ఆమె... అతని హు‘షారు’ | BabaSaheb My life With Ambedkar by Savita Ambedkar is an insightful biography | Sakshi
Sakshi News home page

ఆమె... అతని హు‘షారు’

Apr 14 2026 12:32 AM | Updated on Apr 14 2026 12:32 AM

BabaSaheb My life With Ambedkar by Savita Ambedkar is an insightful biography

నేడు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి

దేశవిదేశాల పుస్తకాలు చదువుకున్న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సమాజాన్ని అంతకంటే లోతుగా చదువుకున్నారు. ఆ మహా మేధావి హృదయాన్ని చదివిన సవితా అంబేడ్కర్‌ ‘మై లైఫ్‌విత్‌ డా.అంబ్కేడర్‌’ పుస్తకం రాశారు. బాబా సాహెబ్‌ ఆమెను ప్రేమగా ‘షారు’ అని పిలుచుకునేవారు. భారత రాజ్యాంగ పితామహుడిని,  ప్రపంచ మేధావులలో ఒకరైన అంబేడ్కర్‌ వ్యక్తిగత జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరించే పుస్తకం... మై లైఫ్‌ విత్‌ డా.అంబేడ్కర్‌...

అంబేడ్కర్‌తో తన వివాహం గురించి ‘మై లైఫ్‌ విత్‌ డా.అంబేడ్కర్‌’లో ఇలా రాశారు సవిత...
‘‘డా.అంబేడ్కర్‌ను చూసి నేను పూర్తిగా ముగ్ధురాలైనప్పటికీ, ఆయనపై నాకు అపారమైన గౌరవం ఉన్నప్పటికీ, ఆయనకు భార్య కావాలనే కోరిక మాత్రం నాకు కచ్చితంగా లేదు. రోజంతా డాక్టర్‌ అంబేడ్కర్‌ లేఖ గురించి, ఆయన వివాహ ప్రతిపాదన గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. నాలో గందరగోళపు తుఫాను చెలరేగింది. 

ముస్సోరీలో డా. అంబేడ్కర్, సవితా అంబేడ్కర్‌ 

అంతటి మహనీయుడి ప్రతిపాదనను ఎలా కాదనగలను? అవునని ఎలా చెప్పగలను?
నేను అంగీకరించడానికి కారణం ఒక్కటే. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ బాబా సాహెబ్‌ ఆరోగ్యం మెరుగుపడాలి. నేను డాక్టర్‌ బాబా సాహెబ్‌ జీవితంలో ఏకమై ఆయనలో లీనమైపోవాలని గట్టిగా సంకల్పించుకున్నాను’’

గృహజీవిత విశేషాలు...
బాబా సాహెబ్‌కు సవిత అంటే ఎంతో ఇష్టం. ఆమెకు బహుమతులు పంపించేవారు. ప్రేమలేఖలు రాశారు. ‘షారు’ అని ప్రేమగా పిలుచుకునేవారు. 1948లో వారి వివాహం తర్వాత సవితా అంబేడ్కర్‌ అయిన శారద నిరంతరం అపారమైన భక్తి శ్రద్ధలతో బాబా సాహెబ్‌కు సేవ చేయడం ప్రారంభించారు. ఆమె పుట్టింటి పేరు శారదా కబీర్‌. వారి గృహజీవితంలోని కొన్ని విశేషాలు అంబేడ్కర్‌లోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తాయి. ప్రేమతో వండిన ఇంటి భోజనాన్ని ఆస్వాదించేవారు. చమత్కారాలతో, పిట్ట కథలతో సన్నిహితులను నవ్వించేవారు బాబాసాహెబ్‌.

ముంబైలో జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో... అక్కడ కేవలం రెండు కుర్చీలు మాత్రమే ఉండడంతో 85 ఏళ్ల రావు బహదూర్‌ బోలేను తన ఒడిలో కూర్చోమని ఆహ్వానించారు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌. 

అంబేడ్కర్‌గా జీవిస్తాను... అంబేడ్కర్‌గా మరణిస్తాను
భార్యతో కలిసి టీ తాగుతూ బౌద్ధమతంపై లోతైన చర్చలు జరిపేవారు అంబేడ్కర్‌. దళితుల దుస్థితిని చూసినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకునేవారు. తను, తన భార్య ఆకలితో పడుకోవలసి వచ్చినా సరే, ఇంట్లోని ఆహార నిల్వలన్నిటినీ తన పేద అతిథులకు పంచి పెట్టడానికి ఎంత మాత్రం వెనకాడేవారు కాదు. జవహార్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వంలో మంత్రి అయిన తరువాత కూడా దళితులు, మహిళల కోసం భారతదేశాన్ని మరింత సమానత్వం కలిగిన దేశంగా మార్చాలనే తన ప్రయత్నంలో ఆయన వ్యతిరేకత ఎదుర్కొంటూనే ఉన్నారు. 

డా. అంబేడ్కర్, సవితా అంబేడ్కర్‌ నాగ్‌పూర్‌లో బౌద్ధమత దీక్ష చేపట్టిన దృశ్యం 

లోక్‌సభకు జరిగిన రెండు ఎన్నికలలో అంబేడ్కర్‌ ఓడిపోయారు. ‘కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు వ్యతిరేకంగా చేసిన రాజకీయ కుతంత్రాల ఫలితమే ఇది’ అని సవిత అభి్రపాయపడ్డారు. బాబా సాహెబ్‌కు సవితపై ఉన్న ప్రేమ, తన జీవితంలో ఆమె పాత్ర, ఈ దంపతుల మేధోపరమైన అనుకూలతలు, బౌద్ధమతంలోకి మారాలనే వారి ఉమ్మడి నిర్ణయం...ఇలా ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి ‘మై లైఫ్‌ విత్‌ డా.అంబేడ్కర్‌’ ఉపకరిస్తుంది. ‘నేను అంబేడ్కర్‌గా జీవిస్తాను. అంబేడ్కర్‌గానే మరణిస్తాను’ అని పుస్తకం చివర్లో రాశారు సవితా అంబేడ్కర్‌.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement