ఆ ఊళ్లో అందరూ ‘లచ్చుమమ్మను చూసి నేర్చుకోవాలె’ అంటుంటారు

Inspirational story of 70 years old Lachumamma - Sakshi

‘ఏ వయసులో అయినా సరే ఎవ్వరిపైనా ఆధారపడకూడదు’ అని టైలరింగ్‌ చేస్తూ తన రెక్కల కష్టం మీదే బతుకుతోంది 70 ఏళ్ల లచ్చుమమ్మ. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలంధర్మారావు పేట గ్రామంలో ఉండే లచ్చుమమ్మ ఐదు దశాబ్దాలుగా పాత కాలం నాటి రవికల నుంచి నేటి మోడ్రన్‌ డ్రెస్సుల వరకు  తన కుట్టుపనితనంతో మెప్పిస్తోంది.

ఆ ఊళ్లో అందరూ ‘లచ్చుమమ్మను చూసి నేర్చుకోవాలె’ అని అంటుంటారు. ఏడు పదుల వయసులో కూడా లచ్చుమమ్మ ఆధునిక డిజైన్లలో బ్లౌజులు, డ్రెస్సులు కుట్టడం చూసి కాలానికి తగినట్టు పని తనాన్ని మెరుగుపరుచుకుంటుంది అని కూడా అంటుంటారు. యాబై ఏళ్లుగా అలుపెరగకుండా బట్టలు కుడుతూ జీవనం సాగిస్తున్న లచ్చుమమ్మ అసలు పేరు గజవాడి లక్ష్మి. ధర్మారావుపేట గ్రామంలో అందరూ లచ్చుమమ్మ అని పిలుస్తారు.

లచ్చుమమ్మకు 14వ ఏట ధర్మరావుపేటకు చెందిన బాలవీరయ్యతో వివాహం జరిగింది. వాళ్లకు ఐదుగురు కూతుళ్లు. ఉన్న ఊళ్లో ఉన్నంతలో చదివించారు. వాళ్లను పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసి, అత్తవారిళ్లకు పంపించారు. వాళ్లకు పిల్లలు. లచ్చుమమ్మకు పన్నెండు మంది మనుమలు, మనుమరాళ్లు. వాళ్లు కూడా పెద్దోళ్లయ్యారు. నాటి విషయాల గురించి ప్రస్తావిస్తూ ‘ఐదుగురు ఆడపిల్లల్ని పెంచి, పెళ్లిళ్లు చేయడం అంటే సవాలే..’ అంటూ తమ కష్టాన్ని వివరిస్తుంది.

లచ్చుమమ్మ భర్త బాలవీరయ్య చిన్న చిన్న వ్యాపారాలు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. భర్త కష్టానికి చేదోడుగా ఉంటుందని యాబై ఏళ్ల కిందటే లచ్చుమమ్మ సొంతంగా బట్టలు కుట్టడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ ఊళ్లోకి ఇంకా టైలరింగ్‌ మిషన్లు రాలేదు. దాంతో బట్టలు కత్తిరించి సూదీదారంతోనే కుట్టేది. గ్రామంలో నాటి తరం మహిళలు ధరించే రవికలను బాగా కుడుతుందనే పేరు లచ్చుమమ్మకి. ఆడపిల్లలకు గౌన్లు, లంగా, జాకెట్లు కుట్టడమూ సొంతంగానే నేర్చుకుంది. అందరి ఇళ్లల్లోనూ ఆమె కుట్టిన బట్టలు ఉంటాయి. 

ఆధునిక డిజైన్లు సైతం
లచ్చుమమ్మ చేతికుట్టు బాగుంటుందని చాలా మంది ఆమె దగ్గరే కుట్టించుకునేవారు. నిన్న మొన్నటి వాళ్లే కాదు, ఈ తరం అమ్మాయిలు కూడా లచ్చుమమ్మ దగ్గరకు వచ్చి బ్లౌజులు కుట్టించుకుంటారు. మొదట్లో సాదా రవిక కుట్టడానికి 30 పైసలు, గుండీల రవిక కుట్టడానికి 50 పైసలు తీసుకునేదట. ఇప్పుడు సాధారణ బ్లౌజ్‌కు రూ. 65, లైనింగ్‌ బ్లౌజ్‌కు రూ.130 తీసుకుంటుంది. ‘అప్పట్లో రోజుకు పది నుంచి ఇరవై దాకా బ్లౌజులు, గౌన్లు కుట్టేదాన్ని.

పండుగల సీజన్లో అయితే రాత్రి, పగలు తేడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా రోజూ రెండు మూడు బ్లౌజులు కుడతా’ అని చెబుతోంది లచ్చుమమ్మ. పదేళ్ల క్రితం భర్త వీరయ్య చనిపోయాడు. ఇప్పుడు లచ్చుమమ్మ ఒక్కత్తే ఉంటుంది. తన పోషణార్థం కుట్టుపనినే నమ్ముకుంది. ఏళ్లుగా ఆమె దగ్గర రవికలు కుట్టించుకున్న నాటి తరం వాళ్లంతా ఇప్పటికీ లచ్చుమమ్మ దగ్గరికే వస్తుంటారు. వయసు మీద పడి, నెమ్మదిగా కుట్టినా చెప్పిన మాట ప్రకారం కుట్టి ఇస్తుందని నమ్మకం ఎక్కువ. ఏ సమయంలో ఆమె ఇంటికి వెళ్లినా.. కూర్చుని బట్టలు కత్తిరించడమో, లేదంటే మిషన్‌ మీద కుట్టడమో చేస్తూ కనిపిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు.

యాబై ఏళ్లుగా కుడుతున్నా..
పద్నాలుగేళ్ల వయసులో పెళ్లయ్యి ఈ ఇంటికి వచ్చా. ఇద్దరు కూతుళ్లు పుట్టిన తరువాత కుటుంబ అవసరాల కోసం ఏదైనా పని చేయాలనుకున్నా. మా అమ్మ మాకు చిన్నప్పుడు చేతితోనే బట్టలు కుట్టేది. ఇంటి అవసరాలు పెరిగిన ప్పుడు నేను కూడా బట్టలు కుట్టాలని, చేతికుట్టుతో రవికలు కుట్టడం మొదలుపెట్టాను.

ఒక్కొక్కరుగా రావడం మొదలై ఊళ్లో ఉన్న ఆడవాళ్లందరూ రవికలు కుట్టించుకునేవారు. ముప్పయి ఏళ్ల పాటు చేతికుట్టుతోనే కుట్టేదాన్ని. కుట్టు మిషన్లు వచ్చిన తరువాత ఓ మిషన్‌ తీసుకున్నా. కొన్ని రోజుల్లోనే మిషన్‌ కుట్టు నేర్చుకొని, సొంతంగానే కుట్టడం మొదలుపెట్టిన. పిల్లలు వద్దంటరు కానీ, చేతనైనన్ని రోజులు పనిచేసుకొని బతకాలి, ఎవరి మీదా ఆధారపడవద్దని ఈ పని వదలడం లేదు. – గజవాడ లక్ష్మి

– ఎస్‌.వేణుగోపాల్‌ చారి,  సాక్షి, కామారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top