
సల్మాబేగంను 20 యేళ్ల క్రితం వదిలి వెళ్లిన కుమారుడు
మంగళవారం మృతిచెందిన సల్మాబేగం.. అంత్యక్రియలు చేయడానికి వచ్చిన కుమారుడు
ఒప్పుకోని స్థానికులు
దత్తత కుమార్తె కరిష్మా బేగం చేయాలని నిర్ణయించిన గ్రామస్తులు
కామారెడ్డి రూరల్: తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కుమారుడు 20 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కుమారుడు వెళ్లిపోయాడని ఆ తల్లి కుంగిపోలేదు. కామారెడ్డిలో దొరికిన ఒక అమ్మాయిని పెంచుకుని పెళ్లి చేసి పంపించింది. మంగళవారం ఆ తల్లి మృతి చెందగా చెందగా ‘తానే కొడుకునని అంత్యక్రియలు నేనే చేస్తాను. మా ఊరికి తీసుకెళ్తాను’ అని వచ్చిన కొడుకును నువ్వెవరో తెలియదు అని వెల్లగొట్టారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాజంపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..
గ్రామానికి చెందిన సల్మాబేగంను 20 సంవత్సరాల క్రితం కుమారుడు వదిలి వెళ్లిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు తనను వదిలి వెళ్లిపోవడంతో కొద్దిరోజులు బాధపడింది. తన రాత ఇంతే అనుకుని జీవిస్తుండగా కొద్దిరోజులకు కామారెడ్డి పట్టణంలో దొరికిన కరిష్మా బేగం అనే చిన్నారిని పెంచుకుంది. పెద్దయ్యాక సల్మాబేగం.. కరిష్మాకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంది. పెళ్లయినా పెంచిన తల్లి మంచి చెడులన్నీ కరిష్మానే చూసుకుంది. గ్రామంలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే మంగళవారం సల్మాబేగం మృతి చెందింది.
20 ఏళ్లుగా అటువైపు రాని కొడుకు తల్లి చనిపోయిన విషయం తెలుసుకొని, అంత్యక్రియలు చేస్తానని తల్లి శవాన్ని తీసుకొని వెళ్లేందుకు గ్రామానికి వచ్చాడు. దాంతో కొడుకుతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. 20 ఏళ్ల తర్వాత తల్లి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ నిలదీశారు. అయితే ఇన్నేళ్ల పాటు సల్మాబేగం మంచి చెడులు చూసిన కరిష్మాయే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. ఇన్నాళ్లుగా లేని ప్రేమ తల్లి చనిపోయాక రావడంతో ఆస్తి కోసమే వచ్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి.