ఆన్‌లైన్‌ కోర్సులు: ప్రపంచ రికార్డు

Kerala Women Aarti Raghunath Creates World Record On Online Courses - Sakshi

లాక్‌డౌన్‌ సమయంలో కొందరు సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చారు. కొందరు ఆన్‌లైన్‌ గేమ్స్‌ మీద దృష్టిపెట్టారు. ఇంకొందరు కొత్తరకం వంటకాలు చేస్తూ రుచిని ఆస్వాదించారు. కానీ, కేరళకు చెందిన ఆర్తి రఘునాథ్‌ 90 రోజుల్లో 350 ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తి చేసి, ప్రపంచ రికార్డు సృష్టించింది.  

ఆర్తి ఎంఇఎస్‌ కాలేజీలో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి మాలియక్కల్‌ మేదతిల్‌ ఎంఆర్‌ రఘునాథ్, తల్లి కళాదేవి. కోవిడ్‌–19 సృష్టించిన ఇబ్బందులతో ప్రజలు వివిధ కార్యకలాపాలు చేస్తూ తమ సమయాన్ని గడుపుతుండేవారు. ఆర్తి రఘునాథ్‌ మాత్రం చదువుకుంటూ కాలం గడిపింది. ఆర్తి కొచ్చిలోని ఏలంకరలో ఉంటుంది. ‘కరోనా కాలంలో మూడు నెలల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచించాను. అప్పుడే నా దృష్టి ఆన్‌లైన్‌ కోర్సుల మీద పడింది. ఇందుకు ఆన్‌లైన్‌లోనే మా లెక్చరర్ల సలహా తీసుకున్నాను. వారి సూచనలతో ఒక్కో విశ్వవిద్యాలయానికి అప్లికేషన్‌ పెట్టాను. అలా ఆన్‌లైన్‌లోనే 350 కోర్సులు పూర్తి చేశాను. అన్నీ పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలే. ఇప్పటి వరకు ఇన్ని కోర్సులు చేసినవారు ఎవరూ లేకపోవడంతో నాకు ప్రపంచ రికార్డు దక్కింది’ అని ఆర్తి సంతోషంగా వివరించింది.

కోర్సులను ఎలా పూర్తిచేయగలిగిందో ఆర్తి మరింత వివరంగా చెబుతూ ‘ఆన్‌లైన్‌ కోర్సులు భారీ స్థాయిలో ఉన్నాయి. అన్నీ అంత సులువుగా ఏమీ అర్థం కాలేదు. ఇలాంటప్పుడు మా కాలేజీ ప్రిన్సిపాల్‌ పి మహ్మద్, హనిఫా కె జి, క్లాస్‌ ట్యూటర్‌ నీలిమా టి కె సహాయంతో కోర్సులను సకాలంలో పూర్తి చేశాను’ అని తెలిపింది. ఆర్తి కోర్సులు తీసుకున్న విశ్వవిద్యాలయాలలో జాన్‌ హాకిన్స్, వర్జీనియా, కొలరాడో బౌల్డర్, కోపెన్‌ హాగన్, రోచెస్టర్, ఎమోరీ, కోర్సెరా ప్రాజెక్ట్‌ నెట్‌వర్క్, డెన్మార్క్‌ సాంకేతిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 
సమయం అందరికీ ఒకేవిధంగా ఉంటుంది. దానిని ఉపయోగించుకునే వారి తీరును బట్టి కాలం పట్టం కడుతుంది. అలా 90 రోజులలో 350 కోర్సులతో ప్రపంచమంతా ప్రశంసించే విద్యాపట్టం దక్కించుకుంది ఆర్తి. 

కేరళ లోని అలప్పుజ వాసి 20 ఏళ్ళ సొనాబెల్సన్‌ లాక్‌ డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ 500 ఫౌండేషన్‌ కోర్సులను పూర్తిచేసింది. బి.కామ్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న సోనా తన గురువు దీపా జయనందన్‌ సూచనలతో ఈ కోర్సులను పూర్తి చేశానని తెలిపింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన 124 విశ్వవిద్యాలయాల నుంచి 500 ఫౌండేషన్‌ కోర్సులను పూర్తి చేసినందుకు గర్వపడుతున్నట్టు చెప్పింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top