పద్దెనిమిదేళ్ల తర్వాత పరిహారం | EC Not Give Compensation Slain CRPF Jawans Wife In Kashmir | Sakshi
Sakshi News home page

కన్నీళ్లొచ్చాయి

Sep 19 2020 7:53 AM | Updated on Sep 19 2020 7:53 AM

EC Not Give Compensation Slain CRPF Jawans Wife In Kashmir - Sakshi

జమ్మూ కశ్మీర్‌ చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ హింసతో ముగిసిన ఎన్నికలు 2002 నాటివి. ఎవరు గెలిచారన్నది కూడా విషయం కానంతగా.. ‘ఇంత ప్రశాంతంగా కూడా పోలింగ్‌ జరుగుతుందా?!!’ అని ఇళ్లలో కూర్చుని, వీధుల్లో నిలబడి అప్పట్లో అంతా ముక్కు మీద వేలు తీసి మాట్లాడుకున్నారు. చెదురుమదురుగా కొన్ని ఘటనలు ఉన్నా అవి ఎవరి దృష్టికీ వెళ్లలేదు. వాటిల్లోని ఒక ‘చెదురుమదురు’ మాత్రం ప్రమీలాదేవి జీవితాన్ని దుఃఖపు ఉప్పెనై అల్లకల్లోలం చేసింది. ఆమె భర్త రమేష్‌ సి.ఆర్‌.పి.ఎఫ్‌. జవాన్‌. ఎలక్షన్‌ డ్యూటీలో ఉండగా.. ‘ఓటు వేస్తే చంపేస్తాం’ అంటూ తుపాకులతో తిరుగుతూ పౌరులను బెదిరిస్తున్న వాళ్లకు ఎదురెళ్లి బులెట్లకు బలైపోయాడు. అతడి డ్యూటీ అతడు చేస్తూ, డ్యూటీ చెయ్యడానికి పోరాడుతూ చనిపోయాడు. ఎలక్షన్‌ కమిషనే ఇంతకాలంగా తన మాట నిలబెట్టుకోలేదు. రమేష్‌ భార్యకు పరిహారంగా ప్రకటించిన డబ్బును ఇంతవరకు ఇవ్వలేదు. కశ్మీర్‌లో మరో నాలుగు ఎన్నికలు గడిచిపోయియినా, ప్రమీలాదేవి కుటుంబానికి నేటికీ పూట గడవని స్థితే!! ఈ ఆగస్టులో మళ్లీ ఒకసారి ఎలక్షన్‌ కమిషన్‌కి లెటర్‌ పెట్టుకుంది. రావడానికైతే కమిషనర్‌ నుంచి జవాబు వచ్చింది! మొదట ‘సారీ’ చెప్పారు ఆయన.

తర్వాత.. ‘మా తప్పును సవరించుకుంటాం. మరికొంచెం సమయం ఇవ్వండి’ అని అభ్యర్ధించారు. ప్రమీలాదేవికి అర్ధం అయిపోయింది. ఇక ఎప్పటికీ వాళ్లు ఇస్తానన్న డబ్బు రానట్లేనని. 10వ తారీఖున లెటర్‌ మెయిల్‌ చేస్తే 26వ తేదీ వరకు బదులు ఇవ్వని వారు ఇంటికి చెక్కు పంపిస్తారా! పంపించలేదు కానీ, బ్యాంక్‌ నుంచి ప్రమీలా దేవికి సెప్టెంబర్‌ మొదటి వారంలో ఫోన్‌ వచ్చింది. ‘మీ అకౌంట్‌లో 20 లక్షలు పడ్డాయి. ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి వచ్చాయి. మీకు తెలియజేస్తున్నాం’ అని బ్యాంకు మేనేజరే స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారు. అప్పుడొచ్చాయి ప్రమీలాదేవికి కన్నీళ్లు. ఎలాగొచ్చాయంటే భర్త జ్ఞాపకాలను అవి ఏకధారగా తడిపేస్తున్నాయి. అకౌంట్‌లో పడింది వంద రూపాయలే అయినా ఆమె అదేవిధంగా ఉక్కిరిబిక్కిరి అయి ఉండేది. అది తన భర్త డబ్బు. తన భర్త ఇంటికి రాలేక ఎవరి చేతికో ఇచ్చి తనకు చేర్చమని పంపిన డబ్బు. నిజానికి ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి ఆమెకు రావలసింది ఐదు లక్షలే. ఉపశమన పరిహారంగా కొత్త కమిషనర్‌ సునీల్‌ అరోరా ఆమెకు ఇరవై లక్షలు చెల్లించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement