అంతరించి పోతున్న 'బంజారా'కు గ్లామర్‌ | Grammar For Banjara language | Sakshi
Sakshi News home page

అంతరించి పోతున్న 'బంజారా'కు గ్లామర్‌

May 22 2026 3:53 PM | Updated on May 22 2026 3:55 PM

Grammar For Banjara language

పేదింటి బిడ్డ ప్రమీలాకు చదువు అంటే ఇష్టం. తన మాతృభాష బంజార భాష అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను లిపి లేని బంజార భాష వ్యాకరణంపై పరిశోధన చేసేలా చేసింది. నల్గొండ జిల్లా, తిరుమలగిరి నేతపురి ధన్సింగ్‌ తండాకు చెందిన మేగవత్‌ ప్రమీల ‘బంజారా భాషకు తెలుగులో రాసిన వర్ణనాత్మక వ్యాకరణం’పై ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేసిన తొలి వ్యక్తి కావడం విశేషం. మారుమూల తండాలో పేద గిరిజన కుటుంబంలో పుట్టిన ప్రమీల చిన్నతనం నుంచే కూలీపనులు చేసేది. 

ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించి ఇంటర్‌ కాలేజీ టాపర్‌గా నిలిచింది. కోఠి మహిళా కాలేజీలో(వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ)లో డిగ్రీ, ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి పీజీ పూర్తి చేసింది. 2017లో యూజీసి నెట్, జేఆర్‌ఎఫ్‌ సాధించింది. 

‘తెలంగాణ జిల్లాలలోనే బంజార భాషల్లో ఎంతో వైవిధ్యం ఉంది. ఆయా జిల్లాలలోని బంజారాలు మాట్లాడే భాషను తెలుగులో రాసుకుని వాటికి వ్యాకరణం రాయాల్సి వచ్చింది. అంతరించి పోతున్న బంజార భాష సంరక్షణకు నా వంతుగా కృషి చేయాలనే ఉద్దేశంతో నా మాతృభాషకు సంబంధించిన పరిశోధన అంశాన్ని ఎంచుకున్నాను. 

బంజార భాషలోని విభిన్న శైలులను  ఏకం చేసేందుకు చేసిన చిన్న ప్రయత్నం ఇది. బంజారాలు మాట్లాడే భాష, యాసలకు ఒక రూపాన్ని ఇవ్వడం ద్వారా దాని సంరక్షణకు నా పరిశోధన కొంత మేరకు ఉపయోగపడనుంది’ అంటుంది ప్రమీల.
– సుధాకర్‌ కంతి, సాక్షి, లాలాపేట  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement