది. పీసీఓఎస్, పీసీఓడీ రెండిటికీ జీవనశైలి, హార్మోన్ల అసమతౌల్యం, జన్యపరమైన అంశాలు కారణాలు. పీసీఓఎస్, పీసీఓడీ రెండూ కూడా 15–30 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల్లో కనపడతాయి. జీవనశైలి మార్పులతో పాటు డాక్టర్ సూచించిన చికిత్సతో ఈ రెండు సమస్యలను తగ్గించుకోవచ్చు.
– డాక్టర్ పూజిత సూరనేని, సీనియర్ ఆబ్‌స్టట్రీషన్, గైనకాలజీ అండ్ లాపరోస్కోపిక్ సర్జన్
ఇంకెంతో మంది సెలబ్రిటీలు..
ఒక్క సారా టెండూల్కరే కాదు పీసీఓఎస్, పీసీఓడీలతో సోనమ్ కపూర్, శ్రుతి హాసన్, మసాబా గుప్త, సారా అలీఖాన్ లాంటి సెలబ్రిటీలూ బాధపడ్డారు. పీసీఓఎస్ వల్ల సోనమ్ కపూర్ స్థూలకాయంతో ఇబ్బంది పడింది. ‘పీసీఓఎస్‌ని డీల్ చేసే ఏకైక విధానం.. జీవనశైలిని మార్చుకోవడమే. లైఫ్‌స్టయిల్ అండ్ యోగాతోనే నేను పీసీఓఎస్‌ను మేనేజ్ చేశాను’ అని చెబుతుంది సోనమ్ కపూర్. శ్రుతి హాసన్, మసాబా గు΄్తాలూ అంతే! లైఫ్‌స్టయిల్‌లో మార్పులు, వ్యాయామం, పౌష్టికాహారంతోనే పీసీఓఎస్‌కి చెక్ పెట్టారు. సారా అలీఖాన్ పీసీఓడీ బాధితురాలు. దానివల్ల ఆమె 96 కిలోల బరువుండేది. దానికి ఆమె కూడా జీవనశైలిని మార్చుకోవడమే పరిష్కారమని గ్రహించి కసరత్తు మొదలుపెట్టింది. బరువు తగ్గడం మొదలయ్యాక పీసీఓడీ తగ్గింది. ఆమె ఆ ఎక్సర్‌సైజ్ ఆపలేదు. క్రమశిక్షణ గల జీవనశైలిని తప్పలేదు. ఈ ఆరోగ్య సూత్రం సమస్యలున్న వారికే కాదు.. భవిష్యత్‌లో ఎలాంటి శారీరక, మానసిక సమస్యలు రావద్దని కోరుకుంటున్న అందరికీ అనుసరణీయమే!