తొలిసారిగా మానవ మెదడులో విజయవంతంగా చిప్‌ ఇంప్లాంటేషన్‌! | Sakshi
Sakshi News home page

తొలిసారిగా రోగి మెదడులో చిప్‌.. న్యూరాలింక్‌ సరికొత్త ఆవిష్కరణ

Published Tue, Jan 30 2024 12:18 PM

Elon Musks Startup Implants First Human Brain Chip - Sakshi

నేరుగా మ‌నుషుల మెద‌డులోకి చిప్‌ని ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌యోగాల‌కు టెస్లా అధినేత ఇలాన్ మ‌స్క్‌కు అనుమ‌తి ల‌భించిన సంగతి తెలిసిందే. మనిషి మెదడును నేరుగా కంప్యూటర్లతో లింక్ చేయడమే ఈ ప్ర‌యోగం ఉద్దేశం. అమెరికా ప్రభుత్వ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) నుంచి ఈ అనుమతి లభించడంతో ఈ సరికొత్త ఆవిష్కరణకు నాందిపలికింది ఇలాన్‌ మస్క్‌ స్టార్ట్‌ప్‌ కంపెనీ న్యూరాలింక్‌. తొలుత కోతుల మెద‌డులో ఈ చిప్ అమ‌ర్చి ప్ర‌యోగాలు చేయగా, అవి సత్ఫలితాలు ఇవ్వడంతో మానవులపై ప్రయోగాలకు సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఓ రోగి బ్రెయిన్‌లో న్యూరాలింక్‌ తొలిసారిగా వైర్‌లెస్‌ బ్రెయిన్‌ చిప్‌ని అమర్చింది.

ఈ విషయాన్ని ఇలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ వేదికగా మంగళవారం వెల్లడించారు. సదరు రోగి కూడా కోలుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ చిప్‌ ఇంప్లాంటేషన్‌ చిన్నపాటి సర్జరీ అమర్చుతారు . 'ఇన్వాసిస్‌' అనే సర్జరీ ద్వారా మెద​డులో ఐదు నాణేలతో పేర్చబడినట్లు ఉండే చిప్‌ని అమర్చినట్లు న్యూరాలింక్‌ పేర్కొంది. ఇది లింక్‌ అనే ఇంప్లాంట్‌ ద్వారా పనిచేస్తుంది. మస్క్‌ కంపెనీ చేస్తున్న ప్రయోగం సత్ఫలితాలిస్తే బ్రెయిన్‌ మెషిన్‌ లేదా బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ రీసెర్చ్‌లో గొప్ప పురోగతి లభించినట్లు అవుతుంది.

దీనివల్ల నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్లు, చేతులు చచ్చుబడ్డవారు తమ అవయవాలను కదిలించేందుకు ఈ ఆవిష్కరణ ఎంతగానో సాయపడుతుందని మస్క్‌ చెబుతున్నారు. అంతిమంగా ఈ ప్రయోగంతో 'మానవాతీత శక్తి'ని పొందగలుగుతాం. అంతేగాదు ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతమయ్యితే గనుక మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి తెరలేపినట్లు అవుతుంది.

మెదడులో చిప్‌ అమర్చేది ఇలా..

  • పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్‌1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. అందువల్ల సమీపంలోని కణజాలానికి నష్టం ఉండదు.
  • చిప్‌ను సురక్షితంగా, అత్యంత కచ్చితత్వంతో, చిన్నపాటి సర్జరీతో నేరుగా అమర్చేందుకు ప్రత్యేకంగా ఒక రోబోను 'న్యూరాలింక్‌' అభివృద్ధి చేసింది. 
  • చిప్‌లోని బ్యాటరీ వైర్‌లెస్‌ పద్ధతిలో ఛార్జి అవుతుంది. అందువల్ల దీన్ని ధరించినవారు సాధారణంగానే కనిపిస్తారు.
  • కంటికి చేసే లేసిక్‌ సర్జరీ తరహాలో భవిష్యత్‌లో చాలా సులువుగా, తక్కువ ఖర్చుతో బీసీఐ(బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ ఫేస్‌ చిప్‌)లను అమర్చే స్థాయికి పరిజ్ఞానాన్ని ఆధునికీకరించాలని మస్క్‌ భావిస్తున్నారు.
  • ఈ సాధనాన్ని మెదడుకు దూరంగా పెడితే సంకేతాలను కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యం కాదు. అందువల్లే పుర్రెలో అమర్చాల్సి వస్తోంది.

పనిచేసేది ఇలా..

  • ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి ఎన్‌1 చిప్‌కు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు.
  • ఇన్‌స్టాల్‌ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్‌ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమ్‌లుగా మారుస్తుంది.

కలిగే ప్రయోజనాలు..

న్యూరాలింక్‌ బీసీఐ చిప్‌ .. మానవులు, కంప్యూటర్ల అనుసంధానానికి బాటలు వేస్తుంది. ఆలోచనశక్తి ద్వారా.. తాకాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లను ఆపరేట్‌ చేసేందుకు  ఇది సాయపడుతుందని ఆ సంస్థ చెబుతోంది. భవిష్యత్‌లో ఈ సాధనంతో ఎన్నో అద్భుతాలను సాధించొచ్చని పేర్కొంది. 

  • నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వంటి వాటివల్ల కాళ్లు, చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను మెరుగుపరిచే వీలుంది. వీరు సులువుగా ఉపకరణాలను ఉపయోగించగలుగుతారు. దీర్ఘకాలంలో వీరి అవయవాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వీలుంది.
  • డిమెన్షియా, అల్జీమర్స్‌, పార్కిన్‌సన్స్‌ వ్యాధి, మానసిక సమస్యల చికిత్స కోసం వాడొచ్చు.
  • ఆలోచన శక్తి సాయంతో టెక్స్ట్‌ లేదా స్వర సందేశాలతో కమ్యూనికేషన్‌ సాగించడానికి, బొమ్మలు గీయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.
  • ఈ చిప్‌ సాయంతో హార్మోన్‌ స్థాయిని కూడా నియంత్రించొచ్చు. కుంగుబాటును దూరం చేసుకోవచ్చు.
  • అవసరమైన నైపుణ్యాలను మెదడులోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కంటి చూపును, వినికిడి పరిధిని పెంచుకోవచ్చు.
  • అంతేగాదు సుదీర్ఘ భవిష్యత్‌లో దీనివల్ల ‘మానవాతీత విషయగ్రహణ సామర్థ్యం’ (సూపర్‌ హ్యూమన్‌ కాగ్నిషన్‌) సాధించడమే తమ లక్ష్యమని మస్క్‌ చెబుతున్నారు. కృత్రిమ మేధపై పోరాటానికి ఇది అవసరమని స్పష్టంచేస్తున్నారు. అవసరమైతే ఏఐతో 'సురక్షిత సహజీవనం' చేయడానికీ ఇది సాయపడుతుందని కూడా చెబుతున్నారు.

(చదవండి: షుగర్‌ని ఎంతలా స్వాహ చేసేస్తున్నామో తెలుసా? ఎలాంటి చక్కెర్లు బెటర్‌?)

Advertisement
Advertisement