ఈ వారం కథ: శుభశకునం! 'నువ్వు చెప్పింది అక్షరాలా నిజం' | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: శుభశకునం! 'నువ్వు చెప్పింది అక్షరాలా నిజం'

Published Sun, Mar 10 2024 11:13 AM

Funday: This Week Story Good Omen Subha Shekunam - Sakshi

Funday: This Week Story

ఈ వారం కథ

'వారంలోని ప్రతిరోజు లాగే ఆ రోజు కూడా ఏ ప్రత్యేకతా లేని గురువారం. చలి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా తన ప్రభావం చూపుతోంది. బూడిదరంగు ఆకాశంలో కృశించిపోయిన సూర్యుడు సన్నని వెలుతురు పంచుతున్నాడు. మునుపెన్నడో చెత్తకుండీలోంచి ఏరుకొచ్చిన ఓ నడిపాత తివాచీపై కూతురు దగ్గుతో లుంగలు చుట్టుకుపోవడాన్ని మజీద్‌ నిస్సహాయంగా గమనించసాగాడు. పనార్‌ ఎడారిలోని సంచారతెగలు వుండే ఒకే ఒక్క గది ఉన్న ఇంటికి అదే కాస్త వెచ్చదనాన్ని సమకూరుస్తోంది. బైట న్యుమోనియా ప్రబలిపోతుండడంతో మజీద్‌ తన కూతుర్ని ఎన్నో ఆస్పత్రులకు తిప్పితే చివరికి ఓ డాక్టర్‌ ఆమెను చూడడానికి ఒప్పుకున్నాడు. ఆయన మందులిచ్చి వ్యాధి మరింత ఎక్కువ కాకుండా పిల్లని కాస్త వెచ్చని వాతావరణంలో ఉంచమన్నాడు.'

      ‘ఇలా రండి, కాస్త టీ, రొట్టీ, ఓ గుడ్డు తీసుకుందురు గానీ’ భార్య ఫరీదా అంది.
తన కొడుకులు బైట సంతోషంగా ఆడుకోవడాన్ని, ఫరీదా అతని చుట్టూ ఆందోళనగా తిరగడాన్ని అతను నిశ్శబ్దంగా చూడసాగాడు. ఆమె కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు, మొరటుగా మారిన చేతివేళ్లు, కాయలు గాచిన అరచేతులు.. పెళ్ళైన కొత్తల్లోని ఫరీదాకీ, ఈమెకు ఎంతో తేడా చూపుతున్నాయి. ఆగది మధ్యకు ఆమె మూలనున్న ఓ బల్లని జరిపింది. అదే వాళ్ళకి వంటగదీ, పడకగదీ, భోజనాలగదీ, అన్నీ. స్నానాల గది, పాయిఖానా ఇంటి బైటెక్కడో, అవి మాత్రం సామూహికం. వాటిని ఎన్నో కుటుంబాలవాళ్ళు వాడుకుంటుంటారు.

ఇంట్లో కూడా ఈ బల్లతో పాటే నాలుగు ప్లాస్టిక్‌ కుర్చీలు.. అంతే! ఓ టీవీ, దాన్ని ఎక్కడో దొరికిన ప్లాస్టిక్‌ పూలతో అలంకరించారు. అదో మూలన చిన్న స్టూల్‌ మీద ఉంటుంది. నీళ్ళ కోసం వాడి పారేసిన కోకాకోలా బాటిల్స్‌ వాడుకుంటుంటారు. ప్రతిరోజూ వాళ్ళు మాంసం వండుకుని తినడానికి కుదరదు. ఒకవేళ కుదిరినా చిన్న ముక్క కూడా మిగలదు. అందుకని వాళ్ళకి ఫ్రిజ్‌ అవసరం కూడా ఉండదు.

తన భార్య కూతురి ఆరోగ్యం గురించిన చింతతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిందని మజీద్‌కి బాగా తెలుసు. ఓవారం రోజుల్లోనే ఆమె మొహం ఎంత నీరసించిపోయి పీక్కుపోయిందో అర్థమవుతోంది. అయితే తను ఏరోజూ ఏ విషయంలోనూ ఫిర్యాదు చేసింది లేదు. ఆ విషయంలో తను అదృష్టవంతుడే, కానీ లోపల్లోపల అతనేదో అపరాధిలా బాధపడుతుంటాడు. తమ కష్టాలు తీరిపోయే రోజు ఒకటి వస్తుందని అతను ఎదురు చూస్తున్నాడు.
      ‘జమీలా! నాన్నగారు బైటికి వెళుతున్నారు, టాటా చెబుదాం రా!’ అంటూ ఆ చిన్నబిడ్డని ఫరీదా తివాచీ పైనుంచి లేపేటప్పటికి ఆ పిల్ల గట్టిగా అరుస్తూ ఏడవసాగింది. దాంతో కలవరపడిపోయిన ఆ తల్లి పాపని ఊరుకోబెట్టడానికి చిన్నగా పాడసాగింది.
           ‘ఈవేళ తొందరగా వచ్చేస్తానులే’ టీ ముగించిన మజీద్‌ అన్నాడు ఆమెతో.
‘ఇన్షా– అల్లాహ్‌!’

మజీద్‌ నెమ్మదిగా నడుస్తూ హైవే మీదకొచ్చి సిటీ బస్‌ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. అతని చుట్టూ ఎడారే, అక్కడక్కడా ముళ్ళజెముడు మొక్కలు రోడ్డుకిరువైపులా పెరిగిపోయున్నాయి. వీస్తున్న చల్లగాలికి అతను వేసుకున్న జుబ్బా ఊగుతుంటే, తలపై టోపీ చలి నుండి, దుమ్ము నుండి అతనికి రక్షణ కల్పిస్తోంది. చలికి పగిలిన అతని పాదాలు తక్కువ ధరలో కొన్న పాత ఉన్ని మేజోళ్ళలోనూ, నకిలీ తోలుబూట్లలోనూ తలదాచుకున్నాయి. నిజం చెప్పాలంటే సంచార జాతుల వాళ్ళకు కుటుంబం గడవాలంటే చెప్పినంత సులువు కాదు.

తను ఏదో ఒక పని చేస్తున్న కారణంగా అధికారులు తనని అరెస్టు చేయకుంటే చాలని ప్రతిరోజూ అతను ప్రార్థిస్తుంటాడు. ఆ ప్రాంతాల్లో అడుక్కు తినడాన్ని నిషేధించారు కాబట్టి తమలాంటి వాళ్ళు ఏ పని దొరికితే అది చాలావరకు అవి చట్టవ్యతిరేకమైనవే అయుంటాయి. చేయడానికి సిద్ధంగా ఉంటారు. సంచార జాతివాడిగా ముద్రవేయబడ్డ అజీజ్‌ కానీ, అతని తండ్రి, తాత, ఎవరూ కూడా బడికి వెళ్ళి చదువుకున్నదేలేదు. నేటి సమాజంలో చదువు రాకపోవడమంటే ఎంత దుర్భరమో అతనికి బాగా తెలుసు. ఏదో అజీజ్‌ తన మీద దయతో తన పనిముట్లను అతని షాపులో ఉంచుకోనిస్తూ తనకి సహకరిస్తున్నాడు.

‘జమీలా ఎలా ఉంది?’ అడిగాడు అజీజ్‌.
      ‘ఇప్పుడు ఫర్వాలేదు’ చెప్పాడు మజీద్‌.
‘రెండు రోజుల పాటు నువ్వు రాకపోయేసరికి కాస్త కంగారుగా ఉండిందిలే.’
      ఆ ఊళ్ళో అజీజ్‌ ఒక్కడే తనతో ఈ మాత్రం దయతో ఉంటాడు. అతనికో చిన్న ఎలక్ట్రిక్‌ షాపు ఉంది. అందులోనే అతను ఏ ప్రతిఫలం ఆశించకుండా మజీద్‌ పనిముట్లను ఉంచుకోవడానికి పెద్ద మనసుతో అనుమతినిచ్చాడు. ఎప్పుడైనా ఓ మంచిరోజున అజీజ్‌ అతనికి ఐదారు దీనారాలను ఇస్తుంటాడు. కానీ ఆ మంచిరోజులనేవి చాలా చాలా అరుదు. ప్రతిరోజూ మజీద్‌ కేవలం రొట్టె, పెరుగులతో భోజనం చేస్తుంటాడు. అప్పుడప్పుడు అజీజ్‌ తను ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం పెట్టేవాడు. కోడిమాంసం, కట్లెట్‌.. ఇలా. ఎప్పుడైనా ఒక్కోసారి మహబూబ్‌ హోటల్‌ నుంచి భోజనం తెప్పించేవాడు. అజీజ్‌ కబాబ్‌ కానీ మరోటి కానీ మజీద్‌కి తినమని ఇచ్చినప్పుడల్లా ఏదో అపరాధభావన మజీద్‌ని తొలిచేసేది..అనవసరంగా అతనికి భారమౌతున్నానని.

      ‘తిను మజీద్, నువ్వు తినకుంటే నాకు బావుండదు’ మెల్లిగా నచ్చజెప్పేవాడు అజీజ్‌.
‘షుక్రియా’ ఔదార్యంతో అతనిస్తుంటే, అతన్ని నొప్పించకూడదని మజీద్‌ తీసుకునేవాడు.
      అజీజ్‌ మంచితనానికి తను ఏ విధంగానూ, ఎన్నటికీ ఋణం తీర్చుకోలేనని మజీద్‌కి తెలుసు. ఏదో ఒక అద్భుతం జరిగి తన దశ తిరిగిపోతే తను కూడా అజీజ్‌లాగే ఇతరులకి సహాయపడాలని అతనెప్పుడూ కోరుకుంటుంటాడు. ప్రతిరోజూ మక్కా వైపుకు తిరిగి ఐదుసార్లు ప్రార్థన చేసేటప్పుడు అటువంటి అద్భుతమొకటి తన జీవితంలో జరగాలని భగవంతుని ప్రార్థిస్తుంటాడు.
      ఇప్పుడతని వయసు నలభై ఐదు.. తనపై ఆధారపడ్డ వాళ్ళు మరో నలుగురు. ఓ విధంగా అతను తన తల్లిదండ్రులు ఈ ‘ఆపరేషన్‌ లెనిన్‌ బోల్ట్‌’ ఆరంభమై ఈ కష్టాలన్నీ అనుభవించకుండా దాటుకెళ్ళిపోవడాన్ని అదృష్టంగా భావిస్తుంటాడు. అప్పట్లో అతని వయసు ఇరవై మూడు. మనిషిగా తననెప్పటికీ గుర్తించలేని ఈ మాతృభూమి పట్ల దేశభక్తి అతని కణాల్లో అగ్నిని రగిల్చేది. సైన్యంలో చాలా చిన్న ఉద్యోగంలో చేరి యుద్ధం చేసే బీభత్సాన్ని ఓ సాక్షిలా తన కళ్ళారా చూశాడు.

‘యుద్ధంలో వీరమరణమన్నదే లేదు.. రక్తపాతం తప్ప! వీధుల్లో యుద్ధట్యాంకులు నడుస్తుంటే మనసులో ఆనందం ఎలా ఉంటుంది.. ఏదో ఖాళీ అయిన భావన తప్ప! యుద్ధంలో విజయం అంటే ఈ మనసు ఖాళీ అయిందానికా లేక ఈ భయంకరమైన పరిస్థితులకా? దేన్ని విజయం అంటారు? అంతా కల్పితం, అంతా మాయ కాకపోతే!’ మసాలా టీ తాగుతూ ఎన్నోసార్లు మజీద్‌ యుద్ధమంటే తన ఏవగింపును కవితాత్మకంగా తన మిత్రునితో పంచుకునేవాడు.
      ఈ యుధ్ధంలోనే అజీజ్‌ తన సర్వస్వాన్ని, తన కుటుంబంతో సహా కోల్పోయాడు. నెలల తరబడి అతను తనలాంటి వాళ్ళతో కలిసి ఎంతో బెంగగా, తన దగ్గరికి రాని చావు కోసం ఎదురు చూస్తూ టెంట్లలో నివసించాడు. ఒక్కొక్కరుగా తన తోటివారి మరణాలు అతన్ని నెమ్మదిగా ఇహలోకంలోకి తెచ్చాయి.

‘పోయిందేదో పోయింది, ఇకనైనా నేను ఇతరులకి ఉపయోగపడేలా జీవించాలి’ తన్ను తానే సమాధానపర్చుకున్నాడు. అది మొదలు ఎవరికి ఏ సహాయం కావాలన్నా, శవాలు పూడ్చడంతో సహా చేయందించేవాడు. ఆ సమయంలో అతనికి పరిచయమైన సంచార జీవులు, వారికి సంబంధం లేని ఈ దేశం పట్లా, ఆ దేశపౌరుల పట్లా వారికున్న భక్తిభావం, అంకితభావం.. అన్నీ అతనికి ఎంతో విస్మయం కలిగించాయి. అప్పటి నుండి ఈ సంచారజాతుల పట్ల అతని దృక్పథం ఎంతో మారిపోయింది.

అటువంటి వారికి తన హృదయంలో భగవంతుని తర్వాత అంతటి స్థానం కల్పించాడు. ఉద్రిక్తతలకు నెలవైన సరిహద్దుల నుంచి యుద్ధట్యాంకులు వెనక్కి వెళ్ళాక, వీళ్ళు కూడా తమ తమ ఆవాసాలకి.. గుర్తింపు లేని, అణచివేయబడ్డ తమ జీవితాల్లోకి తిరిగి వెళ్ళిపోవడాన్ని గమనించాడతను. 
      తమ దేశానికి కొత్తగా వచ్చిన స్వాతంత్య్రానికి ప్రతీకగా ఎగిరే జెండాను ఎక్కడ చూసినా సరే అతన్ని ఏదో అపరాధభావనతో చీల్చేసేది. ఈ విజయానికి ఇతర మిత్రదేశాలు సంబరాలు చేసుకుంటుంటే త్యాగాలు చేసిన ఈ సంచార జీవులు మాత్రం అజ్ఞాతంగా ఉండిపోయారు.
      ‘ఈ కపటనాటకాలతో నా మనసు అవమానంతో దహించుకుపోతోంది, నిస్సహాయుడినైపోయాను!’ అజీజ్‌ అన్నాడు.
‘ఒంటిగాడివైపోయావు, ఏం చేయగలవు!’ విచారిస్తున్న అజీజ్‌ని ఓదార్చాడు మజీద్‌. ‘అసలు నువ్వు నా పట్ల చూపుతున్న మంచితనమే నాకెంత గొప్పగా ఉంటుందో తెలుసా! అల్లా నీకు స్వర్గంలో తప్పకుండా చోటు కల్పిస్తాడులే అజీజ్‌!’

      ‘స్వర్గమా!’ బుస కొట్టాడు అజీజ్‌.
‘నిజమే! ఒక్కడివే భారీ మార్పులు తేలేకపోవచ్చు, కానీ నువ్వు నాపై చూపే మంచితనం నా జీవితానికెంత ముఖ్యమో తెలుసా! నువ్వు ఆ అల్లా దూతవని నేనెప్పుడూ నమ్ముతాను.’
      ‘అబ్బా, మజీద్‌! పొగడ్డానికైనా ఓ హద్దుండాలయ్యా!’
‘ఇదేం పొగడ్త కాదు, నిజమే కదా?’
      అజీజ్‌ తన ఖాళీ కప్పుని పక్కన పెట్టి, తలపైని టోపీ తీసేసి కౌంటర్‌ వెనక్కెళ్ళి కూచున్నాడు.
‘అస్సలామలేకుమ్‌!’ నీలిరంగు కోట్లు ధరించి, వయసులో ఉన్న ఇద్దరు ఈజిప్షియన్లు అక్కడికొచ్చి వైరింగ్‌ కేబుల్స్‌ కోసం అడిగారు. 
      అజీజ్‌ వాళ్ళడిగిన వస్తువుల కోసం అరల వెనక్కి వెళ్ళగానే ఈజిప్షియన్లలో ఒకడు అటూఇటూ చూసి మజీద్‌ దగ్గరికెళ్లి తన కుడికాలి బూటుని అతనికిచ్చాడు. ‘దీన్ని కుట్టాల్సుంటుంది.. కొంత సమయం కావాలి’ పళ్ళూడి బోసినోరులా కనిపిస్తున్న ఆ బూటుని పరీక్షించి అన్నాడు మజీద్‌.
      ‘పర్లేదులే’ మజీద్‌ తన పనిలో తానుంటే అతను అక్కడున్న ప్లాస్టిక్‌ స్టూలుపై కూచున్నాడు. మరొకడు అజీజ్‌ తెచ్చిన వైరు సామానుని పరిశీలిస్తున్నాడు. ఐదారు నిమిషాల్లో మజీద్‌ తన పని ముగించేశాడు. ఆ యువకుడు బూటుని పరీక్షించి, కాలికి తొడుక్కుని, సంతృప్తిగా మజీద్‌ వైపు చూశాడు.

‘ఎంతివ్వాలి?’
      ‘ఎంత బాబూ, యాభై షిల్స్‌ అంతే!’
‘అంతే! చెత్తగాళ్ళు, ఈ దేశదిమ్మరులు కూడా ఎంత ఖరీదు చెబుతున్నారో!’ ప్యాంట్‌ జేబులని వెతుకుతూ అన్నాడతను. 
మజీద్‌ అతనివంక ఏ భావమూ లేకుండా సూటిగా చూశాడు. ఈ చుట్టుపట్ల చెప్పులు కుట్టే వాళ్ళలో తనే చాలా చౌక అని అతనికి బాగా తెలుసు.    
      ‘కుక్కా! తీసుకో!’ నాణాన్ని అతనివైపుకి విసురుతూ, గారపట్టిన పళ్ళని బైటపెడుతూ హేళనగా నవ్వాడా యువకుడు. 
అతని మాటలని పట్టించుకోనట్టు ఉండిపోయాడు మజీద్‌. లోలోపల మనసు మండిపోతుంటే పళ్ళు గిట్టకరిచాడు. ఇప్పుడు తనేం మాట్లాడే పరిస్థితిలో లేడని అతనికి తెలుసు.
       ‘జరిగినదానికి చాలా బాధగా ఉంది మజీద్‌’ అన్నాడు అజీజ్‌.
తలపైని బట్ట సవరించుకుంటూ నిస్సత్తువగా ఒక్క నవ్వు నవ్వాడు మజీద్‌. ‘జీవితంలో మనకు బలం, అధికారం లేనప్పుడు ఓర్పు, క్షమ అలవర్చుకోవాలని నేర్చుకున్నాను. ఇప్పుడు వాడు నన్ను కుక్కా అన్నాడు.. కానీ ఈ దేశం దహనమైపోతుంటే వీళ్ళలో ఒక్కడైనా ముందుకు రావడం మనం చూశామా?’ రెప్పల వెనుక కన్నీటిని దాచేశాడు మజీద్‌.
      అంగీకారంగా తలూపి అజీజ్‌ ఓ వార్తాపత్రికను తీసుకుని హెడ్‌ లైన్స్‌ చదువుతుండగా ఓ విషయం అతన్ని ఆకర్షించింది.

‘పౌరసత్వం ఇవ్వడానికి కేబినెట్‌ ఆమోదం.’
      ‘మజీద్‌! శుభవార్త! సంచారజాతులకు పౌరసత్వం ఇవ్వడానికి కేబినెట్‌ ప్రయత్నిస్తోందట! ఇకపై నువ్వు దేశదిమ్మరివని అనిపించుకోనక్కరలేదు.’ 
‘హు! ఈ సర్కస్‌ ఎన్నిసార్లు చూడలేదు అజీజ్‌! పార్లమెంటులో బిల్లు పెట్టాము అన్న మాటలతో చాలా అలసిపోయాను. ఈ వారంలో నేను జమీలాను తీసుకుని ఎన్నో ఆస్పత్రులు తిరిగాను. కేవలం సంచారజాతి వాడినైనందుకు డాక్టర్లు ఆమెకు చికిత్స చేయలేదు తెలుసా? మేమలా పుట్టడం నేరమా? మేము మనుషులం కామా?’
      ‘నిజమే కానీ, అసలు మీ పరిస్థితే చాలా విచిత్రంగా ఉంది. మీలో కొంతమంది మాలాంటి పౌరులకన్నా ఎక్కువ కాలంగా ఇక్కడుంటున్నారు. కానీ ఎడారి ప్రాంతాలలో మిమ్మల్ని వలసదారులుగా చూస్తారు. మరికొందరు సాధారణ పౌరుల్లా తాము కూడా ప్రయోజనం పొందాలని తమ కాగితాలను కాల్చిపడేసి దేశంలోకి చొచ్చుకుని వచ్చేశారు. ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన వారినీ, చట్టాన్ని గౌరవించేవారినీ ఎలా తెలుసుకోవాలని? ఈ సమస్యకు పరిష్కారం సాల్మన్‌ రాజు కూడా చూపలేడేమో!’
      ‘నువ్వు చెప్పింది అక్షరాలా నిజం, కానీ ఈ నిరీక్షణ, ఇంత అన్యాయం.’
‘చూడు మజీద్, యుద్ధమంటే కేవలం చెడ్డవాళ్ళు మాత్రమే మరణించరు. మంచివాళ్ళు కూడా కొంత బాధ పడాల్సి వస్తుంది. ఇక్కడ నేను చెప్పిందే నిజం కాకపోవచ్చు కానీ,లోకం తీరు అలాగే ఉంది మరి!’

‘1967 లో జరిగిన ఆరు రోజుల యుద్ధం గురించి మా నాన్నగారు చెప్పింది నాకు బాగా గుర్తు. ఆర్మీలో చేరి, అందులో పనిచేయడానికి సంచారజాతులవారిని ఉపయోగించుకుంటారు కానీ యుద్ధమైపోయాక మాదారి మాదే.. ఎడారి వైపే. దీనివల్ల మానాన్న ఏ మాత్రం ప్రయోజనం పొందలేదు, కేవలం వాళ్ళకి ఉపయోగపడ్డారంతే! కొంతమందికి కంటితుడుపుగా ఏవో కొన్ని అవార్డులిచ్చారే కానీ పౌరులు యుద్ధంలో పాల్గొంటే ఇచ్చేదాని ముందు ఇదెంత? ఎంత దారుణంగా వివక్ష చూపుతున్నారో, మమ్మల్ని జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారు. ఇంక మాకు గౌరవం ఏముంటుంది!’ నిట్టూరుస్తూ, ‘నిన్న పుచ్చకాయలు అమ్ముతున్నాడని బద్రుని అరెస్టు చేశారట తెలుసా?’ అన్నాడు మజీద్‌.
      అద్దాలు సరిచేసుకుంటూ పత్రికలోంచి తలెత్తి చూశాడు అజీజ్‌. అతనికేం చెప్పాలో తోచలేదు. అతని అదృష్టం కొద్దీ మధ్యాహ్న ప్రార్థనల కోసం మసీదు నుంచి వచ్చిన పిలుపు గాలిని నింపేసింది. ఇద్దరూ తమ తమ చాపల్ని పరుచుకొని మక్కావైపుకు తిరిగి ప్రార్థించసాగారు. లయబద్ధంగా ప్రార్థన చేస్తున్నవారి కంఠం నుండి వస్తున్న శ్లోకాలు ఆ మధ్యాహ్నవేళ నిశ్శబ్దాన్ని కరిగించసాగాయి. ఓ పదిహేను నిమిషాల పాటు వీధులన్నీ స్తబ్ధుగా మారినా, వెంటనే మళ్ళీ మామూలే.. ఉరుకులు, పరుగులు. ఆ ఇద్దరూ ఒకరు దేశపౌరుడు, మరొకరు సంచార జాతివారు. విచిత్రంగా ఇద్దరూ ఒకే భగవంతుని ముందు మోకరిల్లారు. బహుశా ఆయనకి స్వర్గానికి, మనుషుల మనసులకు తేడా తెలియదేమో!

చాప మడుస్తూ ఎందుకనో మజీద్‌ ఆలోచనలో పడ్డాడు.
      ‘ఏమిటంత ఆలోచన మజీద్‌?’
‘మా సంచారజాతుల వాళ్ళమంతా కూడా సంచారజాతి దేవుడినే ప్రార్థించాలేమోనని!’
      ‘ఛ! ఏమిటా మాటలు?’ గట్టిగా అరిచాడు అజీజ్‌.
‘ఒక్కోసారి భగవంతుడు గుడ్డివాడు, చెవిటివాడు అనిపిస్తుంది. సిగ్గుతో తన ముఖం చూపించలేక దాచుకున్నాడనిపిస్తుంది. ఎంత కాలమిలా? మా ప్రాణాలు విసిగిపోయాయి! అందుకే నేను..’
      ‘నిరాశతో దైవదూషణకు పాల్పడవద్దు మజీద్‌! మరి నేను ఏ దేవుడిని ప్రార్థించాలని? ఏ దేవుడైతే నాకు ఇంటినీ, కుటుంబాన్నీ ఇచ్చాడో అదే దేవుడు వాటిని నాశనం కూడా చేశాడు. అంత మాత్రాన నేను మరో దేవుడిని ప్రార్థించాలా? మన జీవితాలే మనకు పాఠాలు కావాలి అంతే!’ స్నేహితుని భుజం తడుతూ అన్నాడు అజీజ్‌.
      ‘అంటే, ఇదే న్యాయమంటావా?’
‘కావచ్చేమో! అయితే అది తెలుసుకోవడానికి మనం తెరవాల్సింది కళ్ళు కాదు, మనసు! ఒక్కోసారి ఎంత తరచి చూసినా ఇవన్నీ మనకు అర్థంకావు కూడా. యుద్ధక్యాంపులోని నా జీవితం ఇతరులకి సహాయం చేయడంలో తప్ప మరెందులోనూ అర్థం లేదని తెలిపింది.’

అర్థం లేని నిరీక్షణలో, నిరాశతో కుంగిపోయిన తన స్నేహితుడివైపు జాలిగా చూశాడు అజీజ్‌. మజీద్‌ తన పౌరసత్వం కోసం ఎంతగా ప్రార్థిస్తున్నాడో అతనికి బాగా తెలుసు. జీవితంలో ఏ హక్కులూ, అంతెందుకు ఓ గుర్తింపు కూడా లేకపోవడమంటే మనిషినెంత వేధిస్తుందో అజీజ్‌కి బాగానే అర్థమవుతోంది. అతనికి మజీద్‌ పరిస్థితి తలలేని మొండెంలా అనిపిస్తోంది. మజీద్‌ స్థితిగతుల్ని ఏ మాత్రం మార్చలేని తను చూపించే జాలి, సానుభూతి ఎంత వరకు ఉపయుక్తమో తల్చుకున్న కొద్దీ బాధ కలిగిస్తోంది అతనికి. 
      ‘మంచిరోజులు వస్తాయిలే మజీద్‌!’ ఆశావహంగా అన్నాడు అజీజ్‌.
‘నాకు మా తండ్రి మరణించిన రోజు గుర్తుకొస్తుంది, ఆ రోజు మా నాన్న శవం అనామకంగా.. ఆయన తండ్రిలాగే ఎక్కడో పూడ్చిపెట్టామే తప్ప ఆయనకో గుర్తింపు లేదని గ్రహించలేకపోయాను. రేప్పొద్దున నేనైనా అంతే! అదేమంత బాధ కాదు కానీ, రాబోయే తరాలు తమ తాతముత్తాతలని ఎక్కడ పూడ్చిపెట్టారో కనీసం తెలుసుకుంటారు. అవి తమకు చెందినవేనని అర్థంచేసుకుంటే అదో తృప్తి, అంతే! మాలాంటి వాళ్ళంతా అంతే, ఎక్కడ పుట్టామో, ఎక్కడికి వెళుతున్నామో, మాకంటూ ఓ ఉనికీ, దానికో నిదర్శనమూ ఏదీ ఉండదు’ అన్నాడు మజీద్‌.
      ‘సరే, ఇక భోంచేద్దాం పద’ మనసుని తొలిచే ఈ అంశం నుండి మజీద్‌ దృష్టి మరల్చడానికి అజీజ్‌ అన్నాడు. కళ్ళద్దాలని సరిచేసుకుంటూ అజీజ్‌ తన భోజనాన్ని తీసుకొచ్చాడు.

రొట్టె, పెరుగు తెచ్చుకోవడానికి మజీద్‌ బైటికెళ్ళాడు. ప్రతిరోజూ అతను అలీబాబా బేకరీ వాళ్ళు వందమందికి చేసే దానంలో ఈ రొట్టె, పెరుగు తెచ్చుకుని భోంచేస్తుంటాడు. ఈజిప్టు దేశ కార్మికులు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, భారతీయులు ఎక్కువ భాగం ఈ అలీబాబా వారి ఔదార్యంతోనే జీవిస్తుంటారు. ప్రతిఒక్కరికీ వెచ్చని నాలుగు రొట్టెలు, ఓ సీసాడు పెరుగు.. దీనికోసం ఎంతోమంది క్యూ కడుతుంటారు.

అదేం పోషకాహారం కాకపోయినా ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతోంది మరి! ప్రత్యేకమైన రోజుల్లోనూ, రంజాన్‌ మాసంలోనూ అతను మసీదులో పెట్టే భోజనంతోనే గడిపేస్తుంటాడు. వీలైతే తన ఇంట్లోవారి కోసం ఓ ప్లాస్టిక్‌ సంచిలో అక్కడి నుండి భోజనపదార్థాలు తీసికెళుతుంటాడు. తన రొట్టె, పెరుగు తీసుకుని మజీద్‌ గబగబ అజీజ్‌ దుకాణానికి పరిగెట్టాడు. అక్కడ అజీజ్‌ తన కోసం ఎదురు చూస్తుంటాడు మరి!
      ప్రతిరోజూ తెల్లవారే అజీజ్‌ తన మధ్యాహ్న భోజనాన్ని వండుకుని తెచ్చుకుంటుంటాడు. ఎప్పుడైనా మాంసం వండుకున్నప్పుడు కాస్త ఎక్కువగానే వండి మజీద్‌ కోసం తెస్తుంటాడు. అజీజ్‌ తన డబ్బా మూత తెరిచేసరికి వంటకాల ఘుమఘుమలు షాపంతా అల్లుకున్నాయి. దాంతో ఇంటి గురించిన ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు మజీద్‌.

ఫరీదా కుట్లు అల్లికల్లో ఎంతో నిష్ణాతురాలు. అలా సంపాదించిన డబ్బుతో ఆమె మాంసమూ, ఎప్పుడైనా పిల్లలు జబ్బు పడినప్పుడు మందులకూ ఉపయోగిస్తుంటుంది. బాగా డబ్బున్న ఓ అరబ్బీ ఆవిడకు ఫరీదా చేసే ఎంబ్రాయిడరీ అంటే ఎంతో ఇష్టం. ఆమె ఫరీదాని తన కోసం మరిన్ని ఎంబ్రాయిడరీ పనులు చేసివ్వమని అడుగుతుంటుంది. తన చేతివేళ్లు నొప్పి పుట్టినా, కళ్ళకు శ్రమ కలిగినా సరే, వచ్చే ఈ కొద్దిపాటి ఆదాయాన్ని ఫరీదా వదులుకోదు.

పిల్లలు ఎలాగూ బడులకు వెళ్ళరు. వాళ్ళు ఇంట్లోనో, ఆ చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటారు. ఇంటిపనీ, ఎంబ్రాయిడరీ పనీ, పిల్లలని చూసుకోవడంతో ఆమెకు పొద్దు చాలదు. అయినా ఎంతో నేర్పుతో అన్నీ సంబాళించుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి ఆ ధనికురాలు పిల్లలకోసం పాలపొడి, పిండి.. జమీలా, సిరాజ్, ఒమర్‌లకు తన పిల్లల పాతబట్టలను కూడా ఇస్తుంటుంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళకదే కాస్త ఊరట కలిగించే విషయం.
      ‘మాంసం చాలా చక్కగా వండావు అజీజ్, కాస్త నా రొట్టె కూడా తీసుకో. దీంతో పాటే అది కూడా బాగుంటుంది’ అన్నాడు మజీద్‌.
‘అయితే ఈ అన్నాన్ని ఎవరు తింటారు? ఈసారి నీ రొట్టె కోసమే వస్తాన్లే’ చిన్నగా నవ్వాడు అజీజ్‌.
      వెన్నెల్లాంటి ఆ నవ్వును చూస్తూ మజీద్‌ ‘నిజమే, దేవుడున్నాడు’ అనుకున్నాడు.

ఆవేళ రాత్రి ప్రార్థనలయ్యాక రోజంతా జరిగిన సంఘటనలని గుర్తుచేసుకుంటూ మజీద్‌ ఫరీదాతో తమకిక మంచిరోజులు రానున్నాయని, భగవంతుడు తమ ప్రార్థనలని ఆలకించబోతున్నాడనీ ఎంతో ఆశగా చెప్పాడు. ఆ రాత్రి చీకటి దట్టంగా పరుచుకున్న ఆకాశంవైపు చూడసాగాడు మజీద్‌. గాలి ఈలలు వేస్తూ వచ్చి ఇసుక తిన్నెలపై వాలి అక్కడే ఆగిపోతోంది. ఒంటెలు వాళ్ళుంటున్న పరిసరాల్లో అటూ ఇటూ బద్ధకంగా తిరుగుతున్నాయి.

కిటికీ దగ్గరగా కూచుని అతను మనసారా ప్రార్థన చేసుకుని ఆకాశం వైపు చూశాడు. మేఘాలన్నీ దక్షిణం వైపు జరిగిపోవడంతో ఓ నక్షత్రం ఆ ప్రదేశాన తళుక్కుమంది. చంద్రుని చూసిన చకోరంలా అతని ఎద ఎగిసిపడింది. ఇంతకుముందు ఒకసారి అజీజ్‌ తన షాపులో సామాను ఉంచుకోవడానికి అనుమతినిచ్చినపుడు ఇలాగే.. ఓ తార నీలాకాశంలో తళుక్కుమంది! ఆశనిరాశల ఈ ఊగిసలాటలో తన కుటుంబాన్ని చంపేసి, తను కూడా ఆత్మహత్య చేసుకుందామనుకున్న రోజులవి.

తన పనిముట్లున్న సంచిని పట్టుకుని ఇల్లిల్లూ తిరిగినా ఫలితం లేకపోవడంతో నిరాశగా ఓ షాపు ముందు అలిసిపోయి కూచుంటే.. అప్పటికది అజీజ్‌దని తనకి తెలియదు. మధ్యాహ్నపు ఎండకు సోలిపోతుంటే అజీజ్‌ తనని లోనికి రమ్మని మంచినీళ్ళిచ్చి వివరాలు కనుక్కున్నాడు. అప్పటి నుండే తన జీవితం చిన్న మలుపు తిరిగింది మరి!

‘ఎందుకు నాన్నా నవ్వుతున్నారు?’ తండ్రితో పాటు ఆకాశంలోకి చూస్తూ అడిగాడు ఒమర్‌. తాము కూడా కళ్ళువిప్పార్చుకుని చూస్తూ తండ్రిని చుట్టుముట్టేశారు సిరాజ్, జమీలాలు. ఫరీదా భర్త వైపు చిరునవ్వుతో ఓసారి చూసి తన పనిలో పడిపోయింది. మజీద్‌ తన పిల్లల వైపు చూసి చిన్నగా నవ్వాడు. మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని అనుభవిస్తున్న అతను పిల్లలను దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. ఏదో శుభసూచకం అతని మనసుకి తోస్తోంది. కచ్చితంగా మంచిరోజు వస్తోంది!

      శుక్రవారం గాలిలో ఏదో మత్తు జల్లినట్టు తెల్లవారింది. ఎందుకనో ఆ వేళ ప్రార్థనలకు మసీదుకు వెళ్ళాలనిపించింది మజీద్‌ మనసుకి. మధ్యాహ్న ప్రార్థనలయ్యాక ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్లో ఎవరో బోర్లా పడి ఉండడం కనిపించిందతనికి. ఆ అబ్బాయిని తిప్పి చూసిన మజీద్‌ అతని ముఖం మీద రక్తపు చారికలు కనిపించేసరికి నివ్వెరపోయాడు. స్ప్పహ తప్పిన అతన్ని చేతుల్లోకి తీసుకుని దారేపోతున్న ఓ లారీని ఆపి దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

      క్యాజువాల్టీ వార్డులో ఆ అబ్బాయిని అప్పగించి, ఆతృతగా బైట నిలబడి ఎదురుచూడసాగాడు. ఎందుకనో తను ఇబ్బందుల్లో పడబోతానేమో అనిపించింది అతనికి. ఇక ఇంటికి వెళదాం అనుకున్నంతలో మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతున్న ఓ డాక్టర్‌ అతన్ని ఆగమని సైగ చేశాడు. గుండె దడ పుట్టి, ఏదో కడుపులో తిప్పుతున్న భావన అతనిలో! నొసలంతా చెమటలు పట్టి, కంఠం పొడిబారిపోయింది అతనికి.

ఇంతలో తళతళలాడే ఓ నల్లని జాగ్వార్‌ కారు ఆస్పత్రి ముందు ఆగింది. అందులోంచి కలవరపాటుతో మొహం ఉబ్బిపోయిన ఓ అరబ్‌ దిగాడు. ఆందోళనకు చిరునామాలా ఉన్నాడతను. పైబట్టని సర్దుకుంటూ, జారిపోతున్న నల్లని దుస్తులని సరిచేసుకుంటూ లోనికి అడుగుపెట్టాడు. శరీరం వణికిపోతుండగా అతను మజీద్‌ని దాటి క్యాజువాల్టీ వార్డులోపలికి వెళ్ళాడు. మనసు లోపల్లోపల తను ఏ తప్పూ చేయలేదని తెలిసినా, అతన్ని ఏదో తెలియని భయం ఆవరించింది.                శక్తినంతా కూడగట్టుకుని పారిపోదామనుకున్నంతలో, ఇంతకు ముందు మొబైల్‌ ఫోన్లో మాట్లాడిన డాక్టరూ, ఈ అరబ్బూ కలిసి బైటికొచ్చారు. కొంతసేపు వాళ్ళేం మాట్లాడుకున్నారో కానీ.. ఆ డాక్టరు మజీద్‌ వైపు చూపించడమూ, ఆ అరబ్బు అతన్ని దగ్గరికి రమ్మని సైగ చేయడమూ జరిగిపోయాయి. కాళ్ళు భూమిలో పాతుకుపోయినట్టయి మజీద్‌ కదల్లేకపోయాడు. ఇంతలో ఆ అరబ్బు అతని దగ్గరికొచ్చి కష్టంతో కరకుదేరిన మజీద్‌ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేనంతగా మజీద్‌ మనసు మొద్దుబారిపొయింది.

‘అల్లా హు అక్బర్‌! నువ్వు లేకపోతే మా అబ్బాయి రోడ్డు మీదే చచ్చిపోయుండేవాడు. ఆ దేవుడే నిన్ను పంపాడేమో! నీ పేరేంటి?’ వణుకుతున్న పెదాలతో అడిగాడా అరబ్బు.
   ‘మజీద్‌.’
‘ఏం చేస్తుంటావు?’
   ‘చెప్పులు కుడతాను.’
‘ఎక్కడుంటావు?’
   ‘పనార్లో, నేనో సంచారజాతివాడిని.’
క్షణంపాటు స్థాణువైన అరబ్బు మాటలకోసం వెతుక్కున్నాడు.
   ‘నీతోపాటు ఎవరెవరున్నారు?’
‘నా భార్య, ముగ్గురు పిల్లలు.’
    ‘వాళ్ళని తీసుకుని మా ఇంటికి వచ్చేయకూడదూ! నువ్వు మా ఇంట్లో తోటపని చేద్దూగానీ. మీ పిల్లల్ని చదివిస్తాను, నీ భార్యని కాస్త తేరుకోనీ!’
మజీద్‌ తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. ఉన్నట్టుండి అతనికి మిలమిల్లాడే ఆ నక్షత్రం గుర్తుకొచ్చింది. ఎంత కాకతాళీయం! దేవుడు తన కష్టాలని కడతేర్చ నిశ్చయించాడేమో! కన్నీళ్ళతో ముఖం తడిసిపోతుండగా మజీద్‌ మక్కా వైపుకు తిరిగి మోకరిల్లాడు.

ఒంటిగాడివైపోయావు, ఏం చేయగలవు! విచారిస్తున్న అజీజ్‌ని ఓదార్చాడు మజీద్‌. అసలు నువ్వు నా పట్ల చూపుతున్న మంచితనమే నాకెంత గొప్పగా ఉంటుందో తెలుసా! అల్లా నీకు స్వర్గంలో తప్పకుండా చోటు కల్పిస్తాడులే అజీజ్‌!
      చూడు మజీద్, యుద్ధమంటే కేవలం చెడ్డవాళ్ళు మాత్రమే మరణించరు. మంచివాళ్ళు కూడా కొంత బాధ పడాల్సి వస్తుంది. ఇక్కడ నేను చెప్పిందే నిజం కాకపోవచ్చు కానీ,లోకం తీరు 
అలాగే ఉంది మరి!
      ఆవేళ రాత్రి ప్రార్థనలయ్యాక రోజంతా జరిగిన సంఘటనలని గుర్తుచేసుకుంటూ మజీద్‌ ఫరీదాతో తమకిక మంచిరోజులు రానున్నాయని, భగవంతుడు తమ ప్రార్థనలని ఆలకించబోతున్నాడనీ ఎంతో ఆశగా చెప్పాడు. 

— మూల కథ : ది సైన్‌ (ఇంగ్లిష్‌)
రచయిత్రి :  స్నేహ సుసాన్‌ షిబు
తెలుగు అనువాదం: డాక్టర్‌ యు విష్ణుప్రియ.

ఇవి చదవండి: Inspirational Stories: పృథుచక్రవర్తికి అత్రి మహర్షి అనుగ్రహం!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement