Period Time: ఐదు రోజుల నరకం.. ఇప్పుడిప్పుడే మార్పు!

Period Time: Kurma In Maharashtra Gadchiroli Safe Resting Home Women - Sakshi

మహారాష్ట్రలోని ఆ ప్రాంత స్త్రీలు నెలకు ఐదు రోజులు నరకం చూస్తారు. ఎందుకంటే బహిష్టు సమయంలో ఊరికి దూరంగా ఉండే బహిష్టు గదుల్లో గడపాలి కాబట్టి. ఈ మూఢాచారాన్ని రూపుమాపడం అక్కడ కష్టంగా మారింది. కనీసం కరెంటు, టాయిలెట్, తలుపులు లేని ఆ దారుణమైన బహిష్టు గదుల నుంచి వారిని బయటపడేయడానికి అక్కడ కొత్త బహిష్టు గదుల నిర్మాణం జరుగుతోంది. దీని వల్ల మార్పు మెల్లగా వస్తుందని భావిస్తున్నారు.

21 ఏళ్ల శీతల్‌ నరోటేకి నిద్ర పట్టడం లేదు. చీకటి గది అది. ఎత్తు తక్కువ ఉంది. గడప లేదు. దోమలు. చలి. దానికి తోడు మరో ఇద్దరు పెద్దగా పరిచయం లేని స్త్రీలు. ఆమె ఆ చీకటి గదిలో మరో నాలుగు రాత్రులు గడపాలి... క్షేమంగా ఈ రాత్రి తెల్లారితే. ఎందుకంటే శీతల్‌ బహిష్టులో ఉంది. ఆమెతో పాటు ఉన్న ఆ ఇద్దరు మహిళ లు కూడా బహిష్టులో ఉన్నారు. ఆ ఊళ్లో బహిష్టు అయిన ఆడవాళ్లు ఇళ్లల్లో ఉండటానికి వీలు లేదు. అలా ఉంటే దేవతల ఆగ్రహానికి గురవుతారని ఊరి నమ్మకం. అందుకే ఇలాంటి ‘బహిష్టు గదు’ల్లో ఉంటారు. ఆ గదుల్లో ఎటువంటి సౌకర్యాలు ఉండవు. అసలు వాటిని గది అనడానికి కూడా లేదు. అయినప్పటికీ అక్కడే ఉండాలి. శీతల్‌ ఇల్లు ఆ గది నుంచి 100 మీటర్ల దూరం ఉంటుంది. రాత్రి వెళ్లి ఆ ఇంటి వరండాలో పడుకుందామన్నా ఒప్పుకోరు. శీతల్‌ పడుతున్న బాధ ఆ ప్రాంతంలో ప్రతి స్త్రీ తరాలుగా పడుతోంది.

మహరాష్ట్ర గడ్చిరౌలీలో...
నాగ్‌పూర్‌ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గడ్చిరౌలీ గిరిజన ప్రాంతం. ఇక్కడ గోండులు, మడియాలు ఎక్కువగా జీవిస్తుంటారు. గ్రామాల్లోని స్త్రీలు బహిష్టు అయితే వారు అపవిత్రం అవుతారని తరాలుగా వీరు నమ్ముతారు. వీరు ఇళ్లల్లో ఉండకూడదు. ఊళ్లోని ‘బహిష్టు గదు’ల్లో ఉండాలి. వీరు వంట చేయడానికి, నీళ్లు చేదడానికి కూడా అర్హులు కారు. కుటుంబీకులలోని స్త్రీలు ఎవరైనా వీరికి ఆహారం, నీరు ఇవ్వాలి. బహిష్టులో ఉన్న స్త్రీలను మగవారు పొరపాటున తాకితే వెంటనే వారు తలస్నానం చేయాలి. ఈ గిరిజనులలో ఈ ఆచారం చాలా తీవ్రంగా నాటుకు పోయి ఉంది. ‘దీనిని మానేస్తే దేవతలు మా ఊరి మీద ఇళ్ల మీద ఆగ్రహిస్తారని మాకు భయం’ అని వారు అంటారు. మగవారు, గిరిజన పెద్దలు దీనికి పొరపాటున అంగీకరించరు. ఫలితం... స్త్రీలకు కలిగే తీవ్రమైన అసౌకర్యం.

శిథిల గుడిసెల్లో
గ్రామాల్లో శిథిల గుడిసెలను బహిష్టు గదులుగా గ్రామపెద్దలు కేటాయిస్తారు. వీటికి తలుపులు ఉండవు. కరెంటు ఉండదు. నీటి సౌకర్యం ఉండదు. బహిష్టు అయిన స్త్రీ ఇందులో ఉండాల్సిందే. ఎండ, వాన, చలి నుంచి ఏ రక్షణా ఉండదు లోపల. ‘దీనికి తోడు ఈ స్త్రీలు గుడ్డను కాని, శానిటరీ నాప్‌కిన్‌ని కూడా వాడరు (వాటి అందుబాటు ఉండదు). వరిగడ్డిని చుట్టచుట్టి పెట్టుకుంటారు. దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి’ అని అక్కడ పని చేసే కార్యకర్తలు అంటారు. రెండేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఒక మహిళ దోమల నుంచి కాపాడుకోవడానికి బహిష్టు గదిలో ఒక మూల మంట వేసింది.

ఆ పొగకు ఊపిరాడక మరణించింది. పాములు కాటేసిన ఘటనలు... అక్కడ ఉండటం వల్ల అనారోగ్యం వచ్చిన ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. ఈ అనాచారం నుంచి వీరిని బయటపడేసే బదులు ముందు ఈ ఆచారాన్ని గౌరవించి ఈ స్త్రీలకు సాయం చేద్దాం అని ముంబైకి చెందిన ‘ఖేర్వాడీ సోషల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’ భావించింది. ఈ గిరిజన గ్రామాల్లో సౌకర్యవంతమైన బహిష్టు గదులను నిర్మించాలని తలపెట్టింది. ఈ గదులు ఆ ప్రాంత స్త్రీల కళ్లలో ఆనందబాష్పాలు తెస్తున్నాయి.

సేఫ్‌ రెస్టింగ్‌ హోమ్‌ లేదా పిరియడ్‌ హోమ్‌
బహిష్టు గదులను ఈ ప్రాంతంలో ‘కుర్మా’ అంటారు. ఈ కుర్మాలను మెరుగైన వసతుల ‘సేఫ్‌ రెస్టింగ్‌ హోమ్‌’, లేదా ‘పిరియడ్‌ హోమ్‌’ పేరుతో ఖేర్వాడి సోషల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నిర్మించ తలపెట్టింది. గాలి వెలుతురు ఉండే విధంగా హోమ్‌ను నిర్మించి, విద్యుత్‌ సౌకర్యం కోసం సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసి, నీటి వసతి, అటాచ్డ్‌ బాత్‌రూమ్‌లు కల్పించి, మంచాలు ఏర్పాటు చేసి స్త్రీలకు ఆ ఐదు రోజులు ఇబ్బంది లేకుండా గడిచే ఏర్పాటు చేస్తోంది. ‘మాకు ఈ హోమ్‌లలో నచ్చిన విషయం తలుపు ఉన్న అటాచ్డ్‌ బాత్‌రూమ్‌ ఉండటం’ అని స్త్రీలు సంతోషపడుతున్నారు. 

టీనేజ్‌ అమ్మాయిలకు కష్టం
‘12 లేదా 13 సంవత్సరాలకు పెద్దవారైన ఆడపిల్లలు కూడా హటాత్తుగా ఇంటిని విడిచి ఐదురోజుల పాటు బహిష్టు గదుల్లో ఉండాలి. భయానకంగా ఉండే ఊరి పాత బహిష్టు గదుల్లో ఉండి వారు తీవ్రమైన వొత్తిడికి లోనవుతున్నారు. అసలు బహిష్టు సమయంలో స్త్రీలకు భౌతికంగా మానసికంగా చాలా ఓదార్పు కావాలి. అది వారికి ఇంటి నుంచే లభిస్తుంది. బహిష్టు అయినందుకు నింద భరించడం ఒకమాటైతే ఇలా ఇంటికి దూరం కావడం మరోమాట. దూరమైన ఆ ఐదు రోజులు వారికి సౌకర్యవంతమైన గది ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత’ అంటారు అక్కడ పని చేస్తున్న సామాజిక కార్యకర్తలు. మధ్య భారతదేశం, ఉత్తర భారతదేశంలోనే కాదు దక్షిణ భారతదేశంలో కూడా ఇంకా కొన్ని ప్రాంతాలలో కొన్ని వర్గాలలో బహిష్టుకు సంబంధించిన కట్టుబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ స్త్రీలను అగౌరవపరిచేవే. వీటన్నింటిని సమాజం తక్షణం వదిలించుకోవాలి.
– సాక్షి ఫ్యామిలీ 

చదవండి: Shradha Sharma: మీ కథే.. ఆమె కథ..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top