కార్తీక పౌర్ణమి
కార్తీకమాసమంతా పర్వదినాల పరంపరే అయినప్పటికీ ఈ మాసంలో కొన్ని పర్వాలు కన్నుల పండువగా జరుగుతాయి. అలాంటి వాటిలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్బంగా జ్వాలాతోరణ విశిష్టత ఏమిటి, ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం.
కార్తీక పౌర్ణమినాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అలా అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు. ఈ నిర్మాణంపై ఆవునెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పార్వతీ పరమేశ్వరులని పల్లకిలో అటూ ఇటూ మూడుసార్లు ఊరేగిస్తారు. అలా వారి ఊరేగింపు అనంతరం భక్తులు కూడా ఆ మంటల కింది నుంచి దూరి వెళ్తారు.
మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణముంది. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం, యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే శ్రీమన్నారాయణుని ప్రార్థించటం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి సర్వదేవతా కటాక్షం లభిస్తుందనీ, వారికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదనీ కార్తీక పురాణం చెబుతోంది. అందుకే భక్తులు తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు.
దీనివెనక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద స్వామివారి పల్లకి పక్కనే నడుస్తూ...‘‘నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా..’’ అని సంకల్పం చెప్పుకోవాలి. అనంతరం ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి – ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని.. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం...
లక్ష్మీనారాయణులను కూడా...
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శివుడితో పాటుగా లక్ష్మీనారాయణులను కూడా ఆరాధిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు వ్రతమాచరించి సత్యనారాయణ స్వామి వ్రత కథను వినాలి. సాయంకాలం ఆలయాల్లో లేదా రావిచెట్టు, తులసిచెట్టు ఈ మూడింట్లో ఎక్కడో ఒక చోట దీపం వెలిగించాలి.
కాశీలో దేవ దీపావళి
కాశీలో ఈ కార్తీక పున్నమినాడు దేవదీపావళీ రూపంలో వేడుకలు జరుగుతుంటాయి. ఆ రోజున కాశీలోని గంగా ఘాట్లలో లక్షలాది దీపాలు వెలిగిస్తారు. ఒకేసారి ఘాట్లలో దీపాల వరుసలు వెలిగినప్పుడు, మొత్తం నగరం దీపతోరణంలా కనిపిస్తుంది. ఈ కమనీయ దృశ్యాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి భక్తులు అసంఖ్యాకంగా వారణాసికి చేరుకుంటారు.
ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని వధించాడనీ, ఆ విజయాన్ని పురస్కరించుకుని దేవతలు కాశీలో దీపాలు వెలిగించి వేడుక చేసుకున్నార నీ, అప్పటినుండి ఈ పండుగ దేవ దీపావళిగా ప్రసిద్ధి చెందిందనీ స్థలపురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం గంగా హారతి చూడడం ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ఈ దివ్య వీక్షణం కోసం గంటల తరబడి భక్తులు ఘాట్లలో ఓపిగ్గా ఎదురు చూస్తారు. కార్తీక పౌర్ణమిని సిక్కులు గురునానక్ జయంతిగా జరుపుకుంటారు.
– డి.వి.ఆర్.


