జయమ్మ విజయం.. కట్టె గానుగ ద్వారా తీసిన నూనె విదేశాలకు..

Arogya Dayini Kotla Jayamma about Cold Pressed Groundnut Oil  - Sakshi

‘‘ఒక చోటే ఉంటున్నాం. చేసిన పనే చేస్తున్నాం. ఎదుగూ బొదుగు లేకుండా.. గానుగెద్దు జీవితంలా గడిపేస్తున్నాం..’’ అని చాలా మందిలో ఒక అసంతృప్తి ఉంటుంది.   ఆరుపదుల వయసు దాటిన జయమ్మ   జీవితంకూడా గతంలో ఇదే విధంగా ఉండేది.   కానీ, గానుగ చక్రం పట్టుకొని ఆరుపదుల వయసులో విజయం వైపుగా అడుగులు వేస్తోంది జయమ్మ.

చదువు లేకపోయినా, వయసు కుదరకపోయినా నవతరానికీ స్ఫూర్తిగా నిలుస్తున్న కోట్ల జయమ్మ స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా, గండీడ్‌ మండలం, జక్లపల్లి గ్రామం. గానుగ నూనె వ్యాపారాన్ని అంచెలంచెలుగా వృద్ధి చేస్తూ తనతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తుంది. ఆరోగ్యదాయిని పేరుతో ప్రాచీనకాలం గానుగ నూనె ప్రాచుర్యాన్ని ఎల్లలు దాటేలా చేస్తోంది. జయమ్మది వ్యసాయ కుటుంబం. భర్త పిల్లలతో కలిసి పొలం పనులు చేసుకోవడంతో పాటు పాల ఉత్పత్తిని కొనసాగించేది. జయమ్మ నాలుగేళ్ల క్రితం రొమ్ము క్యాన్సర్‌బారిన పడింది. జబ్బు నుండి కోలుకునే క్రమంలో తనకు కలిగిన ఆలోచనను అమలులో పెట్టిన విధానం గురించి జయమ్మ ఇలా చెబుతుంది..  

‘‘పట్నంలో క్యాన్సర్‌కి చికిత్స చేయించుకున్నాను. డాక్టర్లు పదిసార్లు్ల కీమోథెరఫీ చేయాలన్నారు. ఈ సమయంలో ఓ డాక్టర్‌ గానుగ నూనె వాడమని, ఆహారంలో మార్పులు కూడా చేసుకోమని చెప్పాడు. దీంతో మహబూబ్‌నగర్‌లో కరెంట్‌ గానుగ నుండి వంట నూనెలు తెచ్చి వాడుకునేవాళ్లం. అప్పుడే వచ్చింది ఆలోచన మేమే గానుగను ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని. కరెంట్‌తో నడిచేది కాకుండా ఎద్దులతో తిరిగే కట్టె గానుగ గురించి వెతికాం. మైసూరులో ఉందని తెలిసి, అక్కడికెళ్లి చూశాం. అలా మూడేళ్ల క్రితం ఎద్దుల కట్టె గానుగను ఏర్పాటు చేసి, నూనె తీయడం ప్రారంభించాం. పల్లి, కొబ్బర, ఆవిసె, కుసుమ, నువ్వులతో నూనె తీయడం ప్రారంభించాం.  

ఏడాది పాటు శిక్షణ... గానుగ ఏర్పాటు చేసిన తర్వాత పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం వాళ్లు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో, నేను చేస్తున్న పని వివరించాను. ఎలాగైనా అందరికీ మంచి గానుగ నూనె అందించాలి అని చెప్పాను. ఏడాది పాటు నెలకు కొన్ని రోజుల చొప్పున మార్కెటింగ్‌ గురించి కూడా శిక్షణ ఇచ్చారు. అప్పటి వరకు మా చుట్టుపక్కల వారికే గానుగ నూనె అమ్మేదాన్ని. శిక్షణ తర్వాత మరో ఐదు గానుగలను ఏర్పాటు చేశాను. 15 లక్షల రూపాయల పెట్టుబడితో షెడ్డు నిర్మించి కట్టెగానుగలను ఏర్పాటు చేసి నూనె ఉత్పత్తి పెంచాను. 

ఇతర రాష్ట్రాల నుంచి... వివిధ రకాల నూనెలను గానుగ ద్వారా తీసేందుకు అవసరమైన ముడి సరుకులకు ఒరిస్సా, కర్ణాటక నుంచి కూడా తెప్పిస్తాను. ప్రతి నెల ఆరు టన్నుల పల్లీలు, రెండు టన్నుల కొబ్బరి, మూడు టన్నుల కుసుమ, రెండు టన్నుల నువ్వులు తీసుకుంటున్నాను. వీటిలో గడ్డి నువ్వులు ఒరిస్సా నుండి, కుసుమ, కొబ్బరి కర్ణాటక నుండి, పల్లీలు, నువ్వులు మహబూబ్‌నగర్‌ నుండి దిగుమతి చేసుకుని నూనె తీస్తున్నాను’ అని వివరించింది జయమ్మ.

కార్యక్రమాల ఏర్పాటు... గానుగలను ఏర్పాటు చేసిన తర్వాత 4 సార్లు 170 మందికి గానుగ నూనె తయారీపై శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది జయమ్మ. వారందరికీ వసతి, భోజన సదుపాయాలను కల్పించింది. ఆరోగ్యదాయిని పేరుతో వివిధ జిల్లాల్లో కొత్తగా ఎనిమిది గానుగలను ఏర్పాటు చేసేందుకు సహకరించింది. దీంతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడ ఆరోగ్యదాయిని పేరుతో చేపడుతోంది. పాఠశాలకు వాటర్‌ ఫిల్టర్, పుస్తకాలు, కరెంటు సౌకర్యం కల్పించడం వంటివి కూడ చేపడుతూ జయమ్మ ఆదర్శంగా నిలుస్తుంది. ‘మరో నాలుగు గానుగలు ఏర్పాటు చేసి అమెరికాకు కూడా ఇక్కడి నూనెలు ఎగుమతి చేస్తా. కల్తీ నూనెలకు అడ్డుకట్ట వేసి స్వచ్చమైన నూనెను అందిచడమే లక్ష్యం’ అంటూ గానుగల నిర్వహణ చూడటంలో మునిగిపోయింది జయమ్మ.  

విదేశాలకు ఎగుమతి
‘ఇప్పుడు మా ఊరు జక్లపల్లి నుండి కట్టె గానుగ ద్వారా తీసిన నూనె విదేశాలకు కూడా ఎగమతి అవుతుంది. హైద్రాబాద్‌లోని ఓ సంస్థ సహకారంతో దుబాయ్, సింగపూర్, మలేషియాలకూ పంపుతున్నాం. మూడు నెలలకొకసారి దాదాపు 4 వేల లీటర్ల నూనెను ఎగుమతి చేస్తున్నాం. గానుగ తీసిన పిప్పిని పశువుల దాణాగా వాడుతున్నాం. పశువుల దాణాకు ఇక్కడ మంచి గిరాకీ ఉంది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాలకు కొరియర్‌ ద్వారా స్వచ్ఛమైన కల్తీలేని నూనెను పంపుతున్నాం. మా కుటుంబ సభ్యులతో పాటు మరో 15 మంది ఈ నూనె వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నారు’ అని వివరించింది జయమ్మ.

చేతి నిండా పని
గానుగ ఏర్పాటైనప్పటి నుండి ఇక్కడ పనిచేస్తున్నా. అంతకు ముందు వ్యవసాయ పనులకు వెళ్లేదాన్ని. కొన్నాళ్లు పని ఉండేది. కొన్నాళ్లు ఖాళీగా ఉండేదాన్ని. ఈ గానుగలు వచ్చాక  చేతి నిండా పని దొరుకుతుంది. పని కోసం వెదుకులాడే అవసరం లేకుండా పోయింది.
– లక్ష్మి, జక్లపల్లి
 

– బోయిని గోపాల్, గండీడ్, మహబూబ్‌నగర్, సాక్షి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top