ఆయన చిరంజీవి | Renowned hypnotist BV Pattabhiram passes away | Sakshi
Sakshi News home page

ఆయన చిరంజీవి

Jul 2 2025 12:21 AM | Updated on Jul 2 2025 12:21 AM

Renowned hypnotist BV Pattabhiram passes away

అతను ఇంద్రజాలం చేశాడు. మాటలతో మనసుకు వైద్యం చేశాడు. యువతకు వ్యక్తిత్వ వికాసం తెలియజేశాడు. కళ్ళకు గంతలు కట్టుకుని స్కూటర్‌ నడిపి సంచలనం సృష్టించాడు. బి.వి. పట్టాభిరామ్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. సోమవారం రాత్రి కన్నుమూసిన ఆయన స్మృతికి నివాళిగా ఈ కథనం.

ఇంత హఠాత్తుగా పట్టాభిరామ్‌ వెళ్లిపో వటం నాకింకా నమ్మబుద్ధి కావటం లేదు. నాకన్నా వయస్సులో ఒక ఏడాది చిన్న. అయితే అతని ఆలోచనలు చాలా పెద్దవి.  ఎంతో బోళామనిషి. మనసులో ఏదీ దాచుకునేవాడు కాదు. దాచుకోవాలని ప్రయత్నించినా తెలిసిపోయేది. నవ్వు వస్తే హాయిగా నవ్వేసేవాడు. కోపం వచ్చినా అంతే. ఏదొచ్చినా పట్టలేం.

అది ఒక విలక్షణమైన, విశిష్ఠమైన మనస్తత్వం. ఇద్దరం సమవయస్కులం కావటం వల్ల చాలా తరచుగా కలుసుకోవటం, సాయంత్రాలు సరదాగా కాలక్షేపం చేయటం, మనసు విప్పి మాట్లాడుకోవటం... తరచుగా జరుగుతుండేది. ఓ శ్రేయోభిలాషి ఎలా ఉంటాడంటే పట్టాభిరామ్‌ లాగా ఉంటాడని చెప్పవచ్చు. ఒకసారి ఇద్దరం కర్నూల్‌లో పుల్లారెడ్డి కాలేజీలో ఒక కార్యక్రమానికి వెళ్లాం. అక్కడ ప్లే గ్రౌండ్‌ లో ఒక పక్కన నిలబడి సిగరెట్‌ కాల్చుకుంటున్నాను. పట్టాభిరామ్‌ గబగబా నా దగ్గరకు వచ్చి చెవిలో మెల్లగా చెప్పాడు: ‘‘ఇక్కడ సిగరెట్‌ తాగొద్దు. దాన్ని వెంటనే దాచేసేయ్‌.’’

నేను ఆశ్చర్యపోతూ ఆడిగాను:‘‘మనిషి మనిషి గా బతకాలని చెబుతున్నాం కదా. నా కిష్టమైంది నేను చేస్తే తప్పేంటి?’’ పట్టాభిరామ్‌ ఇంకాస్త దగ్గరకు వచ్చి అనునయంగా చెప్పాడు:‘‘గ్రౌండ్‌లో స్టూడెంట్స్‌ చూస్తున్నారు. తమకి ఎలాంటి అలవాట్లు ఉండొచ్చో, ఉండకూడదో బోధిస్తూ మార్గదర్శనం చేసే మార్గదర్శి ఇలా ధూమపానం చేస్తున్నాడేంటి – అనుకోరా?’’ నేను వెంటనే సిగరెట్‌ పడేశాను. పట్టాభిరామ్‌లో నాకొక నిజమైన శ్రేయోభిలాషి కనిపించాడు.

మేం ముప్ఫయేళ్ల వయసులో ఉండగా పట్టాభిరామ్‌ తరచుగా ఏవో గమ్మత్తైన మేజిక్‌లు చేస్తుండేవాడు. నలుగురం చేరితే చాలు. అలాంటి సందర్భాలు ఏ కాలేజి ఆవరణలోనో, కార్యాలయం ఆవరణలోనో జరిగితే అమ్మాయిలందరూ గబ గబా చేరిపోయేవారు. మిత్రులం ఈర‡్ష్య పడేవాళ్లం. నేను పట్టాభిరామ్‌తో సన్నిహితంగా మెలిగేకొద్దీ నాకొక విషయం అర్థమవుతూ వచ్చింది. పట్టాభిరామ్‌లో తాను ఎక్కడ ఉన్నా ప్రస్ఫుటంగా, ప్రముఖంగా తన ఉనికిని కాపాడుకుంటూ ఉంటాడు. తన రంగంలో తాను నంబర్‌ వన్‌ గా ఉండాలి అనే పట్టుదల ఉండేది. ఎలాంటి పట్టుదల! సైకాలజీలో ఎం.ఏ. చేశాడు.

రెండు దశాబ్దాల వ్యవధి లో రెండు పిహెచ్‌.డి లు చేశాడు. తను ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మేజిక్‌లు చేస్తూ నలుగురినీ ఆకట్టుకుంటూ ఉండేవాడు. క్రమంగా మేజిక్‌లకు ఆకర్షణ తగ్గుతుందనుకున్నప్పుడు హి΄్నాటిజంలో ప్రవేశించాడు. హిప్నటిజం అప్పట్లో యువతను విపరీతంగా ఆకర్షించింది. చాలామంది అతని దగ్గర హి΄్నాటిజం నేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతుండేవాళ్లు. అలా హి΄్నాటిజంతో బాగా ప్రచారంలోకి వచ్చాడు పట్టాభిరామ్‌.

హి΄్నాటిజంకి కూడా ఆకర్షణ తగ్గుతుందేమో అనిపించిన సమయంలో క్రమంగా వ్యక్తిత్వ వికాసం వైపు అడుగులు వేశాడు. అడుగులు వేశాడు అనే కన్నా దానిలోతులు అధ్యయనం చేస్తూ, విద్యార్థులనుంచీ వృద్ధ దంపతుల దాకా అన్ని వయసుల వారికీ సలహాలిచ్చే మార్గదర్శిగా ఎదిగాడు. ఈ రంగంలో అడుగుపెట్టాక అతనిక వెనుతిరిగి చూడలేదు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సలహాలిచ్చినా, క్లాసులు చెప్పినా అందులో సందర్భానుసారంగా తన ఇంద్రజాల చమత్కారాలను చొప్పించేవాడు. అవి తన దగ్గరకు కౌన్సెలింగ్‌ కోసం వచ్చినవాళ్లని మరింతగా ఆకట్టుకునేవి. అధికారులు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, విద్యార్థులు, కొత్తగా పెళ్ళయినవాళ్లు, పెళ్లి చేసుకోబోయే వాళ్లు, లాయర్లు సహా పట్టాభిరామ్‌ కౌన్సెలింగ్‌ కోసం తహతహలాడేవాళ్లు.

ఎంత ఎదిగినా నా లాంటి మిత్రులతో గడిపేటప్పుడు ఎంతో నిష్కల్మషంగా, నిరాడంబరంగా మెసలేవాడు. కల్మషం లేని మనసు. అతనిలో ఒక ఔన్నత్యం ఎలాంటిదంటే... 1980 దశకంలో హైదరాబాద్‌ రవీంద్రభారతి లో పట్టాభిరామ్‌ ఒక ఇంద్రజాల ప్రదర్శన చేస్తున్నాడు. అందులో ఒక మంచి ఇంద్రజాల ట్రిక్‌ విఫలమైంది. స్టేజిమీద ఏదో మేనేజ్‌ చేశాడు కానీ, ఆ ప్రయోగం విఫలమయిందని నాకర్థమయింది. నేను ప్రదర్శన అయ్యాక వెళ్లి కలిశాను. అతనిలో నిర్వేదం గమనించి అడిగాను: ‘‘ఏమైంది?’’

‘ఆ ప్రయోగం విఫలమవుతుందని ఊహించలేకపోయాను. అదే మనసులో వెంటాడుతోంది...’’ నేను వెంటనే పట్టాభిరామ్‌ భుజం మీద ప్రేమగా తట్టాను. ‘ఈ ప్రయోగం ఎన్నోసారి చేయటం?’’ ‘‘మొదటిసారి.’’ ‘‘అంతేనా, అయితే దీనికి అసలు విచారించనక్కరలేదు మనం. మొదటిసారి చేసినప్పుడు ఎందుకు విఫలమయ్యామో నీకు తెలిసింది. మరెప్పుడూ ఇది జరగనివ్వవు. జీవితంలో ఇలాంటివి మనం ఎన్ని చూడలేదు?... ఆలోచించు...’’ నేనిలా చెబుతుంటే పట్టాభిరామ్‌ సాలోచనగా తలూపుతున్నాడు. కొద్ది క్షణాలు నిశ్శబ్దం. వెంటనే తేరుకొన్నాడు. ఒక నవ్వు నవ్వేశాడు. నేనూ నవ్వాను. ఇద్దరం హాయిగా నవ్వుకున్నాం. నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాడు. ఎలాంటి అహంభావానికీ లోనుకాకుండా ఆత్మావలోకనం చేసుకునే, మిత్రుల సలహాలను అర్థం చేసుకునే ఔన్నత్యం అది. పట్టాభిరామ్‌! నా జ్ఞాపకాల్లో నువ్వు చిరంజీవివి. – యండమూరి వీరేంద్రనాథ్‌

శ్రీలక్ష్మి సంగీతం పిచ్చి పట్టాభిరామ్‌ కౌన్సెలింగ్‌
సినీ దర్శకులు జంధ్యాల, మల్లాది వెంకట కృష్ణమూర్తి, బి.వి.పట్టాభిరామ్‌... వీరంతా మంచి మిత్రులు. మల్లాది రాసిన ‘రెండు రెళ్లు ఆరు’ నవలను సినిమాగా తీస్తున్నప్పుడు అందులో హి΄్నాటిస్ట్‌ పాత్రను పట్టాభిరామ్‌ చేత చేయించారు జంధ్యాల. కథానుసారం సుత్తి వీరభద్రరావు భార్య అయిన శ్రీలక్ష్మికి సంగీతం పిచ్చి. కాని ఆమెకు సంగీతం రాదు. భర్తకు శాస్త్రీయ సంగీతం అంటేప్రాణం అని తెలుసుకుని అతణ్ణి ఇంప్రెస్‌ చేయడానికి సంగీతం నేర్చుకునేందుకు హార్మోనియం పెట్టె పనిపడుతుంటుంది– వంట కూడా మానేసి.

దాంతో సుత్తి వీరభద్రరావు వంట చేస్తుంటాడు... ఆ ఏరియా యాచకుడు అతని భోజనాన్ని మెచ్చి ఆ విషయాన్ని ఊరంతా ప్రమోట్‌ చేస్తుంటాడు. గ్రైండర్‌ కంపెనీ వాళ్లు వీరభద్రరావును తమ కంపెనీ మోడల్‌గా ఉండమని ఫోను చేస్తుంటారు. ఆ బాధలన్నీ పడలేని సుత్తి వీరభద్రరావు శ్రీలక్ష్మిని పట్టాభిరామ్‌ దగ్గరకు తీసుకెళ్లి హి΄్నాటిజమ్‌ ద్వారా సజెషన్స్‌ ఇప్పిస్తాడు. ‘మీకు సంగీతం ఇష్టం లేదు... సంగీతం ఇష్టం లేదు.. సంగీతం ఇష్టం లేదు’... అనేసరికి శ్రీలక్ష్మికి సంగీతం పిచ్చిపోతుంది. అయితే సుత్తి వీరభద్రరావు పట్టాభిరామ్‌కు ఇవ్వాల్సిన ఫీజు ఎగ్గొడతాడు. ఆ ఫీజు కోసం పదే పదే తిరిగిన పట్టాభిరామ్‌ క్లయిమాక్స్‌ సమయానికి మళ్లీ శ్రీలక్ష్మిని సంగీతం శ్రీలక్ష్మిగా మార్చడంతో ప్రేక్షకులు నవ్వుకుంటూ ఇంటి దారి పడతారు. ఈ సినిమాకు, ఈ సన్నివేశాలకు ఇప్పటికీ ఫ్యాన్స్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement