
కోల్‌సిటీ(రామగుండం): ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టగానే చల్లని వాతావరణం.. ఆకట్టుకునే పచ్చని మొక్కలు.. తీరొక్కపూలు స్వాగతం పలుకుతున్నాయి. గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన ఆడెపు రామకృష్ణ దంపతులు తమ ఇంటిని పచ్చదనంతో నింపేసి పొదరిల్లుగా మార్చుకుని.. పర్యావరణానికి ఊపిరిపోస్తున్నారు. ఓ స్కూల్‌లో విద్యాబోధన చేస్తున్న గీతాశ్రీ– రామకృష్ణ దంపతులకు మొక్కల పెంపకం అంటే చాలాఇష్టం. గతంలో రామకృష్ణ ఎకో క్లబ్‌లో చేరి మొక్కల పెంపకంపై శిక్షణ పొందారు. ఆ తర్వాత 24 ఏళ్లుగా తన ఇంటి ఆవరణలోనే వివిధ రకాల పూలు, పండ్లు, స్వచ్ఛమైన గాలి అందించే అనేకరకాల మొక్కలు పెంచుతున్నారు. ఆకుకూరలూ సాగు చేస్తున్నారు. వంటగదిలోని వ్యర్థాలు, ఎండుఆకులు, కుళ్లిన కూరగాయలతో సేంద్రియ ఎరువు తయారు చేస్తూ మొక్కలకు వేస్తున్నారు. పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్ డబ్బాలు, టోపీలు, బకెట్లు, పాడైన కూలర్లు, ఇంట్లోనే తయారు చేసిన సిమెంట్ కుండీలే మొక్కలకు నిలయాలుగా మార్చారు.
ఏడాదికి రూ.లక్ష ఖర్చు
నేను 24 ఏళ్లుగా మొక్కలు పెంచుతున్న. ఇది నాకు హాబీగా మారింది. ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ శుభకార్యం జరిగినా అక్కడికి మొక్కతో వెళ్తాను. కొత్త మొక్కలు కనిపిస్తే ఖర్చుకోసం ఆలోచించకుండా కొంటాను. ఏడాదికి మొక్కల కొనుగోలుకు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తుంటా. ఇంట్లోనే సేంద్రియ ఎరువు, సిమెంట్ తొట్టీలను తయారు చేస్తున్న. మొక్కల పెంపకంతో మాకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. – ఆడెపు రామకృష్ణ, గోదావరిఖని
ఇదీ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్‌లు