భారత విజ్ఞానం
మహాభారతంలో శిశుపాలుడిది ఒక ప్రత్యేక పాత్ర... నాలుగు చేతులు, మూడు కళ్ళతో చూసేందుకు భీతిగొల్పేలా పుట్టిన శిశుపాలుని ఎవరు ఎత్తుకొంటే సాధారణ రూపానికి చేరుకుంటాడో అతని చేతిలోనే మృత్యువు రాసి పెట్టి ఉందని ఆకాశవాణి పలుకుతుంది.
శిశుపాలుడు ఛేది రాజ్య చక్రవర్తి ధర్మఘోషుడు, సాత్వతిల కుమారుడు. సాత్వతి స్వయానా కృష్ణుని తండ్రి వసుదేవునికి సోదరి. అంటే కృష్ణుడికి మేనత్త. శిశుపాలుడు మేనత్త కొడుకు. ఇదిలావుండగా అంగవైకల్యంతో, చూసేందుకు భీతి గొలుపుతున్న శిశుపాలుని ఎత్తుకోమని, సాత్వతి అందరినీ కోరసాగింది.
ఒకరోజు బలరామకృష్ణులు మేనత్తని చూడాలని ఛేది రాజ్యానికి వచ్చారు. అప్పుడే శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు ఎత్తుకున్నాడు. దీంతో అతడి వికృత రూపం పోయింది. తన కుమారుడు శిశుపాలునికి సాధారణ రూపం వచ్చినందుకు కలిగిన ఆనందం కంటే, మేనల్లుడి చేతిలో తన కొడుకు మరణిస్తాడనే ఆందోళన తో తనకు పుత్రభిక్ష పెట్టమని జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుని వేడుకుంది సాత్వతి.
అర్హమైన వంద తప్పుల వరకు మన్నిస్తానని, ఆపై తప్పులు మీరితే సంహరిస్తానని తన మేనత్త అయిన సాత్వతి కి మాట ఇచ్చాడు. అందుకే శిశుపాలుడు వంద తప్పులు చేసేవరకు కృష్ణుడు ఎంతో సంయమనంతో ఉన్నాడు. దీనిని అలుసుగా తీసుకొని అహంకారం తో విర్రవీగిన శిశుపాలుడు తనకు తిరుగులేదని తప్పుమీద తప్పు చేసుకుంటూ పోయాడు. వసుదేవుని యజ్ఞాన్ని అడ్డుకుని అశ్వాన్ని దొంగలించడమే కాదు, దాన్ని సంహరించాడు.
కృష్ణుడు లేని సమయంలో ద్వారకకు నిప్పంటించడమే కాదు, రుక్మిణిని వివాహం చేసుకోవాలని చూశాడు. బభ్రువాహనుడి భార్యని అపహరించి తనదాన్ని చేసుకున్నాడు. ఇన్ని తప్పులు, ఘోరాలు శిశుపాలుడు చేసినా ఇచ్చిన మాట ప్రకారం శ్రీకృష్ణుడు ఓపిక పట్టాడు. ధర్మరాజు తలపెట్టిన రాజసూయ యాగంలో భాగంగా ఛేది దేశానికి వచ్చిన భీముడిని, శిశుపాలుడు ఆదరించాడు. యాగం కోసం ధనం కూడా అందించాడు. ధర్మరాజు ఆహ్వానం మేరకు సభకు వచ్చాడు. తొలి అర్ఘ్యానికి శ్రీ కృష్ణుడే అర్హుడని భీష్ముడు చెప్పడంతో శిశుపాలుడు ఆగ్రహించాడు.
ఒక యాదవుడు పూజ్యుడెలా అవుతాడని నోటికి వచ్చినట్లు మాట్లాడి శ్రీ కృష్ణుని అవమానించాడు శిశుపాలుడు. భీష్మపితామహుని తప్పుబట్టి ధర్మరాజుని దుయ్యబట్టాడు. దీంతో భీముడు, సహదేవుడు ఆవేశపడితే భీష్ముడు వారిని వారించాడు. కృష్ణుడు సభనుద్దేశించి ‘‘శిశుపాలుడి తల్లికిచ్చిన మాట ప్రకారం అతడి వంద అపరాధాలను మన్నించాను... నేటితో వంద తప్పులు పూర్తయ్యాయి. ఈ మూర్ఖుని ఇప్పుడే సంహరిస్తాను’’ అని పలికి సుదర్శన చక్రంతో శిశుపాలుని శిరస్సు ఖండించాడు.
శిశుపాలుడు ఎవరు?
బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందాదులు విష్ణు మూర్తిని దర్శించుకోవాలని వైకుంఠానికి వెళ్ళినపుడు అక్కడ ఉన్న ద్వార పాలకులైన జయ, విజయులు, ఈ సమయంలో విష్ణుమూర్తి ఏకాంత సమయంలో ఉన్నారని, దర్శనానికి తగిన సమయం కాదని వారించడంతో పాటు, వారిని లోనికి పంపకపోవడంతో, ఆగ్రహించిన సనక, సనందాదులు, జయ, విజయులను వైకుంఠ లోకంలో ఉండేందుకు అర్హత లేకుండా శపిస్తారు.
అనంతరం తమ తప్పును తెలుసుకున్న జయ, విజయులు శాప విమోచనం కోరగా విష్ణుమూర్తితో 7 జన్మల మిత్రుత్వం కానీ 3జన్మల శత్రుత్వం అనంతరం మరలా విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని సూచిస్తారు. దీనితో జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించి మూడు జన్మల శత్రుత్వం నెరపి విష్ణుమూర్తి చేతిలో హతులై, మరలా విష్ణుమూర్తి ద్వారపాలకులయ్యారు జయవిజయలు...
– సి.ఎన్.మూర్తి, సీనియర్ జర్నలిస్ట్


