Chintala Posavva: దివ్య సంకల్పం

Chintala Posavva: Preparation of Gomaya Ganapati products - Sakshi

జీవితానికి పరీక్షలు అందరికీ ఉంటాయి. బతుకు పరీక్షాపత్రం అందరికీ ఒకలా ఉండదు. ప్రతి ఒక్కరికీ ఒక్కో పత్రాన్ని నిర్దేశిస్తుంది ఎవరి పరీక్ష వారిదే... ఎవరి ఉత్తీర్ణత వారిదే. ఆ పరీక్షలో పోశవ్వకి నూటికి నూరు మార్కులు. తన ఉత్తీర్ణతే కాదు... తనలాంటి వారి ఉత్తీర్ణత కోసం... ఆమె నిర్విరామంగా సాగిస్తున్న దివ్యమైన సేవ ఇది.

‘ఒకటే జననం... ఒకటే మరణం. ఒకటే గమనం... ఒకటే గమ్యం’ చింతల పోశవ్వ కోసం ఫోన్‌ చేస్తే ఆమె రింగ్‌టోన్‌ ఆమె జీవితలక్ష్యం ఎంత ఉన్నతంగా ఉందో చెబుతుంది. తెలంగాణ, కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివసించే పోశవ్వ ఓ ధీర. జీవితం విసిరిన చాలెంజ్‌ని స్వీకరించింది. ‘అష్టావక్రుడు ఎనిమిది అవకరాలతో ఉండి కూడా ఏ మాత్రం ఆత్మస్థయిర్యం కోల్పోలేదు.

పైగా రాజ్యాన్ని ఏలే చక్రవర్తికి గురువయ్యాడు. నాకున్నది ఒక్క వైకల్యమే. నేనెందుకు అనుకున్నది సాధించలేను’ అనుకుంది. ఇప్పుడామె తన కాళ్ల మీద తాను నిలబడడమే కాక, తనలాంటి వాళ్లకు ఉపాధికల్పిస్తోంది. పోరాటం చేస్తున్న వాళ్లకు ఆసరా అవుతోంది. తన జీవితాన్ని సమాజహితానికి అంకితం చేయాలనే సంకల్పంతో పని చేస్తున్న పోశవ్వ సాక్షితో తన జీవనగమనాన్ని పంచుకున్నది.

నాన్న వైద్యం... నానమ్మ మొక్కు!
‘‘విధి నిర్ణయాన్ని మార్చలేమనుకుంటాను. ఎందుకంటే మా నాన్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ అయి ఉండీ నేను పోలియో బారిన పడ్డాను. ఆ తర్వాత నాన్న ఆయుర్వేద వైద్యం నేర్చుకుని నాకు వైద్యం చేశారు. నానమ్మ నన్ను గ్రామ దేవత పోచమ్మ ఒడిలో పెట్టి ‘నీ పేరే పెట్టుకుంటా, బిడ్డను బాగు చేయ’మని మొక్కింది. మెడ కింద అచేతనంగా ఉండిపోయిన నాకు ఒక కాలు మినహా మిగిలిన దేహమంతా బాగయిపోయింది. కష్టంగానైనా నాకు నేనుగా నడవగలుగుతున్నాను.

నాకు జీవితంలో ఒకరి మీద ఆధారపడే పరిస్థితి రాకూడదని ఎం.ఏ., బీఈడీ చదివించారు.  చదువు పూర్తయిన తర్వాత మహాత్మాగాంధీ నేషనల్‌ రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ స్కీమ్‌లో అడిషనల్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఎక్కువ కాలం చేయలేదు. ఫీల్డు మీదకు వెళ్లాల్సిన ఉద్యోగం అది. నేను పనిని పరిశీలించడానికి పని జరిగే ప్రదేశానికి వెళ్లి తీరాలి.

నేను వెళ్లడానికి సిద్ధమైనప్పటికీ కొన్ని చోట్లకు మామూలు మనుషులు వెళ్లడం కూడా కష్టమే. ఇతర అధికారులు, ఉద్యోగులు ‘మీరు రాకపోయినా ఫర్వాలేదు’ అంటారు. అయినా ఏదో అసంతృప్తి. ఉద్యోగాన్ని అలా చేయడం నాకు నచ్చలేదు. నెలకు ముప్ఫై వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాను. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో సర్ఫ్, ఫినాయిల్, ఫ్లోర్‌ క్లీనర్, సబీనా తయారీలో శిక్షణ, చిన్న ఇండస్ట్రీతో బతుకు పుస్తకంలో కొత్త పాఠం మొదలైంది.  

కోవిడ్‌తో కొత్త మలుపు
నేను మార్కెట్‌లో నిలదొక్కుకునే లోపే కోవిడ్‌ వచ్చింది. మా ఉత్పత్తులు అలాగే ఉండిపోయాయి. దాంతోపాటు వాటి ఉత్పత్తి సమయంలో ఎదురైన సమస్యలు కూడా నన్ను పునరాలోచనలో పడేశాయి. క్లీనింగ్‌ మెటీరియల్‌ తయారీలో నీటి వృథా ఎక్కువ, అలాగే అవి జారుడు గుణం కలిగి ఉంటాయి కాబట్టి పని చేసేటప్పుడు దివ్యాంగులకు ప్రమాదాలు పొంచి ఉన్నట్లే. అందుకే నీటితో పని లేకుండా తయారు చేసే ఉత్పత్తుల వైపు కొత్త మలుపు తీసుకున్నాను. అవే ఎకో ఫ్రెండ్లీ రాఖీలు. ఆ ప్రయత్నం నేను ఊహించనంతగా విజయవంతం అయింది. ఆ తర్వాత గోమయ గణపతి నుంచి ఇప్పుడు పదకొండు రకాల ఉత్పత్తులను చేస్తున్నాం. అందరూ దివ్యాంగులే. ఇక మీదట ఒంటరి మహిళలకు కూడా అవకాశం కల్పించాలనుకుంటున్నాను.  

కన్యాదాతనయ్యాను!
మా జిల్లాలో ఎవరికి వీల్‌ చైర్‌ కావాలన్నా, ట్రై సైకిల్, వినికిడి సాధనాలు, పెన్షన్‌ అందకపోవడం వంటి సమస్యల గురించి నాకే ఫోన్‌ చేస్తారు. ఎన్‌జీవోలు, డీఆర్‌డీఏ అధికారులను సంప్రదించి ఆ పనులు జరిగేటట్లు చూస్తున్నాను. దివ్యాంగులకు, మామూలు వాళ్లకు కలిపి మొత్తం పన్నెండు జంటలకు పెళ్లిళ్లు చేశాను. వాళ్లలో ఇద్దరికి మాత్రం అమ్మాయి తరఫున పెళ్లి పెద్ద బాధ్యత వహించాల్సి వచ్చింది. నాకు అమ్మాయిల్లేరు, ముగ్గరబ్బాయిలు. ఈ రకంగా అవకాశం వచ్చిందని సంతోషించాను.  
 
సంకల్పం గొప్పది!
నేను నా ట్రస్ట్‌ ద్వారా సమాజానికి అందించిన సహాయం ఎంతో గొప్ప అని చెప్పను. ఎంతో మంది ఇంకా విస్తృతంగా చేస్తున్నారు. కానీ నాకు ఉన్నంతలో నేను చేయగలుగుతున్నాను. నా లక్ష్యం గొప్పదని మాత్రం ధీమాగా చెప్పగలను. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. నాకు గత ఏడాది మహిళాదినోత్సవం సందర్భంగా సత్కరించింది. నా కుటుంబ పోషణకు నా భర్త ఉద్యోగం ఉంది. నా దివ్యహస్తం ట్రస్ట్‌ ద్వారా చేస్తున్న సర్వీస్‌ అంతా పర్యావరణ పరిరక్షణ, సమాజహితం, దివ్యాంగుల ప్రయోజనం కోసమే’’ అన్నారు. ‘ఉన్నది ఒకటే జననం... అంటూ... గెలుపు పొందే వరకు... అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు... గెలుపు కొరకే బతుకు’ అనేదే ఆమె తొలిమాట... మలిమాట కూడా.

ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది.

– వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top