అవధులు లేని దేవుని ప్రేమ | Explanation of Crucifixion of Jesus | Sakshi
Sakshi News home page

అవధులు లేని దేవుని ప్రేమ

Apr 3 2026 4:16 AM | Updated on Apr 3 2026 4:16 AM

Explanation of Crucifixion of Jesus

ఒక నీతిమంతుని మరణం నశించిపోయే మానవ జాతికి శుభం చేకూర్చింది. మరణానికి వారసులైన నరజాతికి యేసుక్రీస్తు రూపంలో గొప్ప విమోచకుడ్ని అందించింది. పాపపరిహారార్థ బలిగా, సజీవ యాగంగా దేవాదిదేవుడే సిలువపై తన విలువైన పరిశుద్ధ రక్తాన్ని ధారవోశాడు. మానవుల పట్ల తన అపార ప్రేమను తన బలి అర్పణ ద్వారా చాటుకున్నాడు.

ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తికి చివరికి రెండు తేదీలే మిగిలి పోతాయి. ఒకటి పుట్టుక రెండవది మరణ తేదీ. పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. అందులో ఎవ్వరికీ మినహాయింపు లేదు. ప్రపంచ అధినేత అయినా సరే, మారుమూల గ్రామంలో పుట్టిన సామాన్యుడైనా చావు ముందు తల వంచాల్సిందే. మరణం ముందు ఓడి పోవాల్సిందే. అందుకే మనిషికి చావంటే చచ్చేంత భయం. కొంతమంది బతకడానికి కావలసినంత ధైర్యం లేక చావును ఆశ్రయిస్తారు. అదీ శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకంటే మనకథ మరణంతో ఆగి పోదు. మనం చేసిన పాపాలకు ఆ తర్వాత రెండో మరణం కాచుకోని ఉంటుంది. మరణాన్ని తలపించే నిత్య నరకం. ఆ నరకం నుంచి తప్పించేందుకు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపి మన పాపాలకు విమోచన క్రయధనముగా అర్పించాడు.

పాపపరిహారార్థ బలిగా క్రీస్తు 
తన స్వరూపంలో తన పోలిక చొప్పున దేవుని చేత సృజించబడ్డ ఆదిమానవుడైన ఆదాము, అతని భార్యకు తమ ఇష్టం చొప్పున బతికే అవకాశం ఇచ్చాడు. దీన్ని ఆసరాగా తీసుకొని ఈ లోక అధిపతిగా పిలవబడ్డ దుష్టుడైన సాతాను వారిద్దరినీ మోసం చేసి దేవుని ఆజ్ఞను మీరేలా చేశాడు. పాపం చేసిన వారిద్దరూ పాపం ద్వారా వచ్చే జీతం మరణాన్ని కొని తెచ్చుకున్నారు. వారిలో ఉన్న ఆ పాపపు బీజం ఆ తర్వాత ప్రతి మనిషిలో కొనసాగుతూ వచ్చింది. ఆ పాపాన్ని తీసివేసుకోడానికి మనిషి చేయని ప్రయత్నం లేదు. ప్రధానంగా జంతువుల రక్తం బలి ఇవ్వడం ద్వారా దేవుని ప్రసన్నం చేసుకోవాలని చూసాడు. 

అయినా నరునిలో వున్న పాపబీజం అతని వెంటాడుతూనే ఉంది. పలు బలి అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు పాపము నుండి మానవులను వేరుచేయవని గ్రహించిన దేవుడు తన కుమారుని ఈ భూమిపైకి పంపి అతని బలి అర్పణ ద్వారా, పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా సమస్త మానవులకు ఆ పాపపు శాపాన్ని విడిపించి తిరిగి దేవునితో మొదటి మానవుడి ద్వారా విడిపోయిన ఆ సంబంధాన్ని పునరుద్ధరింప జేశాడు. అందుకు నీతిమంతుడైన యేసు అప్పటి రోమా పాలకులు, తన స్వజనమైన యూదా ప్రజల ద్వారా ఘోరమైన శ్రమలు సిలువ ద్వారా అనుభవించాల్సివచ్చింది. మానవుల పాపం కోసం పాపంగా చేయబడ్డాడు. సమస్త మానవ కోటి పాపభారాన్ని, శాపాన్ని తనపై మోశాడు. శిలువపై తన పవిత్ర రక్తాన్ని చిందించాడు.

క్రీస్తు ప్రశస్తమైన మాటలు
శిలువ మరణానికి ముందు క్రీస్తు యేసు భూమ్మీద పలికిన ప్రతి మాట జీవపు ఊటై అప్పుడు ఇప్పుడూ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూనే ఉంది. భూమి గతించినా నా మాటలు మాత్రం నిత్యం నిలిచి ఉంటాయని క్రీస్తు చె΄్పాడు. క్రీస్తు మరణ సమయంలో సిలువ మీద పలికిన 7 మాటలు ఈ శుభ శుక్రవారం ప్రపంచంలోని క్రైస్తవ విశ్వాసులందరూ ధ్యానిస్తారు. వాటిలో ముఖ్యంగా తనను క్రూరంగా హింసిస్తున్న సైనికులను, హేళన చేస్తున్న యూదా మతాధికారులు, ప్రజలను చూసి తండ్రీ వీరేమీ చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని కోరాడు. మానవుల పట్ల మితిలేని ప్రేమగల దేవుడు కాబట్టే ఇట్టి క్షమాపణగుణం కనబరిచాడు. 

కుడిచేతి వైపు సిలువ వేయబడిన దొంగ యేసును గమనిస్తూ ఆయన నిజమైన పాపుల రక్షకుడు, దేవుడని గ్రహించి యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొనవా అని అర్థించినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని అభయం ఇచ్చాడు. నిజంగా ఒకడు పరలోకం చేరాలంటే దేవుని నమ్మి రక్షణ పొంది బాప్తీస్మం తీసుకోవాలి. కానీ ఇదేమీ లేకుండా ఒక బందిపోటు దొంగకు అతని విశ్వాసం చొప్పున నేరుగా పరలోకం అనుగ్రహించాడు. రోదిస్తున్న తల్లిని చూచి తన ప్రియమైన శిష్యుడికి అమ్మ బాధ్యతలు అప్పగించాడు. సిలువ యాగం ద్వారా తాను భూలోకానికి వచ్చిన రక్షణ కార్యం పూర్తయిందని గ్రహించి తండ్రికి తన ఆత్మను అప్పగించి చివరకు సమాప్తమైనదని చెప్పి యేసు ప్రాణం విడిచాడు. యేసు చనిపోయాడో లేదో నిర్ధారించుకోడానికి ఒక సైనికుడు పక్కటెముకల్లో బల్లెంతో ΄÷డిచాడు. ఇదంతా గమనిస్తున్న కఠినమైన రోమా శతాధిపతి హృదయం కరిగిపోయింది. ఈయన నిజముగా దేవుని కుమారుడే అంటూ ప్రకటించాడు. 

యేసు చనిపోయిన వెంటనే కొన్ని అద్భుతాలు జరిగాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌ పేర్కొంది. ప్రసిద్ధ యెరూషలేము దేవాలయపు గర్భగుడిలో ఉండే పెద్ద తెర పైనుంచి క్రిందికి రెండుగా చీలిపోయిందని, ఆ ప్రాంతంలో భూమి కంపించిందని, బండలు బద్దలవడం, సమాధులు తెరవబడి మృతులైన పరిశుద్ధులు పట్టణములో ప్రవేశించి అనేకులకు కనపడ్డారని పేర్కొంది. 

క్రీస్తు కథ సిలువ మరణంతో ఆగిపోలేదు. చరిత్ర పుటల్లో మరణాన్ని జయించి మూడవ దినమున పునరుత్థానుడైన ఒకే వ్యక్తిగా పేర్కొనడం జరిగింది. అందుకే ఇప్పటికీ క్రీస్తు ఖాళీ సమాధి యెరూషలేములో మనకు దర్శనమిస్తుంది. సజీవుడైన క్రీస్తుకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిపోయింది. అందుకే అగస్టిన్‌ అనే భక్తుడు ’సిలువ దేవుని ప్రేమను ప్రకటించిన గొప్ప వేదిక’ అంటాడు.

– స్టెర్జి రాజన్‌ బందెల, సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement