‘నువ్వు తెలివైనదానివి, ఒక్కదానివే ట్యూషన్ కి రా’ అన్నాడు సార్. 9వ తరగతి పాపకి అది మెచ్చుకోలులా అనిపించింది. తల్లికి మాత్రం గుండె ఆగినంత పనైంది. కో–ఎడ్ స్కూల్, ట్యూషన్, కోచింగ్... అందరూ మంచివారే ఉంటారు. కాని ఒక్క చెడ్డ వ్యక్తి చాలు పిల్లల భవిష్యత్తు పాడు కావడానికి. గర్ల్ స్టూడెంట్స్‌కు చెప్పాల్సిందేమిటి? మనం చేయాల్సిందేమిటి?
కేస్ స్టడీ...
రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ హైస్కూల్‌లో అనూష 8వ తరగతి. మ్యాథ్స్ సార్ ‘నువ్వు బాగా ట్రై చేస్తే టాపర్ అవుతావు. స్కూల్ అయ్యాక స్టాఫ్‌రూమ్‌కి రా, డౌట్స్ చె΄్తా’ అన్నాడు. మొదటి రెండు రోజులు పాఠమే చెప్పాడు. మూడో రోజు భుజం మీద చెయ్యి వేశాడు.
‘ఇది మనిద్దరి సీక్రెట్. అమ్మకు చెప్తే అపార్థం చేసుకుంటుంది’ అన్నాడు. అనూష ఇంటికెళ్లి ఏడ్చింది. తల్లి ‘సార్ అలాంటోడు కాదు, నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావ్’ అని కొట్టింది. పాప మూడురోజులు స్కూల్ మానేసింది. తర్వాత నానమ్మ ధైర్యం చెప్పి, అనూషతో మాట్లాడించి విషయం హెడ్మాస్టర్‌కి చెప్పింది. పేరెంట్స్ గొడవ చేయడంతో డీఈఓ విచారణ జరిపి ఆ టీచర్‌ని సస్పెండ్ చేశారు.
పిల్లలకు బయట జరిగేవి తెలియదు. తల్లిదండ్రులుగా మనం చెప్పాల్సినవి సరిగా చెప్పం. మనం కూడా అన్నింటినీ నమ్మేస్తుంటాం... ‘సార్ చాలా మంచోడు, మా పాపని బాగా చూసుకుంటాడు’ అని. కానీ ‘మంచితనం’ ముసుగులో ‘పర్సనల్ అటెన్షన్’ పేరుతో పాపతో చాటింగ్, ‘నీ డ్రెస్ బాగుంది’ అనే కామెంట్, ‘స్కూల్ అయ్యాక కలవమని’ పిలుపు... ఇవన్నీ మొదలైతే?
ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకూ చదివే ఆడపిల్లలకు మంచి–చెడు మధ్య గీత తెలీదు. ‘సార్ అంటే దేవుడు’ అని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని లైన్ దాటే ఒక్కరున్నా చాలు. ప్రమాదం. కాలేజీలో అయితే ఒక గమనింపు ఉంటుంది. కాలేజీ వయసు పిల్లలకు కాçస్త పరిణితి ఉంటుంది. హైస్కూల్‌లో? అందుకే పేరెంట్‌గా మనం మేలుకోవాలి. టీచర్‌ని అనుమానించమని కాదు. పాపని అప్రమత్తం చేయమని.
టీచర్æ అంటే పాఠం చెప్పాలి. మార్కులు ఇవ్వాలి. అంతే. కానీ ఈ గీత దాటితే డేంజర్.
పేరెంట్ డ్యూటీ
⇒ పాప ఫోన్ ఒక్కసారి చెక్ చేయండి. ‘సార్‌తో చాటింగ్’ ఉంటే వెంటనే ఆపండి. స్కూల్‌కి వెళ్లి హెడ్మాస్టర్‌తో మాట్లాడండి. ‘మా పాపకి మీరు క్లాస్‌లోనే డౌట్స్ క్లియర్ చేయండి’ అని తేల్చి చెప్పండి ∙స్కూల్‌లో ‘కంప్లైంట్ బాక్స్’ లేదా? అదే మొదటి ఫెయిల్యూర్. హైస్కూల్‌లో ‘ పోక్సో’ కమిటీ ఉండాలి. ‘చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ’ అని బోర్డ్ ఉండాలి. అందులో లేడీ టీచర్, పేరెంట్, పోలీస్ నుంచి ఒకరు మెంబర్‌గా ఉండాలి.
పాపకి ‘నో’ చెప్పడం నేర్పండి
మనం ఆడపిల్లలకి ‘బస్‌లో జాగ్రత్త, అపరిచితులతో మాట్లాడకు’ అని చె΄్తాం. కానీ ‘టీచర్ లైన్ దాటితే నో చెప్పు’ అని చెప్పం. ఎందుకంటే ‘టీచర్‌ని ఎదిరించకూడదు’ అని మనమే నేర్పించాం. టీచర్ అయినా సరే ఇబ్బందిగా వ్యవహరిస్తూ ఉంటే ‘నో చెప్పాలి’ అని నేర్పించాలి.
ఇంట్లో చేయాల్సిన 3 పనులు
పని 1: ‘బాడీ రూల్’... ‘నీ బాడీ నీ ఇష్టం. ఎవరు అసౌకర్యంగా టచ్ చేసినా ‘వద్దు’ అని గట్టిగా చెప్పు. సార్ అయినా, బాబాయ్ అయినా సరే’ అని చెప్పండి.
పని 2: ‘సీక్రెట్ వద్దు’... ‘సార్ నీకు చాక్లెట్ ఇచ్చి ఎవరికీ చె΄÷్పద్దు అన్నాడా? అలాంటి సీక్రెట్స్ అమ్మకు చె΄÷్పచ్చు. సార్‌తో సీక్రెట్స్ వద్దు’ అని క్లియర్‌గా చెప్పండి.
పని 3: ‘నమ్మకం’... పాప వచ్చి ‘అమ్మా, సార్ ఇలా చేశాడు’ అంటే ‘ఛీ, అలా అనకూడదు, సార్ అలాంటోడు కాదు’ అని తిట్టకండి. ముందు కౌగిలించుకుని ‘నాకు చెప్పినందుకు థాంక్స్ తల్లీ. నేను చూసుకుంటా’ అని భరోసా ఇవ్వండి. పాప మళ్లీ మీతో ఏ విషయమైనా షేర్ చేస్తుంది.
ఎనిమిదవ తరగతి పాప బ్యాగ్‌లో బుక్స్ మోయాలి. ‘భయం’ కూడా మోయకూడదు. ‘సార్ ఏమంటాడో’ అని వణుకుతూ స్కూల్‌కి వెళ్లకూడదు. 99 మంది టీచర్లు దేవుళ్లే. కాని ఆ ఒక్కడు రాక్షసుడు అయితే వాడిని గుర్తుపట్టే కళ్లు మనకి ఉండాలి. పాపకీ ఉండాలి.
స్కూల్ కాం΄ûండ్ వాల్ ఎంత ఎత్తు ఉన్నా, పాప మనసులో ‘భరోసా’ అనే వాల్ కట్టక పోతే వేస్ట్. రేపు పీటీఎంకి వెళ్లినప్పుడు మార్కుల కార్డ్ కాదు, ముందు స్కూల్ సేఫ్టీ కార్డ్ అడగండి. ఎందుకంటే పాస్ అవడం కంటే క్షేమంగా ఇంటికి రావడం ముఖ్యం. బడులు తెరిచి హుషారుగా పాఠాలు సాగుతున్నాయి. పిల్లలకు ఈ ‘ముందు జాగ్రత్త’ పాఠం తప్పనిసరిగా చెప్పి, పంపండి.
మీరు చేయాల్సింది
పేరెంట్స్–టీచర్ మీటింగ్‌కి వెళ్లినప్పుడు ‘సార్... మన స్కూల్‌లో పోక్సో కమిటీ ఎవరు? వాళ్ల నంబర్ నోటీస్ బోర్డ్‌లో ఉందా?’ అని గట్టిగా అడగండి. లేక పోతే డి.ఇ.ఓ.కి కంప్లైంట్ ఇవ్వొచ్చు. ప్రైవేట్ స్కూల్ అయితే టీసీ తీసుకుంటాం అని భయపెట్టండి. పాప సేఫ్టీ కంటే టీసీ ఎక్కువ కాదు.
‘మంచి సార్’ ముసుగులో దాగే 3 రెడ్ ఫ్లాగ్స్
రెడ్ ఫ్లాగ్ 1: ‘ఒక్కదానివే రా’.... ‘డౌట్స్ క్లాస్ ఉంది, నువ్వొక్కదానివే రా’ అని స్కూల్ టైం అయ్యాక పిలవడం. గ్రూప్‌గా పిలవొచ్చు కదా? ఎందుకు ఒక్కదాన్నే?
రెడ్ ఫ్లాగ్ 2: ‘పర్సనల్ గిఫ్ట్’... బర్త్‌డేకి చాక్లెట్, పెన్, గాజులు ఇవ్వడం. క్లాస్ మొత్తానికి ఇవ్వకుండా ఒక్క పాపకే ఇవ్వడం. ‘నువ్వు స్పెషల్’ అనే ఫీలింగ్ కలిగించడం.
రెడ్ ఫ్లాగ్ 3: ‘ఫోన్ ఛాటింగ్’... ‘హోంవర్క్ డౌట్’ అని స్టార్ట్ చేసి, ‘భోజనం చేశావా?’, ‘ఏం డ్రెస్ వేసుకున్నావ్?’ అని పర్సనల్ మెసేజ్‌లకి దిగడం. టీచర్‌కి పిల్లలతో వాట్సాప్ చాట్ ఏంటి?
రియాలిటీ ఏంటి?
తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్స్‌లో 90 శాతం ఈ బోర్డ్ ఉండదు. ఉన్నా, ఎక్కడ పెట్టారో ఎవరికీ తెలీదు. పాపకి ఏదైనా ఇబ్బంది అయితే ఎవరికి చెప్పాలో తెలీదు. హెడ్మాస్టర్‌కి చెప్తే ‘సార్ మంచోడే, నువ్వే అపార్థం చేసుకున్నావ్’ అని మందలిస్తాడు.
– కె.


