మేఘాలయ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! | Meghalaya Honeymoon Murder Case, Sonam Raghuvanshi Gets Conditional Bail Amid Court Criticism Of Police Lapses In Shillong | Sakshi
Sakshi News home page

మేఘాలయ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!

Apr 29 2026 9:30 AM | Updated on Apr 29 2026 10:18 AM

Meghalaya Honeymoon Murder Why the Accused Wife Got Bail

షిల్లాంగ్: దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు తాజాగా అనూహ్య మలుపు తిరిగింది. 2025లో పెళ్లైన కొత్తలోనే భర్తను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశీకి షిల్లాంగ్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

పోలీసుల ఘోర వైఫల్యం
కోర్టు విచారణలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. సోనమ్‌ను అరెస్టు చేసిన సమయంలో అందుకు గల ఖచ్చితమైన కారణాలను ఆమెకు వివరించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఆమెకు ఇచ్చిన అరెస్ట్ గ్రౌండ్స్ ఫారమ్‌లో చెక్ బాక్స్‌లు టిక్ చేయలేదు. పైగా డాక్యుమెంట్లలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)కు చెందిన సెక్షన్ 103(1) వంటి కఠినమైన హత్య అభియోగానికి బదులుగా, తప్పుగా సెక్షన్ 403(1) అని పేర్కొన్నారు.

రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన
అరెస్టుకు గల కారణాలను నిందితురాలికి తెలియజేయకపోవడం ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ఉల్లంఘించినట్లయ్యిదని ఆమె తరపు న్యాయవాది వాదించారు. జూన్ 9, 2025న గాజీపూర్‌లో మొదటిసారి కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆమెకు కనీస న్యాయ సహాయం కూడా అందలేదనే విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. తన తప్పిదం లేకుండానే విచారణ రెండు నెలల పాటు నిలిచిపోయిందని, విచారణ లేకుండా నిందితురాలిని నిరవధికంగా జైలులో ఉంచలేమని వాదనలు విన్న షిల్లాంగ్ అదనపు డీసీ (జుడీషియల్) డ్యాష్లీన్ ఆర్. ఖార్బ్టెంగ్, సోనమ్‌కు రూ. 50,000 వ్యక్తిగత పూచీకత్తు, ఇతర షరతులతో బెయిల్ మంజూరు చేశారు.

అసలేం జరిగిందంటే?
మే 20న ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ, సోనమ్ దంపతులు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లగా, మే 23న అదృశ్యమయ్యారు. వారం రోజుల గాలింపు తర్వాత జూన్ 2న సోహ్రాలోని ఒక లోయలో రాజా మృతదేహం లభ్యమైంది. అనంతరం సోనమ్ గాజీపూర్‌లో లొంగిపోయింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహా, మరో ముగ్గురు కిరాయి హంతకులు (విశాల్ సింగ్ చౌహాన్, ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మీ)తో కలిసి ఆమె ఈ హత్యకు కుట్ర పన్నినట్లు ‘సిట్’ 790 పేజీల ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది. సోనమ్‌కు బెయిల్ వచ్చినప్పటికీ, మిగతా నిందితులు ఇంకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.

ఇది కూడా చదవండి: ఎగ్జిట్ పోల్స్ నిజమేనా? ‘ఈసీఐ’ ఏమంటోంది?

Advertisement
 
Advertisement
Advertisement