సాధారణంగా మహిళల్లో మధ్యవయసు దాటిన కొందరిలో ‘గర్భసంచి జారడం’ అనే మాట వినిపిస్తుంటుంది. మహిళల పొత్తికడుపులో గర్భసంచి అంటూ అందరూ సామాన్యంగా పిలిచే యుటెరస్‌తో పాటు పెద్దపేగు, మూత్రపు సంచి లాంటివి కూడా ఉంటాయి. ఇవి కాస్తంత జారిపోయి యోని పైభాగం మీద ఒత్తిడి కలిగిస్తూ మహిళల్లో తీవ్రమైన నొప్పినీ, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇలా పొత్తికడుపులోని యుటెరస్, పెద్దపేగు, మూత్రపు సంచి (బ్లాడర్) వంటి దేహ భాగాలు యోని పైభాగంలోకీ లేదా ఒక్కోసారి యోనిలోనికి జారిపోవడాన్నే వైద్యపరిభాషలో ‘పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్’ అని పేర్కొంటారు. అవి ఎందుకలా జారతాయో, అప్పుడు ఏం చేయాలో చూద్దాం.
నిజానికి మహిళల్లో తమ పొత్తికడుపులోని అవయవాలన్నీ చాలా దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి. పొత్తికడుపులోపల ఉండే గర్భసంచి వంటి అనేక అంతర్గత అవయవాలన్నీ ‘పెల్విక్ ఫ్లోర్’ అని పిలిచే ఓ పొర లాంటి కండరంపై ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆ ‘పెల్విక్ ఫ్లోర్’ ఆ అంతర్గత అవయవాలను మోస్తూ ఉంటుంది.
ప్రొలాప్స్‌కు మరికొన్ని కారణాలు
పొత్తికడుపు అవయవాలు ఇలా కిందికి జారడానికి చాలా అంశాలు కారణమవుతాయి. ఉదాహరణకు వయసు పెరగడం వల్ల పెల్విక్‌ఫ్లోర్ కండరం బలహీనపడటం అనే ముఖ్యకారణంతో పాటు...
→ బిడ్డలకు జన్మనివ్వడం (ఛైల్డ్ బర్త్)
→ రుతుక్రమం ఆగిపోవడం (మెనోపాజ్)
→ బరువు పెరగడం (ఒబేసిటీ)
→ తీవ్రమైన మలబద్ధకం (క్రానిక్ కాన్‌స్టిపేషన్)తో ముక్కడం వల్ల కొందరిలో గర్భసంచి తొలగింపు ఆపరేషన్ (హిస్టరెక్టమీ) జరగడం... వంటి అంశాలు ప్రొలాప్స్‌కు కారణమవుతాయి.
నివారణ
పెల్విక్ ప్రొలాప్స్ నివారణ చాలా పరిమితమైన మేరకే సాధ్యమవుతుంది. పెల్విక్ ఫ్లోర్ కండరాన్ని బలోపేతం చేసే ‘కెగెల్స్ ఎక్సర్‌సైజెస్’ అని పిలిచే పొత్తికడుపు వ్యాయామాలను చేయడం ద్వారా కొంతవరకు ఈ పరిస్థితిని నివారించవచ్చు. మలబద్ధకాన్ని నివారించేందుకు ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం, మంచి విసర్జక అలవాట్లు (గుడ్ టాయిలెట్ హ్యాబిట్స్... అంటే రోజూ ఒకేవేళకు మలవిసర్జనకు వెళ్లడం), స్థూలకాయాన్ని నివారించుకోవడం అంటే బరువు పెరగకుండా జాగ్రత్తపడటం, బరువైన వస్తువుల్ని అకస్మాత్తుగా ఎత్తకుండా జాగ్రత్తగా ఉండటం వంటి వాటితో పెల్విక్ ప్రొలాప్స్‌ను కొంతమేర నివారించవచ్చు.
జారడం ( ప్రొలాప్స్) అంటే ఏమిటి, ఎందుకలా జరుగుతుందంటే...?
మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కండరం బలహీనపడుతుంది. ఆ క్రమంలో ఒక్కోసారి పొత్తికడుపులో ఉండే అంతర్గత అవయవాలు ‘బలహీనపడ్డ’ ఆ పెల్విక్‌ఫ్లోర్ నుంచి జారి... యోనిలోకి గానీ లేదా యోని పైభాగంలోకి వచ్చేస్తాయి. ఇలా జారి కిందకు రావడాన్నే ‘్రపొలాప్స్’అంటారు. ఏ అవయవం జారిందో దాన్ని బట్టి ఆ జారిన ప్రక్రియకు ( ప్రొలాప్స్‌కు) ఆ పేరు పెడతారు.
ఉదాహరణకు గర్భసంచి జారితే దాన్ని ‘యుటిరైన్ ప్రొలాప్స్’ అనీ, పెద్దపేగు జారితే ‘బవెల్ ప్రొలాప్స్’ అనీ, మూత్రపు సంచి జారితే ‘బ్లాడర్ ప్రొలాప్స్’ అని చెబుతుంటారు. సాధారణంగా వీటన్నింటినీ కలిపి ‘పెల్విక్ ఆర్గాన్స్’గా పేర్కొంటారు కాబట్టి అవి జారినప్పుడు... అలా జరడాన్ని ‘పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్’ అనే ఒక్క మాటతో సూచిస్తుంటారు. నిజానికి ఇవేవీ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టే సమస్యలు కాదు. అయితే ఇలా జారడం వల్ల ఒక్కోసారి తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. కొన్నిసార్లు తీవ్రంగా నొప్పి కూడా వస్తుంటుంది.
చికిత్స
కొన్ని జీవనశైలి మార్పులు అనుసరిస్తూ కొంతమందిలో హార్మోన్ చికిత్స ఇవ్వడం ద్వారా ఈ కండిషన్‌ను డాక్టర్లు చక్కదిద్దడం జరిగినప్పటికీ... ఇలాంటి చర్యలతో అంతగా ఫలితం లేనప్పుడు జారిన అవయవాన్ని / అవయవాలను తిరిగి వాటి వాటి స్థానాల్లో అమర్చేలా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. చాలా సందర్భాల్లో శస్త్రచికిత్సతో ఆయా అవయవాలను వాటి స్థానాల్లో తిరిగి అమర్చడం మాత్రమే ప్రొలాప్స్‌కు శాశ్వత చికిత్సగా చెప్పవచ్చు.
డా‘‘ సరోజ బానోతు, కన్సల్టెంట్ ఆబ్‌స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్


