ఎగ్జిట్ పోల్స్ నిజమేనా? ‘ఈసీఐ’ ఏమంటోంది? | Exit Polls 2026 The Ultimate Guide to How They Work | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్ పోల్స్ నిజమేనా? ‘ఈసీఐ’ ఏమంటోంది?

Apr 29 2026 8:05 AM | Updated on Apr 29 2026 8:05 AM

Exit Polls 2026 The Ultimate Guide to How They Work

న్యూఢిల్లీ: ఎన్నికల పోలింగ్ ముగియగానే అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పైనే పడుతుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల హోరు ముగింపు దశకు చేరుకోవడంతో, ఈరోజు (ఏప్రిల్ 29) సాయంత్రం 6:30 గంటల తర్వాత వెలువడే ఈ సర్వే ఫలితాల కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.  ఇంతకీ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? ఇవి ఏ మేరకు వాస్తవాలను ప్రతిబింబిస్తాయి?

సర్వేల వెనుక..
ఎగ్జిట్ పోల్స్ (పోస్ట్-పోల్ సర్వేలు) అంటే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత.. వారి నుంచి పోలింగ్ కేంద్రం బయట తీసుకునే అభిప్రాయ సేకరణ.. దీనికోసం సర్వే సంస్థలు వయసు, కులం, లింగం, గ్రామీణ-పట్టణ నేపథ్యం వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని, శాస్త్రీయ పద్ధతిలో ఓటర్లను ఎంపిక చేస్తాయి. ఓటర్లు ఎవరికి ఓటేశారు అనేది నిర్దిష్ట ప్రశ్నల ద్వారా అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ డేటాను గణాంక నమూనాలతో విశ్లేషించి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఒక ప్రాథమిక అంచనాకు వస్తారు.

చట్టం ఏం చెబుతోంది? జైలు శిక్ష తప్పదా?
ఈ ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)కఠిన నిబంధనలు అమలు చేస్తున్నది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126ఏ ప్రకారం, పోలింగ్ జరిగే సమయంలో వీటిని ప్రసారం చేయడం, ప్రచురించడం చట్టరీత్యా నేరం. 2026 ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 9 ఉదయం 7 గంటల నుండి ఏప్రిల్ 29 సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై కఠిన నిషేధం అమలులో ఉంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

ఎగ్జిట్ పోల్స్ 100 శాతం పక్కానా?
ఈ సర్వేలు ఎన్నికల సరళిని, ఓటర్ల నాడిని ముందుగానే పసిగట్టేందుకు ఒక అంచనా సాధనంగా ఉపయోగపడతాయి. అయితే ఇవి ఎల్లప్పుడూ కచ్చితమైనవి కావు. గత ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, పలుమార్లు ఎగ్జిట్ పోల్ అంచనాలు తుది ఫలితాలకు పూర్తి భిన్నంగా వచ్చాయి. శాంప్లింగ్ లోపాలు, ఓటర్లు తమ అసలు ఎంపికను చెప్పడానికి ఇష్టపడకపోవడం, చివరి నిమిషంలో ఓటర్ల నిర్ణయాలు మారడం వంటివి ఇందుకు కారణం. ఇవి కేవలం ముందస్తు అంచనాలు మాత్రమేనని, ఎన్నికల సంఘం ప్రకటించేవే అంతిమ, అధికారిక ఫలితాలని గ్రహించాలి.

ఇది కూడా చదవండి: Kerala: ముస్లిం లీగ్ ‘మాస్టర్ ప్లాన్’.. అదిరిపోయే టార్గెట్‌?

Advertisement
 
Advertisement
Advertisement