
ఎడారి మొక్క బ్రహ్మజెముడు (కాక్టస్) రసంతో పర్యావరణ హితమైన ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసే టెక్నాలజీని మెక్సికన్ మహిళా ప్రొఫెసర్ సాండ్రా పాస్కో ఓర్టిజ్ అభివృద్ధి చేశారు. ఒక ప్రయివేటు యూనివర్సిటీలో ఆమె కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ పనితీరులో అచ్చం పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్‌ను పోలి ఉంటుంది. సాధారణ ప్లాస్టిక్ సీసాలు 450 ఏళ్లు, ప్లాస్టిక్ కవర్లు వెయ్యి ఏళ్లకు గాని భూమిలో కలిసిపోవు. కానీ, బ్రహ్మజెముడు ప్లాస్టిక్ నెల రోజుల్లోనే విచ్ఛిన్నమై మట్టిలో కలిసిపోతుంది.
పర్యావరణ కాలుష్యంతో పాటు మైక్రోప్లాస్టిక్ కణాలు మన దేహాలను సైతం కలుషితం చేస్తున్న ఈ తరుణంలో వెలువడిన ఈ ఆవిష్కరణ ఒక విప్లవాత్మక పురోగతిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. డాక్టర్ సాండ్రా పాస్కో ఓర్టిజ్ చాలా మంది అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు.
బ్రహ్మజెముడు రసం నుంచి తయారు చేసిన ఈ ప్లాస్టిక్ పూర్తిగా బయోడిగ్రేడబుల్. విషపూరితమైనది కాదు. తినదగినంత సురక్షితం! కఠినమైన ఎడారి పరిస్థితుల్లో తక్కువ వనరులతో పెరుగుతున్న బ్రహ్మజెముడు, సాధారణ నోపాల్ కాక్టస్ (ప్రిక్లీ పియర్)ను ఉపయోగించి, ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్యాకేజింగ్, తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే వినూత్న ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేశారు.
ఇదీ చదవండి: Moon-Rice వ్యోమగాముల కోసం.. మూన్‌రైస్..భూమ్మీదా ఉపయోగమే

బ్రహ్మజెముడు రసంలోని సహజ చక్కెరలు, పెక్టిన్,
సేంద్రియ ఆమ్లాల ఆధారంగా ఈ ప్లాస్టిక్ తయారవుతుంది. ప్రయోగశాలలో ఉత్పత్తి ప్రక్రియకు దాదాపు 10 రోజులు పడుతుంది. ఈ పురోగతి ఆహార ప్యాకేజింగ్, షాపింగ్ బ్యాగులు, లెక్కలేనన్ని ఇతర సింగిల్–యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీని సమూలంగా మార్చగలదు. వర్షాధార వ్యవసాయదారుల ఆదాయం పెంపొందించేందుకు ఈ ఆవిష్కరణ దోహదపడు తుందని నిపుణులు చెబుతున్నారు.
చదవండి: Tipeshwar అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి!