ఎవరైనా కాస్త గడుసుగా మాట్లాడినా.. తర్కంతో ప్రశ్నించినా..‘పట్టా’ లేని ప్లీడరు అంటారు. బయట ప్రశ్నించడానికి, అవతలి వాళ్లను నిలదీయడానికి ‘పట్టా’ అక్కర్లేదు. కానీ కోర్టులో అలా కాదు, కోటుంటే సరిపోదు.. న్యాయవిద్య చదివుండాలి.. సెక్షన్లూ తెలిసుండాలి.
ఓ వ్యక్తి పట్టా లేకపోయినా కోర్టులో వాదించాడు. కేసులూ గెలిచాడు. చివరికి అతని బండారం బయటపడింది. గుట్టు రట్టయ్యింది. జీవితం జైలు పాలైంది. అయినా ‘తగ్గేదేలే ’ అంటూ కోర్టును అభ్యర్థించాడు. తన కేసును తనే వాదించు కున్నాడు. షరతులతో కూడిన బెయిల్ పొందాడు. అలాగని ఇది విజయ గాథ కాదు, తీసేయదగ్గదీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తెలుసుకోదగ్గ అంశంగా మారింది. కెన్యాలో ఈ ఉదంతం జరిగింది.
న్యాయవాదిగా కోర్టులో వాదించాలంటే ఏ దేశంలో అయినా న్యాయ విద్యను అభ్యసించాలి. సంబంధిత కౌన్సిల్‌లో పేరు నమోదు చేయించుకోవాలి..అప్పుడే అర్హత వస్తోంది. కెన్యాలో కూడా అంతే. న్యాయవాదుల నమోదును ‘లా సొసైటీ ఆఫ్ కెన్యా’ పర్యవేక్షిస్తోంది. ఇందులో పేర్లు నమోదు అయిన వారు మాత్రమే ప్లీడరుగా ప్రాక్టీసు చేయాలి. బ్రియాన్ మ్వెండా న్త్విగా అనే వ్యక్తి ‘లా సొసైటీ ఆఫ్ కెన్యా’లో అడ్వకేట్‌గా రిజిస్టర్ అయ్యాడు.
మోసానికి బీజం పడిందిక్కడే
బ్రియాన్ న్త్విగా వివరాలను బ్రియాన్ మ్వెండా న్జాగీ అనే వ్యక్తి టాంపర్ చేసి అక్కడ తన ఈమెయిల్ నమోదు చేశాడు, ఫొటో మార్చాడు. ఇలా పట్టా లేకుండానే ప్లీడర్ అయ్యాడు. లోయర్ కోర్టు నుంచి హయ్యర్ కోర్టుల వరకు కేసులు వాదించాడు. సుమారుగా 26 కేసుల్లో విజయం కూడా సాధించాడు. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రాక్టీసు కొనసాగించాడు.
ఎలా బయటపడింది
బ్రియాన్ మ్వెండా న్త్విగా ‘లా సొసైటీ ఆఫ్ కెన్యా’లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించగా ఓపెన్ కాలేదు. తన వివరాలు మారిపోయినట్టు గుర్తించి, లా సొసైటీ ఆఫ్ కెన్యాకు ఫిర్యాదు చేశాడు. అధికారులు దర్యాప్తు చేశారు. ఓ వ్యక్తి అక్రమంగా తన పేరును బ్రియాన్ న్త్విగా వివరాల్లో నమోదు చేసినట్టు గుర్తించారు.
కేసు నమోదు
అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. న కిలీ లాయరు జైలు కెళ్లాడు. కేసు విచారణ మొదలైంది. కోర్టును అభ్యర్థించి తన కేసు తనే వాదించుకోవడం సంచలనంగా మారింది. తన ‘నకిలీ’ అనుభవం అక్కరకు వచ్చింది. షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
భిన్నాభిప్రాయాలు
నకిలీ లాయర్‌కు కొందరు బాసటగా నిలిచారు. అతని తెలివితేటల్ని మెచ్చుకున్నారు. న్యాయ విద్య చదివితే మరింతగా రాణిస్తావని సలహా ఇచ్చారు. మరికొందరు.. ఇది ప్రమాదరకరమైందన్నారు. లాయర్ల రిజిస్ట్రేషన్‌లోని డొల్లతనాన్ని బయటపెట్టిందని విమర్శించారు. ఈ ఘటన కెన్యాలో న్యాయవ్యవస్థపై చర్చకు దారి తీసింది.. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది. గతంలో అతడు విజయం సాధించిన 26 కేసుల్లోనూ సాక్ష్యాలు బలంగా ఉండడంతో కోర్టులు వాటి పునఃసమీక్షకు అంగీకరించకపోవడం కొసమెరుపు.
-దిలీప్ మాదిరెడ్డి


