హైబీపీ నియంత్రణకి.. హెల్తీ లైఫ్‌స్టైల్‌ ‘కీ’..

How To Prevent High Blood Pressure - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే కష్టనష్టాలు ఎదుర్కుంటున్నాం. మళ్లీ ఆర్ధిక సమస్యలు చుట్టుముడతాయా? నష్టాలు, ఆదాయాల్లేని ఖర్చులు కొనసాగుతాయా? ఆరోగ్యం ఏమవుతుంది? రకరకాల పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి ఆలోచనలు నగరవాసుల్లో రక్తపోటు సమస్యను తీవ్రతరం చేస్తున్నట్టు ఆసుపత్రుల్లో నమోదవుతున్న హైబీపీ కేసులు వెల్లడిస్తున్నాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వంటివి తెచ్చిపెడుతున్న అధిక బరువు సమస్య తద్వారా హైబీపీ పేషెంట్స్‌ పెరుగుతున్నారని వైద్యులు అంటున్నారు.

ఈ నేపధ్యంలో అపోలో స్పెక్ట్రా కన్సల్టెంట్‌ యూరాలజిస్ట్, అండ్రాలజిస్ట్‌ డా.ప్రియాంక్‌ సలేచా రక్తపోటు సమస్య దాని నివారణ గురించి సూచనలు అందిస్తున్నారు. పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న నగర జీవనశైలి అధిక రక్తపోటుకు కూడా కారణంగా మారుతోంది. ఎడాపెడా మారుతున్న ఆహార విహారాలు, పనివేళలు, అలవాట్లు, రక్తపోటు సమస్యకు ప్రధాన కారణాలు. 

నిద్రలేమి... వ్యసనాల హాని...
ధూమపానం, ఆల్కహాల్, కెఫైన్‌ సేవనం వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని దూరం చేస్తాయనేది తెలిసిందే. మరీ ముఖ్యంగా అప్పటికే హై బీపీ ఉన్న వారికి ఇవి మరింత ప్రమాదకరం. ధూమపానం వల్ల హృదయ సంబంధ వ్యాధులకు దారి తీస్తుంది అదే స్మోకింగ్‌కి కెఫైన్‌ వినియోగం జత కలిస్తే రక్తపోటు సమస్య వస్తుంది.. అలాగే ఆరోగ్యాన్ని హరించే అనేక కారణాల్లో శరీరానికి అవసరమైన నిద్ర లేకపోవడం ఒకటి. ప్రతి ఒక్కరికీ రోజూ 6గంటల గాఢ నిద్ర తప్పనిసరి. లేని పక్షంలో అది మొత్తంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తరచుగా తక్కువ నిద్రతో సరిపెట్టే పెద్దల్లో మాత్రమే కాదు చిన్నారుల్లో కూడా హై బీపీ సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. నిర్ణీత వేళల్లో నిద్రపోవడం ద్వారా హైబీపీని చాలా వరకూ నియంత్రించవచ్చు. 

హై బీపీ..వ్యాధులకు ఎంట్రీ..
సాధారణంగా అధిక రక్తపోటుతో అనుసంధానంగా వచ్చే సమస్య హృద్రోగం. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే చాలా తక్కువ మందికి తెలిసిన వాస్తవం ఏమిటంటే... కిడ్నీ సమస్యలకు సైతం ప్రధాన కారణాలలో ఒకటి రక్తపోటు. దీని వల్ల కిడ్నీలు పూర్తిగా పనిచేయని పరిస్థితి దాకా రావచ్చు. కిడ్నీతో పాటు దయాబెటిస్‌కి, బ్రెయిన్, కళ్లు పై కూడా హైబీపీ దుష్ప్రభావం చూపిస్తుంది. 

నియంత్రణ ఇలా..

  • కిడ్నీలతో పాటు శరీరంపై ఎటువంటి దీర్ఘకాల ప్రభావాలూ లేకుండా ఉండాలంటే రక్తపోటు స్థాయిల్ని ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి. 
  • అధిక రక్తపోటుకు చికిత్స, నివారించే దిశగా కొద్ది కొద్దిగా బరువు కోల్పోవడం ఉపకరిస్తుంది. తక్కువ కార్బెహైడ్రేట్స్, అధికంగా ఫైబర్‌ ఉన్న రోజువారీ ఆహారం, అలాగే క్రమబద్ధమైన వ్యాయామం... వంటివి ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడంలో కీలకపాత్ర పోషించి హై బిపీ రిస్క్‌ తగ్గిస్తాయి. 
  • నిద్రవేళలు సవరించుకోవడం వంటి జీవనశైలి మార్పులతో పాటుగా ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన రీతిలో రక్తపోటు సమస్యను తగ్గింవవచ్చు. 
  • ఆహారంలో ఉప్పవాడకం తగ్గించాలి. లో సోడియం డైట్‌ను ఎంచుకోవాలి. పండ్లు, కూరగాయలు... వంటివి బాగా వినియోగించాలి. తక్కువ పరిమాణాల్లో ఎక్కువ మార్లు ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
  • కనీసం 30 నిమిషాల పాటు రోజూ వ్యాయామం చేయాలి. ఇది మన మెటబాలిజమ్‌ని క్రమబద్ధీకరిస్తుంది. బరువు పెరగడాన్ని తద్వారా హైబీపీ ప్రమాదాన్ని నివారిస్తుంది. 

చదవండి:

ఒబెసిటీ.. అధిక బరువే కాదు అంతకు మించి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top