
ఓ వైపు శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి.. మరోవైపు ఆకతాయిలు పెచ్చు మీరుతున్నారు. ఇంకోవైపు గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు పెరుగుతున్నాయి. అన్నింటికీ పోలీసులే కావాలి. కానీ సరిపోయేంత సంఖ్యలో ఖాకీలు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో లేరు. ఫలితంగా ఉన్న వారిపైనే ఒత్తిడి పడుతోంది. ఊపిరి సలపనంత పనితో వారి గుండెపై భారం పడుతోంది. తీవ్ర నిద్రలేమి, సరైన సమయానికి భోజనం లేక 30 ఏళ్లు దాటిన పోలీసులకు సైతం బీపీ, మధుమేహం వస్తున్నాయి. చాలా మందికి ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు కూడా దెబ్బతింటున్నాయి. 50 ఏళ్లు దాటిన వారితో పాటు 35 ఏళ్లలోపు వారు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఉన్నతాధికారులకు చెప్పుకోలేక, కుటుంబ సభ్యులతో ఈ కష్టం పంచుకోలేక చాలా మంది తమలో తామే కుమిలిపోతున్నారు.
సిబ్బంది.. ఇబ్బంది
జిల్లాలో 38 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. రెండు వేల మంది పోలీసులు ఉన్నారు. ఉన్నవాళ్లలో 20 శాతం మందిని దేవాలయాలు, రాజకీయ సమావేశాలు, పోలీస్ పికెటింగ్, విద్యార్థుల పరీక్షలు వంటి బందోబ స్తు కార్యక్రమాలకు పంపుతుంటారు. ఒక్కో స్టేషన్‌లో 50 నుంచి 70 మంది ఉండాల్సి ఉన్నా పట్టుమని 20 మందైనా ఉండడం లేదు.
ఈలోగా స్టేషన్లలో పెండెన్సీ కేసులు, కొత్త కేసులు, కొత్త చట్టాలు, కొత్త యాప్‌లు, సంకల్పాలు, అవగాహనలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతూనే ఉంటాయి. ముఖ్యంగా హోంగార్డులు, కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్ల కొరత వేధిస్తోంది. మరో 500 మంది సిబ్బంది ఉంటే తప్ప ఉన్న వారి ఆరోగ్యం బాగు పడేట్లు కనిపించడం లేదు.
సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ..
50 ఏళ్లు దాటిన వారిని సైతం సుదూర (విజయవాడ)బందోబస్తులకు పంపిస్తుండటం ఇబ్బందిగా ఉంటుంది. టీఏ, డీఏలు, సరెండర్‌లీవ్‌లు కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పదిమంది వెళ్లాల్సిన స్థానంలో వందమందినైనా అక్కడి వాళ్లు అడుగుతుండటం, సొంత డబ్బులతోనే సిబ్బంది వెళ్తుండటం జీతాలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. స్టేషన్లలో పోలీసు వాహనాల కొరత ఉండటంతో సొంత వాహనాలకు పెట్రోల్ పోసి పరిసర ప్రాంతాల విధుల్లో తిరగాల్సి వస్తోందని చాలామంది వాపోతున్నారు.
జిల్లా కేంద్రం సమీపంలోని జెమ్స్ లో ఇటీవల పోలీసులకు నిర్వహించిన మెడికల్ క్యాంపులో 103మందికి పైగా సిబ్బందికి గుండెకు సంబంధించిన యాంజియోగ్రామ్, స్టంట్స్ అవసరమని వైద్యులు నిర్ధారించారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
వీరి పరిస్థితే హెచ్చరిక..
జనవరిలో నగరంలోని ఒకటో పట్టణ పరిధిలో యువకుడైన నాగరాజు అనే హోంగార్డు గుండెపోటుతో మరణించాడు. ఆయనకు భార్య, చిన్న పిల్లలున్నారు. జిల్లా కలెక్టరేట్ ట్రెజరీ విభాగంలో చెస్ట్ గార్డుగా ఉన్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ సవర జోక్యో గుండెపోటుతో మరణించాడని పోలీసులు ధ్రువీకరించారు. ఆయన వరుసగా మూడురోజులు విధుల్లో ఉన్నారు.
మందస హెడ్‌కానిస్టేబుల్ గవరయ్య (59) గుండెపోటుతోనే మరణించారు. నగరంలోనే కిడ్నీలు ఫెయిల్ అయి ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు. సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార బందోబస్తు విధులకు వెళ్లిన 57 ఏళ్ల ఆబోతుల లక్ష్మయ్య ఎండల వేడిమి తట్టుకోలేక స్ట్రోక్ వచ్చి విజయవాడలోనే మృతిచెందాడు. ఈయనది పోలాకి మండలం పల్లిపేట.
సోంపేట ఎస్‌ఐ రవివర్మకు ఇటీవలే రెండోసారి స్ట్రోక్ వచ్చింది. తొలిసారి ఒక స్టంట్, ఇప్పుడు యాంజియోగ్రామ్ అవసరమన్నారు. ప్రస్తుతానికి లీవ్‌లో ఉన్నారు. కాశీబుగ్గ కానిస్టేబుల్‌కు హార్ట్ ప్రాబ్లెం ఉండటంతో స్టంట్ వేయించుకున్నారు. సోంపేటలో ఓ కానిస్టేబుల్‌కు ఇదే పరిస్థితి ఉంది.
డే బై డే నైట్ డ్యూటీలతో సిక్..
గతంలో నైట్ బీట్ డ్యూటీల్లో కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఉండేవారు. ఎస్‌ఐలు, సీఐలు రౌండ్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 50 ఏళ్లు నిండి రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్న ఏఎస్‌ఐలు నుంచి హెడ్‌కానిస్టేబుళ్లు కూడా డే బై డే నైట్ బీట్లకు వెళ్లాల్సి వస్తోంది. అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల ఎస్‌ఐ–2లు వెళ్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు వరకు ఉండటమే కాక గంట గంటకూ లైవ్ లొకేషన్, రెండు ఫొటోలు పంపాల్సిందే.
మళ్లీ ఉదయాన్నే రోల్‌కాల్ 8గంటలతో డ్యూటీ మొదలు. 7:45 కల్లా సిద్ధంగా ఉండాలి. సెట్‌కాన్ఫరెన్సు (ఎస్‌ఐ, ఆపై ర్యాంకు) అయితే 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. మళ్లీ సాయంత్రం 5కి రోల్ కాల్, 7:30 నుంచి సెట్ కాన్ఫరెన్సు.. కొన్నిమార్లు జూమ్ కాన్ఫరెన్సులు.. సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ ఉంటాయి.
(చదవండి: