సహజ సిద్ధమైన యూత్‌ప్యాక్స్‌

Beauty Tips - Sakshi

పార్టీలు, వేడుకలకు వెళ్లాలనుకొన్నప్పడు ముఖానికి తక్షణ నిగారింపు రావడం కోసం రకరకాల ఫేస్‌ప్యాక్‌లు ఉపయోగిస్తుంటారు. అయితే ఒక్కోసారి అవి అందుబాటులో ఉండవు. ఉన్నా, చర్మానికి పడవు. అలాంటప్పుడు... సహజసిద్ధమైన ఈ ఫేస్‌ప్యాక్స్‌ ప్రయత్నించండి. ఇవి మీ చర్మానికి తగిన పోషణను ఇవ్వడంతో పాటు యవ్వన కాంతినిస్తాయి. 

చందనం, రోజ్‌ వాటర్‌ 
చందనం ముఖం పై ఉన్న మృతకణాలను తొలగించి చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. రోజ్‌వాటర్‌ చర్మానికి మెరుపునందిస్తుంది. వేసవిలో ఈప్యాక్‌ వేసుకోవడం ద్వారా సూర్యరశ్మి ప్రభావానికి గురైన చర్మానికి ఉపశమనం దొరుకుతుంది. ఇందుకోసం...
 గంధపు చెక్కను రోజ్‌ వాటర్‌తో అరగదీసి.. ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. మీ దగ్గర గంధపు చెక్క లేకపోతే.. దానికి బదులుగా గంధపు పొడిని ఉపయోగించవచ్చు. గంధం పొడిలో సరిపడినంత రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకొంటే సరిపోతుంది.

ఓట్‌ మీల్‌తో...
ఓట్‌మీల్‌ సహజసిద్ధమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు, ఇతర పోషకాలు చర్మానికి మెరుపునిస్తాయి. ఓట్‌ మీల్‌ సహజసిద్ధమైన క్లెన్సర్‌గా పనిచేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. రెండు టేబుల్‌స్పూన్ల ఓట్‌ మీల్‌లో టీస్పూన్‌ చందనం పొడి వేసి సరిపడినంత రోజ్‌ వాటర్‌ కలిపి పేస్టులా  తయారు చేయాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు చల్లుకుంటూ మసాజ్‌ చేసుకొంటున్నట్టుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top