
మిస్ వరల్డ్ 2025
‘‘ప్రస్తుతం నేను ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి వేదిక పైన నిల్చున్నాను. కానీ మన ప్రపంచం అంత అందంగా లేదు.., ఎన్నో సామాజిక వైరుధ్యాలున్నాయ’ని మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న మిస్ జింబాబ్వే కోర్‌ట్న జాంగ్వే తెలిపింది. 2023 నాటికి ప్రపంచ సామాజిక వైకల్యానికి మానసిక ఆరోగ్య సమస్యలు ప్రధాన కారణంగా నిలువనున్నాయని, ఇది తన మాట కాదు.. ఏకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించిందని గుర్తు చేసింది.
ముఖ్యంగా తమ ఆఫ్రికన్ దేశాల్లో ఈ మానసిక ఆరోగ్య (మెంటల్ హెల్త్) సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీని గురించి ఎవరూ అంతగా మాట్లాడట్లేదని జాంగ్వే ఆవేదన వ్యక్తం చేసింది. ఒక వేళ తాను మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే ఈ సమస్యపై కొనసాగుతున్న నిశ్శబ్దాన్ని ఛేదించడానికి తన కిరీటాన్ని, కీర్తిని వినియోగిస్తానని ఉద్వేగంగా ప్రకటించింది. మిస్ వరల్డ్ 2025 నేపథ్యంలో కోర్‌ట్న జాంగ్వే ప్రత్యేకంగా ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకుంది.
మిస్ వరల్డ్ అనేది మహిళా సాధికారత పై దృష్టి సారించే అంతర్జాతీయ వేదిక. ఈ గుర్తింపు మహిళా సాధికారత, ఇతర సమస్యలపైన పోరాడటానికి మద్దతిస్తుందని నమ్ముతాను. నా దృష్టిలో నిజమైన అందం బాహ్య రూపాన్ని అధిగమిస్తుంది. నిజమైన సౌందర్యం మనల్ని వ్యక్తపరిచే వ్యక్తిత్వం, చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎలా దోహదపడతారనే బాధ్యత.
అందుకే సోషల్ మెంటల్ హెల్త్‌ను నా భద్యతగా తీసుకున్నాను. డిప్రెషన్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో పోరాడుతున్న సమాజంలో పెరిగాను. ఇలాంటి కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలను దగ్గరగా చూశాను. నా పాఠశాలలో నా స్నేహితులు డ్రగ్స్‌కు బానిసలైన సంఘటనలు చూస్తూ పెరిగాను. ఈ సమస్యలకు మా మూలాల్లో కారణాలు ఎన్నైనా ఉండొచ్చు.., కానీ వాటిని మార్చాల్సిన బాధ్యత నా పైన ఉంది.
జింబాబ్వే వంటి మా ఆఫ్రికన్ దేశాల్లో పలు సామాజిక రుగ్మతలున్నాయి. ఇలా మాట్లాడితే అది మా మూలాలకు కళంకం కావొచ్చు. కానీ నేను దీని పైన అవగాహన కల్పించాలని నిశ్చయించుకున్నాను. ఇది మా ఒక్కరి సమస్య కాదు.. ప్రపంచ సమస్య. మిస్ జింబాబ్వేగా నిలిచిన తరువాత నా ప్రయత్నం వల్ల చాలా మార్పును చూశాను.
అందుకే నేను మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే నా ప్రయత్నాన్ని విశ్వవ్యాప్తం చేస్తాను. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జింబాబ్వేలో చేపట్టిన నాప్రాజెక్ట్‌ను ప్రపంచంలోని వివిధప్రాంతాలకు తీసుకెళ్తాను. డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించడానికి నాకున్న పలుకుబడితో అవగాహన కల్పిస్తాను. ఆకలి, పేదరికం, కనీస వసతులు లేని వారి గొంతుకగా మారతాను.
అంతర్జాతీయంగా ఫ్యాషన్ రంగంలో మా కళకు, డిజైనింగ్‌కు ప్రత్యేకత ఉంది. మా డిజైనర్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఒక మోడల్‌గా ఈ విషయంలో నేను గర్వపడతాను. మాది చాలా కష్టపడే వ్యక్తిత్వం. జింబాబ్వే గురించి నాకు చాలా నచ్చిన ఒక విషయం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మాప్రామాణికతను కోల్పోము. అందుకే విదేశాల్లోనూ ఆఫ్రికన్ల సంస్కృతి ఇప్పుడు ట్రెండ్‌గా మారుతోంది. భారతదేశంలో సాంస్కృతిక వైవిధ్యం, సమ్మేళనం మనమందరమెంత విభిన్నమో దానిని అంతే అందంగా చూపిస్తుంది’’ అంటూ తన మనసులోని భావాలను పంచుకున్నారు జాంగ్వే.
– హనుమాద్రి శ్రీకాంత్