కన్నా.. ఏడవాలనిపిస్తే ఏడ్చేయ్‌! | Kareena Kapoor says she tells her sons to cry if they want to | Sakshi
Sakshi News home page

కన్నా.. ఏడవాలనిపిస్తే ఏడ్చేయ్‌!

Sep 2 2026 3:37 AM | Updated on Sep 2 2026 3:37 AM

Kareena Kapoor says she tells her sons to cry if they want to

భర్త సైఫ్, పిల్లలతో కరీనా...

‘మగపిల్లలు అసలు ఏడవకూడదు’ అనే పాతకాలపు రొటీన్‌ డైలాగ్‌కు ‘ది ఎండ్‌’ కార్డ్‌ వేయాలంటోంది నటి కరీనా కపూర్‌. ‘అబ్బాయిలు ఏడ్వకూడదని’ చెప్పే మాట వారిని ఎమోషన్స్‌ దాచేసుకునే రోబోల్లా మారుస్తోందని అంటోందామె. ఇద్దరు అబ్బాయిల తల్లిగా ‘నో ఫిల్టర్‌ పేరెంటింగ్‌’ గురించి ఆమె పంచుకుంటున్న అనుభవాలు.

‘అమ్మాయిలు చాలా సున్నితంగా ఉండాలి. మగవాళ్లు కఠినంగా ఉండాలి అనే పాతకాలపు ధోరణి పూర్తిగా వదిలి పెట్టా’ అంటోంది నటి కరీనా కపూర్‌. ఇద్దరు పిల్లల తల్లిగా (తైమూర్, జెహ్‌) ఇటీవల ఆమె పేరెంటింగ్‌ గురించి తన ఆలోచనలు పంచుకుంది. ముఖ్యంగా అబ్బాయిల తల్లిగా.

‘నా ఇద్దరు కొడుకులకు నేను చెప్పింది ఒక్కటే... మీకు ఏడవాలనిపిస్తే మొహమాటం లేకుండా ఏడ్చేయండిరా. కన్నీళ్లు దాచుకోవాల్సిన అవసరం లేదు అని’ అందామె. ఒక మగవాడు తల్లి ముందో, భార్య ముందో కన్నీళ్లు పెట్టడానికి అస్సలు భయపడకూడదనీ, ఆ సున్నితత్వమే వాళ్లను రేపు సమాజంలో బాధ్యతాయుతమైన మనుషులుగా మారుస్తుందనీ కరీనా గట్టిగా నమ్ముతోంది. ‘భావోద్వేగాలను దాచుకోకుండా ఫ్రీగా ఎక్స్‌ప్రెస్‌ చేసే స్వేచ్ఛను మగపిల్లలకు ఇంట్లోనే ఇవ్వకపోతే బయట వారు సున్నితంగా ఎలా వ్యవహరించగలరు?’ అని ప్రశ్నిస్తోందామె.

ర్యాంకులు పక్కన పెట్టు.. కాస్త కరుణ నేర్పు! 
‘ఇవాళ పేరెంటింగ్‌ అంటే తల్లిదండ్రులు పిల్లలకు ఎడతెగకుండా మార్కులు, ర్యాంకులు, సక్సెస్‌ వెనుక పరిగెత్తించే రేస్‌ను గుర్తు చేయడంగా మారింది. ఏమిటి ఈ ధోరణి? నా భర్త సైఫ్‌ అలీఖాన్‌తో నేను ఒకే మాట చెప్తాను... మన పిల్లలు లైఫ్‌లో ఎంత పెద్ద సక్సెస్‌ అయ్యారన్నది కాదు, వాళ్లు తోటిమనుషుల పట్ల ఎంత దయ, కరుణ కలిగి ఉన్నారన్నదే ముఖ్యం. అది చూడాలి మనం’ అని తెలిపిందామె. అందుకే ఆమె తన ఇంట్లో పని చేసే నానీలను, హెల్పర్లను పిల్లలతో సమానంగా డైనింగ్‌ టేబుల్‌ మీద కూర్చోబెట్టి భోజనం పెట్టడం ఆనవాయితీగా చేసింది. కళ్లెదుట సాటి మనుషులను గౌరవించడం చూస్తూ పెరిగే పిల్లలు రేపు పెద్దయ్యాక సమాజంలో ఎవరినీ తక్కువ చేసి చూడరనేది కరీనాప్రాక్టికల్‌ పేరెంటింగ్‌.

అమ్మ ఆఫీస్‌కు వెళ్తుంది
‘అమ్మ ఇంట్లో ఉంటుంది... నాన్న ఆఫీసుకు వెళతాడు అని పిల్లలకు చిన్నప్పటి నుంచి నూరిపోయడం మానేయాలి. నా ఇద్దరు కొడుకులు చిన్నప్పటి నుంచి వాళ్ల నాన్నతో పాటు అమ్మ కూడా ప్రతిరోజూ షూటింగ్‌లకు, ఆఫీసులకు పరుగెట్డడం చూస్తూ పెరిగారు’ అంది కరీనా. ‘ఒకరోజు నా కొడుకు ఆరోగ్యం బాగలేదు. నేను షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. తను ఏడ్చాడు. కాని నేను వాడికి వర్క్‌ ఇంపార్టెన్  ్స ఏంటో  అర్థమయ్యేలా చెప్పి మరీ షూటింగ్‌కు వెళ్లాను. అమ్మ కూడా బిజీగా ఉంటుంది, అమ్మకు కూడా సొంత కెరీర్‌ ఉంటుంది అని కొడుకులు చిన్నప్పటి నుంచే చూడటం వల్ల రేపు వాళ్లు పెద్దయ్యాక మహిళల శ్రమను, వారి సమానత్వాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తారు’ అని చె΄్తోంది కరీనా.

అబ్బాయిల పెంపకమైనా అమ్మాయిల పెంపకమైనా నేడు సవాలుగా మారింది. కెరీర్‌ అవసరమే గానీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం గురించి ఎన్నో విధాలుగా తల్లిదండ్రులు ఆలోచించాల్సిందే. అబ్బాయిలు పైచేయిగా ఉండే సమాజమే ఇప్పటికీ ఉనికిలో ఉంది కాబట్టి వారి పెంపకం పట్ల మరింత ఎరుకతో ఉండాల్సిన అవసరం ఉందని తెలియచేయడమే కరీనా పెంపకం సారాంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement