
అనగనగా ఓ ఊరిలో రామయ్య అనే యువరైతు ఉండేవాడు. అతనికి ఆత్మానందం అంటే ఏమిటో తెలుసుకోవాలని, దాన్ని పొందాలని ఆశగా ఉండేది. తన ఊరికి ఎవరైనా స్వామీజీలు వస్తే ఆ విషయం అడిగేవాడు. అయితే ఎవరూ అతనికి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అతని సందేహం తీరలేదు.
ఒకసారి ఊరికి యోగీంద్రుడు అనే యువ సన్యాసి వచ్చాడు. అంత చిన్నవయసులో సన్యాసం తీసుకున్న అతణ్ని ఊరంతా గౌరవించి, ఆతిథ్యం ఇచ్చింది. రామయ్య ఆయన్ని కలిసి ఆత్మానందం అంటే ఏమిటని, అది పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. దానికి యోగీంద్రుడు ‘తప్పకుండా వివరిస్తాను. అయితే నేను ప్రస్తుతం కాశీకి ప్రయాణమవుతున్నాను. నా వెంట వస్తే మార్గమధ్యంలో వివరిస్తాను’ అన్నాడు. రామయ్య మొహమాటపడుతూ ‘అయ్యా! కాశీకి వెళ్తే తిరిగిరారని పెద్దలు అంటారు. నేనింకా బ్రహ్మచారిని. పెళ్లి చేసుకున్న తర్వాత తప్పకుండా మీ వెంట వస్తాను’ అన్నాడు. సరేనని ఆత్మానందుడు కాశీకి వెళ్లాడు.
ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత యోగీంద్రుడు మరోసారి ఆ ఊరికి వచ్చాడు. అప్పటికి రామయ్యకు పెళ్లయ్యింది. ఈసారి కూడా రామయ్య ఆయన్ని కలిసి మరోసారి తన మనసులో సందేహాన్ని బయటపెట్టాడు. ‘రామయ్యా! రేపు నేను ప్రయాగ వెళ్తున్నాను. ఈసారి నువ్వు నా వెంటరా. దారిలో నీకు ఆత్మానందం (Atmanandam) అంటే ఏమిటో చెబుతాను’ అన్నాడు. దానికి రామయ్య ‘అయ్యా! నా భార్య ప్రస్తుతం కడుపుతో ఉంది. ఈ సమయంలో తనను వదిలేసి రాలేను. ఈసారి తప్పక వస్తాను’ అన్నాడు. సరేనన్నాడు యోగీంద్రుడు.
మరికొన్నేళ్ల తర్వాత యోగీంద్రుడు మరోసారి ఊరికి వచ్చాడు. ఈసారి రామయ్య మరోసారి ఆయన్ని కలిశాడు. తాను రామేశ్వరం వెళ్తున్నానని, ఈసారైనా తన వెంట రమ్మని పిలిచాడు యోగీంద్రుడు. ‘స్వామీ! ఆడపిల్ల పెళ్లికి ఎదుగుతోంది. కొడుకులు చేతికొచ్చారు. ఈ సమయంలో నేను వారికి అండగా ఉండాలి. ఈసారి కూడా వదిలేయండి. వచ్చేసారి తప్పకుండా వస్తాను’ అన్నాడు. సరేనని యోగీంద్రుడు తలాడించాడు.
ఆ తర్వాత చాలా ఏళ్లకు యోగీంద్రుడు ఆ ఊరికి వచ్చాడు. అప్పటికి యోగీంద్రుడు వృద్ధుడయ్యాడు. రామయ్యకు సైతం వృద్ధాప్యం మీదపడింది. కానీ మనసులో ‘ఆత్మానందం’ గురించిన సందేహం మాత్రం పోలేదు. యోగీంద్రుణ్ని కలిసి కుశలం అడిగాడు. అన్నీ వివరించాక ‘ఈసారి తీర్థయాత్రలకు వెళ్తున్నాను రామయ్యా! మళ్లీ తిరిగి వస్తానన్న నమ్మకం లేదు. కాబట్టి ఈసారైనా నా వెంట వస్తే ఆత్మానందం అంటే ఏమిటో చెబుతాను’ అన్నాడు ఆత్మానందుడు. దానికి రామయ్య ‘అయ్యా! నా పెద్ద కొడుక్కి మొన్నే రెండో కొడుకు పుట్టాడు. చిన్నకొడుక్కి పాప పుట్టి నెలైంది. వారి ముద్దూముచ్చట చూడకుండా నేను మీ వెంట తీర్థయాత్రలకు వస్తే ఎలా? క్షమించండి’ అన్నాడు.
చదవండి: ఏం చేశావ్ పెద్దాయనా.. నీకు సెల్యూట్!
దానికి యోగీంద్రుడు నవ్వి ‘రామయ్యా! ఆత్మానందం అంటే ఏమిటని ఇన్నేళ్ల నుంచి సందేహపడుతున్నావు కానీ, ఇదే ఆత్మానందం అని తెలుసుకోలేకపోతున్నావు. ఎవరి పని వారు సక్రమంగా చేసి, అందులో తృప్తి పొందడమే ఆత్మానందం. పెళ్లి చేసుకొని, భార్యను పోషించి, బిడ్డల్ని సరైన రీతిలో పెంచి, వారికి బతుకుదెరువు చూపించి, చివరకు వారి పిల్లల ముద్దుముచ్చట్లు కూడా చూస్తున్నావు. ఇన్నేళ్లపాటు నువ్వు పొందిందంతా ఆత్మానందమే’ అని వివరించాడు. ఆత్మానందం అంటే తన సంతోషమే, సంతృప్తి అని గ్రహించి సంతోషపడ్డాడు రామయ్య.