ఆంతరంగిక శుద్ధి

Borra Govardhan Article On Inner Cleansing - Sakshi

ధమ్మపథం

మనిషికి బాహ్య అంగాల శుద్ధి కంటే ఆంతరంగిక శుద్ధి అవసరం అంటుంది బౌద్ధం. ఈ మనోశుద్ధి వల్ల మనస్సు మలిన రహితం అవుతుంది. తేటదనం ఉట్టిపడుతుంది. 
శారీరక శుద్ధి కంటే మనోశుద్ధే మేలు. మనో వాక్కాయ కర్మల్లో మనో శుద్ధి ఉంటే వాక్కులూ చేసే పనులూ, వాటంతట అవే శుద్ధి అయిపోతాయి. అందుకే అన్నింటికీ అగ్రగామి మనసే’’ అంటుంది ధమ్మపదం.
ఎంత విన్నా, ఎంత చదివినా హీనబుద్ధి గలవాడు తమగుణం మానలేడు అంటారు. దేహాన్ని ఎంత శుద్ధిగా ఉంచుకున్నా అవగుణం ఉన్నవాడికి ఒక్కసారి కాకపోతే ఎప్పుడో ఒక్కసారైనా దేహశుద్ధి తప్పదు. 
మనోశుద్ధి ఉంటే వారు మణిలా జీవితాంతం రాణిస్తారు. కానీ శారీరక శుద్ధి వల్ల పాపాలు పోయి పుణ్యం వచ్చిపడుతుంది అని నమ్మే పండితుడు చివాట్లు తిన్న కథ ఇది. 
మగధ దేశంలో మల్లిక అనే ఒక దాసి ఉండేది. ఆమె ఎంతో అందగత్తె. నిండు యవ్వనంలో ఉన్నా నిలకడ గల మగువ. ఒకరోజు తెల్లవారు జామునే నీటికోసం నదికి పోయింది. మంచు పట్టి ఉంది. చలి వణికిస్తోంది. ఆమె నదీతీరం చేరి అక్కడ నదిలోకి కట్టి ఉన్న మెట్ల మీద నుండి దిగింది. అప్పటికే అక్కడ ఒక పండితుడు నీటిలో స్నానం చేస్తూ ఉన్నాడు. బుడింగిన మునిగి పైకి లేచాడు. ఎదురుగా మల్లిక కనిపించింది. ఆమె అప్పటికే నీరు ముంచుకుని కడవ నడుమున పెట్టింది. 
ఆ క్షణంలో ఆమె అందాన్ని, వయ్యారాన్ని చూసి, పండితుని మనస్సు చలించింది. అలాగే నిలబడి చలికి వణుకుతూ ఆమె వంకే చూస్తుండిపోయాడు. అతని వాలకం మల్లిక పసిగట్టి–
‘‘అయ్యా నేను దాసిని. ఈ తెల్లవారు వేళ నీటికోసం ఈ నదికి రాక తప్పదు. చలి బాధను భరించకా తప్పదు. కానీ, మీరు దాసులు కారే? తమరెందుకు ఈ వేళ ఇక్కడికి వచ్చారు? ఈ నీట్లో దిగి ఇలా వడ వడ వణికిపోతున్నారు?’’ అని అడిగింది.  
‘‘మల్లీ! నీకు ఆమాత్రం తెలియదా? ఈ జలం పవిత్రమైనది. దీనిలో స్నానం చేస్తే ఎప్పటి పాపాలు అప్పుడు కొట్టుకుపోతాయి. ఈ నీట్లో దిగి మూడు మునకలు వేస్తే సరి. చేసిన దోషాలన్నీ హరించుకుపోయి, పుణ్యం పోగుపడుతుంది. ఆ మాత్రం తెలియని అజ్ఞానివి’’ అంటూ మునిగి లేచాడు.
మల్లిక నడుమున ఉన్న నీటి కడవను సరిచేసుకుని –
‘‘అయ్యా! నిజమా! నీటిలో మునిగితేనే పాపాలు హరించుకుపోతాయా?’’ అంది అమాయకంగా!
‘‘అవును మల్లికా! ఇది శాస్త్రం’’ అన్నాడు.
‘‘అయితే స్వామీ! మీ కంటే ఎప్పుడూ ఈ నీటిలోనే ఉండే కప్పలు, చేపలు, పీతలు, జలగలు ఎంతో పుణ్యశాలురన్నమాట. మూడు మునకలకే మీకు పుణ్యం పోగుపడితే.. నిరంతరం మునకలేసే అవి ఎంతటి పుణ్యాన్ని పోగుపెట్టుకుని ఉంటాయి? అవును లెండీ, మీకంటే కప్పలే గొప్ప’’ అంటూ నవ్వుతూ మెట్లెక్కి వెళ్ళిపోయింది. 
తనకు చిత్తశుద్ధి లేదని తెలియ చెప్పడానికే మల్లి అలా వ్యంగ్యంగా మాట్లాడిందని పండితుడు గ్రహించాడు. శారీరక శుద్ధి కంటే ఆంతరంగిక శుద్ధే గౌరవాన్ని తెచ్చిపెడుతుందని తెలుసుకున్నాడు. 
  ఆంతరంగిక శుద్ధి జరగాలంటే బుద్ధుని బోధనలే శరణు అని బుద్ధుణ్ణి శరణు వేడాడు. ఆ తరువాత గొప్ప పండితునిగా... శీలవంతునిగా కీర్తిగాంచాడు. 
– డా. బొర్రా గోవర్ధన్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top