రూ. 36 లక్షల ప్యాకేజీ.. పిల్లలను కనలేని పేదరికం | Couple Earning ₹36 Lakh Per Year In Gurugram Says Rising Cost Of Living Prevents Them From Having Children, Read Story Inside | Sakshi
Sakshi News home page

రూ. 36 లక్షల ప్యాకేజీ.. పిల్లలను కనలేని పేదరికం

Apr 29 2026 11:32 AM | Updated on Apr 29 2026 12:30 PM

Gurgaon Couple Earning 36 LPA Refuses Kids Over High Living Costs

గుర్గావ్‌:  ఏడాదికి 36 లక్షల రూపాయల జీతం.. ఈ మాట వినగానే ఎవరైనా ‘వామ్మో’ అని అంటారు. అయితే  నగర జీవితంలో ఇంతటి భారీ ప్యాకేజీ.. ఒక సాధారణ కుటుంబాన్ని పోషించడానికి సరిపోవడం లేదట! దేశ రాజధానిని ఆనుకుని ఉన్న ఐటీ హబ్ గుర్గావ్‌కు చెందిన ఒక జంట, నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్నా.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో తాము పిల్లల్ని కనే సాహసం చేయలేమని తేల్చి చెప్పారు. పెరుగుతున్న జీవన వ్యయం నగరాల్లోని యువత ఆలోచనా విధానాన్ని ఎలా మారుస్తుందో  ఈ ఉదంతం తెలియజేస్తోంది.

కాగితం మీదే భారీ జీతం
గుర్గావ్‌లో నివసిస్తున్న 35 ఏళ్ల వ్యక్తి నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తుండగా, అతని భార్య నెలకు లక్ష రూపాయలు ఆర్జిస్తోంది. వీరిద్దరి వార్షిక ఆదాయం ఏకంగా రూ.36 లక్షలు. ఈ జీతం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అయితే, పెరుగుతున్న జీవన వ్యయం, ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు వారిని పిల్లలను కనకుండా అడ్డుకుంటున్నాయి. ఈ వివరాలను ఆ వ్యక్తి బంధువు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న హర్ష్ గుప్తా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఇది వైరల్‌గా మారింది.

సొంతిల్లు లేదు.. స్కూల్ ఫీజులు కట్టలేం
‘మాకంటూ గుర్గావ్‌లో కనీసం ఒక డీసెంట్ వన్‌ బీహెచ్‌కే ఫ్లాట్ కొనుగోలు చేసే స్థోమత లేదు. అలాంటప్పుడు పుట్టబోయే బిడ్డకు తగినంత స్థలం ఎలా కల్పించగలం?’ అని ఆ జంట వాపోతోంది. దీనికి తోడు ప్రైవేట్ పాఠశాలల్లో నెలకు కనీసం 35 వేల నుంచి 40 వేల రూపాయల వరకు ఫీజుల రూపంలోనే చెల్లించాల్సి రావడం కూడా వారిని భయపెడుతోంది. రియల్ ఎస్టేట్ ధరలు, విద్యా ఖర్చుల భారం మోయలేకే వారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని గుప్తా తెలిపారు.

పెరుగుతున్న ‘డింక్’ కల్చర్
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, పిల్లలు వద్దు అనుకునే వారిని ‘డింక్’ జంటలు అని అంటారు. ఆధునిక నగరాల్లో ఈ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. పట్టణాల్లో సంతానోత్పత్తి రేటు ఎందుకు పడిపోతోందో చెప్పడానికి ఈ ఘటనే సరైన ఉదాహరణ. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. భవిష్యత్తుకు ఆర్థిక భద్రత ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకపోవడమే ఉత్తమమని కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం వయసు దాడిపోయాక ఈ జంట బాధపడక తప్పదని అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: మేఘాలయ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!

Advertisement
 
Advertisement
Advertisement