వామ్మో..! మనిషిపై మశక సైన్యం!! | Health Tips To Be Careful From Dangerous Mosquitoes | Sakshi
Sakshi News home page

వామ్మో..! మనిషిపై మశక సైన్యం!!

Published Sun, Aug 18 2024 1:25 AM | Last Updated on Sun, Aug 18 2024 1:25 AM

Health Tips To Be Careful From Dangerous Mosquitoes

దోమలు ఎంత ప్రమాదకరమైనవో అర్థమవడానికి  ఈ లెక్క చాలు

దోమజాతులు : 3,600

దోమకాటు మరణాలు : ఏటా 10 లక్షలు

దోమకాటు వ్యాధి బాధితులు : ఏటా 9.6 కోట్లు

మలేరియా మరణాలు : ఏటా 4 లక్షలు

డెంగీ మరణాలు : ఏటా 40 వేలు

దోమలు చూడటానికి చిన్నగా ఉంటాయి గాని, ఇవి అత్యంత ప్రమాదకరమైన జీవులు. ప్రపంచంలో ఏటా పాముకాటుతో మరణిస్తున్న వారి కంటే దోమకాటుతో మరణిస్తున్న వారే ఎక్కువ. పాముకాటు వల్ల ఏటా దాదాపు 1.37 లక్షల మంది మరణిస్తుంటే, దోమకాటు వల్ల వ్యాధులకు లోనై మరణించే వారి సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంటోంది. దోమలు ఎంత ప్రమాదకరమైనవో అర్థమవడానికి  ఈ లెక్క చాలు. ఈ భూమ్మీద 3,600 జాతులకు పైగా దోమలు ఉన్నాయి. అత్యంత శీతల ప్రాంతమైన అంటార్కిటికాలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ దోమల బెడద ఉండనే ఉంది. దోమలు మనుషుల కంటే చాలా ముందు నుంచే భూమ్మీద మనుగడ సాగిస్తున్నాయి. ఇవి దాదాపు డైనోసార్ల కాలం నుంచే అంటే, 25.1 కోట్ల సంవత్సరాల నుంచి భూమ్మీద ఉన్నాయి.

భూమ్మీద మిగిలిన ప్రదేశాలతో పోల్చుకుంటే, ఉష్ణమండల ప్రదేశాల్లో, నీరు ఎక్కువగా నిల్వ ఉండే చోట దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అసలు నీరులేని చోట, నీరు ప్రవహించే చోట దోమలు మనుగడ సాగించలేవు. నిల్వ నీరు ఉన్న ప్రదేశాలే దోమలకు సురక్షిత స్థావరాలు. మన దేశంలో ఎక్కువ రాష్ట్రాలు ఉష్ణమండల ప్రదేశాలే! ఇక్కడి వాతావరణం దోమల విజృంభణకు చాలా అనుకూలంగా ఉంటుంది. దోమలు భూమ్మీద కోట్లాది ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నా, దోమల సగటు ఆయుఃప్రమాణం మాత్రం తక్కువే! ఒక దోమ బతికేది 10 నుంచి 56 రోజుల లోపే! ఇంత అల్పాయుర్దాయంలోనే దోమలు సృష్టించాల్సిన విధ్వంసమంతా సృష్టిస్తాయి.

దోమల్లో ఆడదోమలు మాత్రమే మనుషుల రక్తాన్ని పీలుస్తాయి. ఒక ఆడ దోమ రోజు విడిచి రోజు 150–200 వరకు గుడ్లు పెడుతుంది. దోమ గుడ్లు పెట్టడానికి 50 మిల్లీలీటర్ల నిల్వనీరు చాలు. దారి పక్కన పడి ఉండే చిన్న చిన్న కొబ్బరిచిప్పలు, పాత టైర్లు, వాడటం మానేసి మూలపడేసిన ఎయిర్‌ కూలర్లు వంటివి దోమలకు ప్రశస్థమైన ఆవాసాలు. ఇలాంటి చోట్ల దోమలు గుడ్లు పెట్టి, వంశాభివృద్ధి చేసుకుంటాయి. దోమలను నిర్మూలించడానికి మనం ఎన్ని రకాల మందులను వాడుతున్నా, దోమలు వాటిని తట్టుకునేలా తమ నిరోధకతను నిరంతరం పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. దోమలు మందులను తట్టుకునే శక్తి పెంచుకునే కొద్ది వాటి వల్ల మనుషులకు ముప్పు మరింతగా పెరుగుతుంది. ఆడదోమలు మనుషుల రక్తాన్ని పీల్చే క్రమంలో వాటి నుంచి ప్రమాదకరమైన సూక్ష్మజీవులు మనుషుల రక్తంలోకి చేరి, వ్యాధులను కలిగిస్తాయి.

దోమలు కలిగించే వ్యాధులు..
దోమల వల్ల మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, లింఫాటిక్‌ ఫైలేరియాసిస్, రిఫ్ట్‌వ్యాలీ ఫీవర్, యెల్లో ఫీవర్, జికా, జపానీస్‌ ఎన్‌సెఫలిటిస్, వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌ వ్యాధులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్లను కలిగించే వ్యాధుల్లో 17 శాతం వ్యాధులు దోమల వల్లనే వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 9.6 కోట్ల మంది దోమకాటు వ్యాధులకు లోనవుతున్నారు. వారిలో అత్యధికంగా దాదాపు 4 లక్షల మంది మలేరియా వల్ల, 40 వేల మంది డెంగీ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి వల్ల మరణాల బారిన పడిన వారిలో ఐదేళ్ల లోపు చిన్నారులే ఎక్కువగా ఉంటుండటం విచారకరం. దోమల కారణంగా తలెత్తే తీవ్ర వ్యాధులు, వాటి లక్షణాలను తెలుసుకుందాం.

మలేరియా..
ఈ వ్యాధి అనాఫలిస్‌ దోమ వల్ల వ్యాపిస్తుంది. ఈ దోమ రాత్రివేళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మజీవి కారణంగా మలేరియా వస్తుంది. వీటిలో ఒకరకం జాతికి చెందిన సూక్ష్మజీవి కారణంగా సెరిబ్రల్‌ మలేరియా వస్తుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం, అపస్మారక స్థితికి చేరడం, మూత్రపిండాలు విఫలం కావడం వంటి లక్షణాలు ఉంటాయి.

చికెన్‌ గున్యా..
ఎడిస్‌ ఈజిపై్ట అనే దోమ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ దోమ ద్వారా వ్యాపించే ఒకరకం వైరస్‌ కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఎడిస్‌ ఈజిపై్ట దోమ ఎక్కువగా పగటివేళ కనిపిస్తుంది. చికున్‌ గున్యా సోకిన వారికి జ్వరం, విపరీతమైన తలనొప్పి, తీవ్రమైన కీళ్లనొప్పులు వస్తాయి.

డెంగీ..
డెంగీకి కూడా ఎడిస్‌ ఈజిపై్ట దోమలే కారణం. జ్వరం, తలనొప్పితో పాటు ఎముకలు విరిచేసినంతగా తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్‌ బోన్‌ ఫీవర్‌’ అని కూడా అంటారు. వ్యాధి ముదిరినప్పుడు అంతర్గత అవయవాల్లో రక్తస్రావమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

డెంగీని నిరోధించే వొబాకియా..
వొబాకియా అనే బ్యాక్టీరియా డెంగీ వ్యాప్తిని అరికట్టగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మలేసియా, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లోని పరిశోధక సంస్థల్లో పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు వొబాకియా బ్యాక్టీరియాను ప్రయోగించి, డెంగీ వ్యాప్తిని నిరోధించడంలో సఫలీకృతులయ్యారు. డెంగీ వ్యాప్తికి కారణమయ్యే ఏడిస్‌ ఈజిపై్ట దోమల శరీరంలోకి వొబాకియా బ్యాక్టీరియాను ఇంజెక్ట్‌ చేసి, వాటిని బయటి వాతావరణంలోకి విడిచిపెట్టాక, వాటి ద్వారా డెంగీ వ్యాప్తి పెద్దగా జరగలేదు. వొబాకియా బ్యాక్టీరియా ఎక్కించిన తర్వాత దోమలకు పుట్టిన తర్వాతి తరాల దోమల్లో కూడా డెంగీని వ్యాప్తి చేసే శక్తి గణనీయంగా తగ్గిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

దోమల నివారణ మార్గాలు..
దోమలను సమర్థంగా నివారించుకోవడం ద్వారా మాత్రమే దోమకాటు వ్యాధుల బారి నుంచి మనం తప్పించుకోగలం.

– మనం ఉండే ఇళ్లలోకి, గదుల్లోకి దోమలు రాకుండా దోమతెరలు, మస్కిటో రిపెల్లెంట్లు వాడాలి.
– దోమలు కుట్టకుండా ఉండటానికి శరీరంపై పూత మందులు వాడటం కూడా ఒక మార్గం.
– దోమలు కుట్టకుండా ఉండాలంటే, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా నిండుగా దుస్తులు ధరించాలి.
– దోమలు మురికి దుస్తులపై ఆకర్షితమవుతాయి. అందువల్ల శుభ్రమైన దుస్తులు ధరించాలి.
– ఇళ్ల పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు నిత్యం ప్రవహించేలా కాల్వలను శుభ్రం చేసుకోవాలి.

అపోహలు, వాస్తవాలు..
అపోహ: దోమలన్నీ మనుషులను కుడతాయి.
వాస్తవం: ఆడ దోమలు మాత్రమే మనుషులను, జంతువులను కుడతాయి. ఆడ దోమల్లో పునరుత్పత్తి శక్తి కోసం మనుషులు, జంతువుల రక్తం అవసరం.

అపోహ: కొన్ని రకాల రక్తమంటేనే దోమలకు ఇష్టం
వాస్తవం: ముఖ్యంగా ‘ఓ–పాజిటివ్‌’ రక్తమంటే దోమలకు ఇష్టమని, అందుకే ఆ రక్తం ఉన్నవారిని ఎక్కువగా కుడతాయనే ప్రచారం ఉంది. నిజానికి దోమలను ఆకర్షించేది రక్తం కాదు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా. చర్మంపై కొన్నిరకాల బ్యాక్టీరియా ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి.

అపోహ: తెల్లచర్మం ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి.
వాస్తవం:  దోమలు కుట్టినప్పుడు తెల్లచర్మం ఉండేవారి శరీరంపై దద్దుర్లు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. దోమల లాలాజలంలో ఉండే ఎంజైమ్‌ వల్ల దురద పుట్టి దద్దుర్లు ఏర్పడతాయి. దోమలు కుట్టడానికి మనుషుల రంగుతో సంబంధం లేదు.

అపోహ: దోమలన్నీ వ్యాధులను కలిగిస్తాయి.
వాస్తవం: ప్రపంచంలో 3,600 జాతులకు పైగా దోమలు ఉన్నా, వీటిలో చాలా జాతులకు చెందిన దోమలు అసలు మనుషుల జోలికి రావు. అయితే, మనుషులను కుట్టే జాతులకు చెందిన దోమల్లో ఎక్కువ జాతులు వ్యాధులను మోసుకొస్తాయి.

అపోహ: గబ్బిలాలను ఆకట్టుకుంటే దోమలు పరారవుతాయి.
వాస్తవం: దోమలను పారదోలాలంటే, పెరట్లోకి గబ్బిలాలను రప్పించాలనే ప్రచారం ఉంది. దోమలు, ఈగల వంటి కీటకాలను గబ్బిలాలు తినడం నిజమే గాని, అవి దోమలను పూర్తిగా నిర్మూలించలేవు.

అపోహ: మనుషుల పరిమాణంతో సంబంధం లేకుండా దోమలు వారిని కుడతాయి.
వాస్తవం: చిన్నగా కనిపించే వారి కంటే పెద్దగా కనిపించే మనుషులనే దోమలు ఎక్కువగా కుడతాయి. చిన్న పిల్లల కంటే దోమలు పెద్దలనే ఎక్కువగా కుడతాయి. పిల్లల కంటే పెద్దలు తమ ఊపిరిలో కార్బన్‌ డయాక్సైడ్‌ను ఎక్కువగా విడిచిపెడతారు. చాలా దూరం నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ను పసిగట్టగల దోమలు త్వరగా పెద్దల వైపు ఆకర్షితమవుతాయి.

మరిన్ని మశక విశేషాలు..

  • గుడ్డు దశ నుంచి పూర్తిగా ఎదిగిన దశకు చేరుకోవడానికి దోమకు వారం నుంచి పదిరోజులు పడుతుంది.

  • చెమట కారణంగా చర్మంపై పెరిగే బ్యాక్టీరియా విడుదల చేసే వాసనలు దోమలను ఇట్టే ఆకట్టుకుంటాయి. చెమట చిందిన పాదాలను శుభ్రం చేసుకోకుండా కాసేపు అలాగే వదిలేస్తే, వాటిపై దోమలు దాడి చేస్తాయి.

  • కొన్ని రకాల వాసనలు దోమలను గందరగోళానికి గురిచేస్తాయి. ఉల్లి, వెల్లుల్లి వాసనల వైపు దోమలు రావు. వెల్లుల్లి తిన్నట్లయితే, చెమట వాసనలో మార్పు వస్తుంది. వెనిగర్‌లో ముంచిన ఉల్లిపాయ ముక్కలను ఒంటికి రుద్దుకున్నట్లయితే, దోమలు దరిదాపులకు రావు.

  • దోమలు అతి నెమ్మదిగా ఎగురుతాయి. దోమల వేగం గంటకు ఒకటి నుంచి ఒకటిన్నర మైళ్లు. తేనెటీగలు ఎగిరే వేగంతో పోల్చుకుంటే, ఇది పదోవంతు మాత్రమే!

  • దోమలు ఎగురుతున్నప్పుడు బాగా రొదగా ఉంటుంది. దోమలు ఎగిరేటప్పుడు వాటి రెక్కలు సెకనుకు 300–600 సార్లు రెపరెపలాడతాయి. వాటి కారణంగానే ఈ మశక సంగీతం వినిపిస్తుంది.

  • దోమ బరువు 2 మిల్లీగ్రాములు. ఆడదోమ చిన్నిపొట్ట నిండటానికి లీటరులో 50 లక్షలవంతు రక్తం సరిపోతుంది. ఒక్కోసారి ఆడదోమలు తమ శరీరం బరువుకు సమానమైన నెత్తురు తాగేస్తాయి. వెన్నెల రాత్రులలో దోమలు మరింతగా విజృంభిస్తాయి. వెన్నెలలో దోమలకు తమ లక్ష్యం మరింత స్పష్టంగా కనిపించడమే దీనికి కారణం. చీకటి రాత్రుల కంటే వెన్నెల రాత్రులలో దోమలు ఐదురెట్లు ఎక్కువగా మనుషులను కుడతాయి.

  • దోమలను ముదురు రంగులు ఇట్టే ఆకట్టుకుంటాయి. రక్తం తాగే ఆడ దోమలు ఎక్కువగా చీకటి ప్రదేశాలను స్థావరంగా చేసుకుంటాయి. అందుకే అవి ముదురు రంగు దుస్తులు వేసుకునే వారి వైపు ఆకర్షితమవుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement