మరిచిపోలేని భావోద్వేగం! | Karen Kshiti Suvarna September 21 shone at Cannes 2026 | Sakshi
Sakshi News home page

మరిచిపోలేని భావోద్వేగం!

May 23 2026 5:53 AM | Updated on May 23 2026 5:53 AM

Karen Kshiti Suvarna September 21 shone at Cannes 2026

కాన్స్‌ చిత్రం/ సెప్టెంబర్‌ 21

అనారోగ్యంతో బాధ పడే వారి సినిమాలు చాలానే వచ్చాయి. కాని  పేషంట్‌ను చూసుకునే కేర్‌గివర్‌ కథతో వచ్చిన సినిమా ‘సెప్టెంబర్‌ 21’. అల్జిమర్స్‌తో బాధపడుతున్న వ్యక్తిని చూసుకునేందుకు వచ్చిన మహిళ భావోద్వేగాలను ఈ సినిమాలో చూపింది దర్శకురాలు కరెన్‌ క్షితి సువర్ణ. ఈ సినిమా తీసి 22 ఏళ్లకే ‘కాన్స్‌ ఫెస్టివల్‌’లో చోటు సంపాదించుకుంది. వివరాలు...

ఇది ఇప్పుడు  ప్రతి ఐదు, పది ఇళ్లలో ఒకటిగా కనిపిస్తున్న దృశ్యమే. ఇంట్లోని పెద్దవాళ్లు మెల్లగా మరిచిపోవడం మొదలుపెడతారు. మొదట వీధులు, తర్వాత జ్ఞాపకాలు, తర్వాత ఇంట్లో సభ్యులను, ఆ తర్వాత తమను తాము మర్చిపోతారు. ‘అల్జిమర్స్‌’ ప్రపంచ వయో వృద్ధులను బాధిస్తున్న వ్యాధి. ఈ వ్యాధిలో పేషెంట్‌ జీవితంలో ఎంత వేదన ఉంటుందో  పేషెంట్‌ను అటెండ్‌ చేసే వారిలోనూ అంత భావోద్వేగం ఉంటుంది. 

నిజం చెప్పాలంటే అల్జిమర్స్‌ బాధితులకు తాము ఏం చేస్తున్నారో తెలియదు. కాని వారి జీవితంలో ఏమి జరగబోతుందో చూస్తున్న అటెండెర్లకే ఎక్కువ బాధ ఉంటుంది. ఆ బాధ, బంధం తెర మీద చూపించాలనుకుంది కరెన్‌ క్షితి సువర్ణ. 22 ఏళ్ల ఈ మంగళూరు అమ్మాయి కన్నడ, హిందీ భాషల్లో తీసిన సినిమాయే ‘సెప్టెంబర్‌ 21’. మే 22న ఇండియాలో విడుదలైన ఈ సినిమా అంతకు కొద్ది రోజుల ముందు ‘కాన్స్‌’ ఫెస్టివల్‌లో ‘ఫిల్మ్‌ మార్కెట్‌’ విభాగంలో ప్రదర్శితమైంది. ప్రశంసలు అందుకుంది. ‘కేర్‌గివర్స్‌’ కథలు కూడా ప్రపంచం వినదగ్గవే అని ‘కాన్స్‌’ ఆ విధంగా సందేశం పంపింది.

కథేంటి?
‘సెప్టెంబర్‌ 21’ ఒక రిటైర్డ్‌ ఉద్యోగి కథ. భార్య చనిపోయాక కొడుకు దగ్గర ఉంటూ స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఉన్న ఈ పెద్దాయనలో మెల్లగా అల్జిమర్స్‌ సూచనలు మొదలవుతాయి. దాంతో కొడుకు ఆయనను చూసుకోవడానికి కమల అనే మహిళను పెడతాడు. అయితే కమలకు ఆ పెద్దాయనను చూసుకోవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే చెప్పా పెట్టకుండా ఎటో వెళ్లిపోతుంటాడు. రిటైర్‌ అయ్యానని మరిచి ఆఫీసుకు రెడీ అవుతుంటాడు. అలా రోజురోజుకీ తన పేరు,  మొహం మర్చిపోతున్న ఆ వ్యక్తిని బతికించడానికి కమల పడే తపన... పేషెంట్‌ ఆరోగ్యం క్షీణిస్తుంటే చూపే ఓపిక, ప్రదర్శించే మానసిక స్థైర్యం... ఒక దశలో పెద్దాయనను ఏదైనా హోమ్‌లో పెట్టడం మంచిదని కొడుకు భావిస్తే ఆ పెద్దాయన చిన్న పిల్లాడిలా ఏడుస్తుంటే కమలకు కలిగే దుఃఖం... ఇవన్నీ ‘సెప్టెంబర్‌ 21’ లో శక్తిమంతంగా చూపింది దర్శకురాలు క్షితి సువర్ణ.

కనెక్ట్‌ అయ్యే కథలు
‘సెప్టెంబర్‌ 21’ ఇండియాలో మే 22న థియేటర్లలోకి వచ్చింది. మే 31న దుబాయ్‌లో ప్రీమియర్‌ ప్లాన్‌ చేశారు. కరెన్‌ ప్రస్తుతం కొత్త స్క్రిప్ట్‌ల మీద పనిచేస్తోంది. ‘కమర్షియల్‌ సినిమాలు కూడా తీస్తా. కానీ ప్రజలకు కనెక్ట్‌ అయ్యే కథలు చెప్పడమే నాకు ముఖ్యం’ అని చెబుతోందామె. ‘మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లతో రోజూ మాట్లాడుతూ ఉండండి... వాళ్లు మిమ్మల్ని మర్చిపోకముందే. ఎందుకంటే మర్చిపోయేలా చేసే బలం అల్జిమర్స్‌కి ఉంది... మర్చిపోని ప్రేమ మాత్రం మనకే సొంతం’ అంటోంది దర్శకురాలు.
 
సొంత అనుభవాల నుంచి
‘ఇది రీల్‌ కాదు... రియల్‌ సినిమా. మా బామ్మ అల్జీమర్స్‌ లాస్ట్‌ స్టేజ్‌లో చనిపోయింది. మా సినిమాకు పని చేసిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తల్లికి అదే వ్యాధి. అందుకే ‘సినిమాటిక్‌ లిబర్టీ’ తీసుకోకుండా రియలిస్టిక్‌గా తీయాలనుకున్నాం’ అంది క్షితి సువర్ణ. ఈ సినిమా కోసం ఆమె నెలల తరబడి రీసెర్చ్‌ చేసింది. ముంబైలోని కేర్‌ సెంటర్లలో వాలంటీర్‌గా పని చేసింది.  పేషెంట్‌గా ముఖ్యపాత్రలో నటించిన ప్రవీణ్‌ సింగ్‌ సిసోడియా అల్జిమర్స్‌ పేషెంట్లతో గడిపి, వాళ్ల కళ్లలోని అయోమయాన్ని, బాడీ లాంగ్వేజ్‌ని నేర్చుకున్నాడు. అందుకే కేన్స్‌లో సినిమా ప్రదర్శన పూర్తయ్యాక రెండు నిమిషాలు హాల్‌లో పిన్‌ డ్రాప్‌ సైలెన్స్.... తర్వాత లేచి నిలబడి చప్పట్లు....  ‘సినిమా చూసిన వాళ్లు ఇది నా కథ అని ఫీల్‌ అవ్వాలి. ఎవరో ఒకరు దీన్ని చెప్పడానికి ముందుకొచ్చారు అనుకోవాలి. అదే నా లక్ష్యం’ అంటోంది కరెన్‌.

Advertisement
 
Advertisement
Advertisement