Odisha Twitter Girl Deepa Barik: ట్విటర్‌ దీపం

Odisha Twitter Girl DEEPA BARIK is a Twitter Queen - Sakshi

సమస్యలను పరిష్కరించడం, తోటివారికి సాయం చేసే గుణం ఉంటే అధికారం, పదవులు, డబ్బులు లేకపోయినప్పటికీ ట్వీట్స్‌తో సామాజిక సేవ చేయవచ్చని నిరూపించి చూపిస్తోంది ఒడిషా ట్విటర్‌ క్వీన్‌ దీపా బారీక్‌.

ఒడిషాలోని బర్గఢ్‌ జిల్లా టెమ్రీ గ్రామానికి చెందిన దీపా బారీక్‌ తండ్రి వ్యవసాయదారు. తల్లి అంగన్‌వాడి వర్కర్‌. మూడేళ్ల క్రితం దీపకు తల్లిదండ్రులు స్మార్ట్‌ ఫోన్‌ కొనిచ్చారు. దీంతో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఎలా వాడాలో తెలుసుకునేందుకు పక్కింట్లో ఉంటోన్న సామాజిక కార్యకర్త దిబాస్‌ కుమార్‌ సాహుని కలిసింది. అతను స్మార్ట్‌ ఫోన్‌ వాడకం గురించి వివరిస్తూ వివిధ రకాల సోషల్‌ మీడియా యాప్‌లు దీప ఫోన్‌లో వేశాడు. వీటితోపాటు ట్విటర్‌ యాప్‌ వేస్తూ ‘‘నువ్వు చేసే ట్వీట్‌ను తప్పనిసరిగా ఫలానా వ్యక్తులు చూడాలనుకుంటే వారి అకౌంట్‌ను ట్యాగ్‌ చేసి పోస్టుచేస్తే వారికి నేరుగా చేరుతుంది’’ అని చెప్పాడు. దిబాస్‌ చెప్పిన ఈ విషయమే దీపను ఒడిషా ట్విటర్‌ క్వీన్‌గా మార్చింది.

సౌకీలాల్‌తో తొలిసారి..
అది 2019 ఒడిషాలో తీవ్ర అల్పపీడనం ఏర్పడి గ్రామాల్లో ఇళ్లు కొట్టుకు పోవడంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. టెమ్రీ గ్రామానికి పక్కనే ఉన్న మరో గ్రామంలో ఇల్లు కొట్టుకుపోవడంతో పేద దంపతులు ఉండడానికి వసతి లేక ఇబ్బందులు పడుతుండడం కనిపించింది దీపకు. అది చూసి చలించిపోయి సౌకీలాల్‌ దంపతుల సమస్యను వివరిస్తూ.. ఒడిషా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఐదుగురు ఉన్నత స్థాయి అధికారులతోపాటు సోషల్‌ మీడియా గ్రీవెన్స్‌ సెల్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేసింది. ట్వీట్‌ చేసిన 48 గంటల్లోనే గ్రామాభివృద్ధి అధికారి గ్రామాన్ని సందర్శించి, సౌకీలాల్‌ ఇల్లు కట్టుకునేందుకు రూ.98 వేల రూపాయలను ఇచ్చారు.

ఈ సంఘటన దీపకు ముందుకు సాగడానికి ఉత్సాహాన్ని ఇవ్వడంతో..తరువాత మగదిక్కులేని వితంతువులకు పెన్షన్‌ కష్టాలు, ఆర్థిక సమస్యలతో పోరాడుతున్న వారి సమస్యలను రాష్ట్ర ఆశీర్వాద్‌ యోజన అధికారులకు చేర్చి వితంతువుల సమస్యను పరిష్కరించింది. వికలాంగులకు ప్రభుత్వం అందించే సదుపాయాలన్నింటిని వారి చెంతకు చేర్చడం, బిలాస్‌పూర్‌ గ్రామంలో డ్యామ్‌ మరమ్మతుల కారణంగా పంటపొలాలకు నీళ్లు అందకపోవడంతో.. ఆ సమస్యను నీటిపారుదల అధికారులను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేయడంతో రైతులు పంటలు పండించేందుకు నీరు అందింది. ఇలా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా దీప ఐదు వేలమందికి పైగా సాయం చేయడం విశేషం.

దేశంలో ఎక్కడున్నా... నేనున్నానంటూ...
వివిధ సమస్యల పరిష్కారానికి దీప ట్వీటర్‌ సాయంతో చేస్తున్న కృషి స్థానికంగా చాలా పాపులర్‌ అయ్యింది. దీంతో ఎవరికి ఏ సమస్య ఉన్నా దీపను కలిసి వివరించడం, ట్విటర్‌ వేదికగా దీప ఆ సమస్యను సంబంధిత అధికారుల ముందు ఉంచడం, వారు దానిని పరిష్కరించడం చకచక జరిగిపోతున్నాయి. సొంతరాష్ట్రంలో ఇబ్బంది పడుతోన్న వారికేగాక, బతుకుదెరువుకోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారికి సైతం దీప సాయం చేస్తోంది.

గతేడాది అక్టోబర్‌లో ఒడిషాకు చెందిన 23 మంది తెలంగాణలోని పెద్దపల్లిలో ఓ ఇటుకల తయారీ బట్టీలో పనిచేయడానికి చేరారు. బట్టీ యజమాని ఆహారం, నీరు ఇవ్వకుండా, ఎక్కువ గంటలు పనిచేయమంటూ హింసించేవాడు. రోజులు గడిచేకొద్ది వాళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. అది తట్టుకోలేక అక్కడినుంచి ఎలా బయటపడాలా? అనుకుంటోన్న సమయంలో వారిలో ఒకతనికి దీప గురించి తెలియడంతో.. వెంటనే ఈ సమస్య గురించి దీపకు చెప్పారు. వెంటనే ఆమె తెలంగాణ పోలీసులకు ట్వీట్‌ ద్వారా సమాచారం ఇచ్చింది. పోలీసులు స్పందించి 23 మంది కూలీలను రక్షించి సొంతరాష్ట్రానికి పంపించారు. ఇలా దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తోన్న వెయ్యిమంది ఒడిషా కూలీలకి సాయం చేసింది.
 
సమస్యలను వెతుక్కుంటూ..
అడిగిన వారికేగాక, చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం, దినపత్రికల్లో ప్రచురితమయ్యే ప్రజాసమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా అధికారులకు చేరవేయడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తోంది దీప. ప్రస్తుతం సైన్స్‌లో పీజీ చేస్తున్న దీప భవిష్యత్‌లో ప్రొఫెసర్‌ కావాలనుకుంటోంది. ‘‘ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నా లాంటి వారినెందరినో తయారు చేయవచ్చు. ఇలాంటివాళ్లు సమాజంలో మరెంతోమందికి సాయం చేస్తారు’’  అంటూ భవిష్యత్‌ తరాల గురించి ఆలోచించడం విశేషం.
తన ద్వారా సాయం అందిన వారితో దీప.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top