
వేసవి కాలంలో పిల్లలు ఏం చేయాలి, పెద్దలు ఏం చేయాలనే విషయం గురించి మూడు నాలుగు వారాలుగా తెలుసుకుంటున్నాం. అయితే ఈ కాలంలో వచ్చే మార్పులు తాత్కాలికమా? దీర్ఘకాలికమా? వేసవి మనసులో కేవలం తాత్కాలిక మార్పులు కాకుండా, దీర్ఘకాలం ప్రభావితం చేసే సైకోబయలాజికల్ ప్రాసెస్‌లు కూడా జరుగుతాయని సీజనల్ సైకాలజీ, న్యూరో సైన్సు పరిశోధనలు చెబుతున్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
దీర్ఘకాలిక ఆత్మవిశ్వాసం
వేసవి వేడితో పెరిగిన సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరోకెమికల్స్ తాత్కాలికంగా మూడ్‌ను పెంచుతాయని, శక్తిని పెంచుతాయని ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’పై రోసెంథల్ (1984) చేసిన పరిశోధనను వెల్లడించింది. వేసవిలో ప్రారంభించిన ధ్యానం వంటివి మనల్ని మనం నియంత్రించుకునేందుకు రిజర్వ్‌లా పనిచేస్తాయని జపాన్‌లోని కియో యూనివర్సిటీలో జరిగిన దీర్ఘకాలిక అధ్యయనం కూడా తెలిపింది.
ఉదాహరణకు నా దగ్గరకు కౌన్సెలింగ్ కోసం వచ్చిన కిరణ్ అనే ఐటీ ఉద్యోగి వేసవిలో ప్రారంభించిన ప్రాణాయామం, ఆపై ఏడాది పాటు కొనసాగించటం వలన అతని ఆందోళన స్థాయి, ఒత్తిడి 45శాతం తగ్గినట్లు తన జర్నలింగ్‌లో రికార్డ్ చేసుకున్నాడు. వేసవిలో వచ్చే మూడ్ బూస్ట్‌ను అలవాటుగా మార్చుకుంటే దీర్ఘకాల ఆత్మవిశ్వాసం సిద్ధమవుతుంది.
అలవాటుగా మార్చుకోవాలి
వేసవిలో ఏర్పడిన కొత్త అలవాట్లు మెదడులో బలంగా ‘లాక్’ అవుతాయని స్మిత్, క్లీన్ 2017లో చేసిన అధ్యయనంలో తెలిపారు. ఇది కాగ్నిటివ్ సైకాలజీలోని హెబియన్ లెర్నింగ్‌తో కలిసి కాలంతో పాటు గాఢమవుతుంది. ఉదాహరణకు గత వేసవిలో నేను నిర్వహించిన వర్క్‌షాప్‌లో పొమోడోరో స్టడీ మెథడ్ గురించి చెప్పాను. సునీల్ అనే విద్యార్థి ఆ అలవాటును వేసవి తర్వాత కూడా కొనసాగించాడు. దీంతో ఈ ఏడాది అతని ఏకాగ్రత, మార్కులు గణనీయంగా మెరుగయ్యాయి. ఒక సీజనల్ అలవాటును 21 రోజుల నుంచి 90 రోజుల వరకు కొనసాగిస్తే అది దీర్ఘకాలిక అలవాటుగా మారుతుంది.
బలపడే బంధాలు
వేసవిలో పెళ్లిళ్లు, కుటుంబ కలయికలు ఎక్కువగా జరుగుతాయి. ఇవి ఎమోషనల్ యాంకర్స్‌గా పనిచేస్తాయి. వేసవిలో ఏర్పడే ఈ సోషల్ బాండ్స్ ఆ తర్వాత ఆరునెలల పాటు ఒంటరితనాన్ని 30శాతం వరకు తగ్గిస్తాయని బార్బీ, గ్రాఫ్‌మన్ 2010లో జరిపిన అధ్యయనంలో వెల్లడించారు. ఉదాహరణకు నా క్లయింట్ రామకృష్ణ గత వేసవిలో తన బాల్యమిత్రుడిని కలిశాడు. ఆ తర్వాత తరచు అతనితో మాట్లాడుతూ తమ మధ్యనున్న బంధాన్ని బలంగా నిర్మించుకున్నాడు. ఫలితంగా అతని ఉద్యోగానికి సంబంధించిన ఒత్తిడిని నియంత్రించుకోగలిగాడు.
పెరిగే సృజనాత్మకత
వేసవిలో సృజనాత్మకత తారస్థాయిలో ఉంటుందని కాఫ్‌మన్ 2016లో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ కాలంలో కాగ్నిటివ్ ఫ్లెగ్జిబిలిటీ ఎక్కువగా ఉంటుందని చూపించారు. దీన్ని హార్వర్డ్ క్రియేటివ్ లాబ్ 2021లో తిరిగి నిర్ధారించింది. ఉదాహరణకు సుశీల్ వేసవిలో ఆర్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. ఆ తరువాత అదే ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్ట్‌లో ప్రదర్శించటానికి అవకాశం దొరికింది.
భావోద్వేగ ప్రజ్ఞను బలోపేతం చేసుకోండి
వేసవిలో ప్రారంభించిన జర్నలింగ్ సీజన్‌తో పాటు మారే భావోద్వేగాలను గమనించడానికి అద్భుతమైన సాధనమని కాబట్–జిన్ 2003లో జరిపిన మైండ్‌ఫుల్‌నెస్ అధ్యయనంలో వెల్లడైంది. బండూరా సోషల్ కాగ్నిటివ్ థియరీ ప్రకారం కూడా భావోద్వేగాల నియంత్రణలో ఇంట్రాస్పెక్షన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు గత వేసవిలో ఎమోషనల్ డైరీ ప్రారంభించిన అనిత ఆందోళన తగ్గడంతోపాటు ఆత్మవిశ్వాసం పెరిగింది.
వేసవి తర్వాత పాటించవలసిన టిప్స్...
వేసవిలో మొదలైన ధ్యానం, జర్నలింగ్‌ను ఒక అలవాటుగా మార్చుకోండి.
ప్రతినెల ఒక రోజు ఇంట్రాస్పెక్షన్‌కు కేటాయించండి.
మా బంధాలను కొనసాగించడానికి ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక మెసేజ్ పంపించండి.
వేసవిలోని నిద్ర అలవాటును ఏడాది పొడవునా కొనసాగించండి.
ప్రతి మూడు నెలలకు ఒక కొత్త పుస్తకం చదవండి.
మీ భావోద్వేగాలను ఎలా తట్టుకున్నారనే విషయం జాగ్రత్తగా డాక్యుమెంట్ చేయండి.
ప్రతీ సీజన్‌లో 30 రోజులు డిజిటల్ డిటాక్స్ చాలెంజ్ చేపట్టండి.
ఒక కొత్త స్కిల్‌ను మీ చదువులో భాగం చేసి, మాస్టర్ చేయండి. క్రియేటివ్ ప్రాజెక్ట్స్‌కు డెడ్‌లైన్స్, గోల్స్ పెట్టుకోండి.
సీజనల్ రిఫ్లెక్షన్ రిపోర్ట్ రాయడం ద్వారా మీ ఇంట్రాస్పెక్షన్‌ను శక్తిమంతం చేయండి.
సైకాలజిస్ట్ విశేష్
www.psyvisesh.com
(చదవండి: Summer Holidays: ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్: ఎందుకు రాయాలో తెలుసా..?)